మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
యువత సాధికారతతో, దేశ భవిత బలోపేతం!
వెబినార్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ..
జాతి భవిత నిర్మాతలు యువజనులేనని స్పష్టీకరణ
బడ్జెట్ గుణాత్మక ప్రభావంపై వెబినార్ నిర్వహణ
Posted On:
21 FEB 2022 6:57PM by PIB Hyderabad
జాతి నిర్మాణంలో యువతరానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతి భవిత నిర్మాణంలో కీలకపాత్ర పోషించే యువతకు సాధికరత కల్పించడమంటే, దేశ భవిష్యత్తును మరింత బలోపేతం చేయడమేనని ఆయన అన్నారు. -విద్యా, నైపుణ్య రంగాలపై 2022వ సంవత్సరపు కేంద్ర బడ్జెట్ గుణాత్మక ప్రభావం- అన్న అంశంపై ఏర్పాటు చేసిన వెబినార్ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సంబంధిత రంగాల కేంద్ర మంత్రులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞాన, పరిశోధనా రంగాల భాగస్వామ్య వర్గాల ప్రతినిధులు ఈ వెబినార్ సదస్సులో పాలుపంచుకున్నారు.
2022వ సంవత్సరపు బడ్జెట్లో ప్రధానంగా ప్రస్తావించిన ఐదు అంశాలను ప్రధానమంత్రి సదస్సులో విపులంగా వివరించారు. నాణ్యమైన విద్యను సార్వత్రికం చేయడం అన్న అంశాన్ని ఆయన తన ప్రసంగంలో మొట్టమొదటగా ప్రస్తావించారు. నాణ్యమైన విద్య లక్ష్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. విద్యారంగంలో సామర్థ్యాలను ఇనుమడింపజేయడంతో పాటుగా, మెరుగుపరిచిన నాణ్యతా ప్రమాణాలతో విద్యారంగాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇక నైపుణ్యాభివృద్ధి అనే అంశంపై చూపుతున్న శ్రద్ధను రెండవ అంశంగా ప్రస్తావించారు. డిజిటల్ నైపుణ్యాల వ్యవస్థ ఏర్పాటు, పారిశ్రామిరంగం అవసరాలకు తగినట్టుగా, పరిశ్రమలతో మెరుగైన అనుసంధానం లక్ష్యంగా నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
పట్టణ ప్రణాళిక, నమూనా రూపకల్పనకు సంబంధించిన గతకాలపు అనుభవాన్ని, విజ్ఞానాన్ని విద్యారంగంలో పొందుపరిచే విషయాన్ని 3వ అంశంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
విద్య అంతర్జాతీయీకరణకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని మూడవ అంశంగా మోదీ ప్రస్తావించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన విదేశీ విశ్వవిద్యాలయాలను దేశానికి రప్పించడం, గిఫ్ట్ సిటీ (జి.ఐ.ఎఫ్.టి.) తరహా సంస్థలను ప్రోత్సహించడం, ఆర్థిక సాంకేతక పరిజ్ఞాన సంబంధిత సంస్థలను రప్పించడం తదితర అంశాలను ప్రధాని ప్రస్తావించారు.
భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ప్రపంచ స్థాయి మార్కెటింగ్ అవకాశాలు ఉన్న అనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ (ఎ.వి.జి.సి.) రంగంపై దృష్టిని కేంద్రీకరించే విషయాన్ని ఐదవ అంశంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. “జాతీయ విద్యా విధానాన్ని సాకారం చేసుకునేందుకు ఈ బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుంది”, అని ఆయన అన్నారు.
బడ్జెట్.ను ఒక పరివర్తనా ఉపకరణంగా తీర్చిదిద్దేందుకు దోహదపడే ఇటీవలి మార్పులను ప్రధానమంత్రి తన ప్రసంగం చివర్లో వివరించారు. బడ్జెట్. కేటాయింపులను క్షేత్రస్థాయిలో నిరాటంకంగా అమలు చేయాలని భాగస్వామ్య వర్గాలకు పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో బడ్జెట్ సమర్పణ ఒక నెల ముందస్తుగానే జరగడం వల్ల, ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి దాన్ని అమలు జరిపే సమయానికల్లా, అన్ని రకాల సన్నాహాలు, చర్చలు పూర్తి చేయగలుగుతున్నామని ప్రధాని అన్నారు. బడ్జెట్ కేటాయింపులనుంచి గరిష్టస్థాయి ఫలితాలను సాధించుకునేందుకు కృషి చేయాలని భాగస్వామ్య వర్గాలకు సూచించారు. “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు, జాతీయ విద్యా విధానం అమలు నేపథ్యంలో అమలులోకి వచ్చిన తొలి బడ్జెట్ ఇదే. ఈ బడ్జెట్ ద్వారానే అమృత కాలం లక్ష్యంగా సత్వరం పునాదులు వేయాలని సంకల్పించాం.” అని ప్రధానమంత్రి అన్నారు. “బడ్జెట్ అంటే కేవలం గణాంకాలు, లెక్కలు మాత్రమే కాదు. సక్రమంగా అమలు జరిపిన పక్షంలో బడ్జెట్ ద్వారా పరిమిత వనరులతోనే గణనీయమైన గొప్ప మార్పును తీసుకురావచ్చు” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
వెబినార్ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం కోసం ఈ వెబ్ లింకును సంప్రదించవచ్చు. : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1800024
బడ్దెట్ అమలుకు ముందస్తుగా, బడ్జెట్. సమర్పణ తర్వాత సంబంధిత భాగస్వామ్య వర్గాలతో జరిపే చర్చలు, సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా ఈ వెబినార్ సదస్సును నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల, వివిధ విద్యా సంస్థల, పారిశ్రామిక రంగాల నిపుణులతో కలసి మేధోమధనం సాగించడం, వివిధ రంగాలకు సంబంధించిన అంశాల అమలులో ముందుకు సాగేందుకు తగిన వ్యూహాన్ని గుర్తించడం వంటి లక్ష్యాలతో ఈ వెబినార్ సదస్సును నిర్వహించారు. వివిధ ఇతి వృత్తాలతో ఈ వెబినార్ సదస్సులో చర్చా గోష్టులను చేపట్టారు. వివిధ మంత్రిత్వ శాఖల, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పారిశ్రామిక రంగం ప్రతినిధులు, నైపుణ్యాభివృద్ధి సంఘాల నిపుణులు, విద్యా వేత్తలు, విద్యార్థులు, ఇతర నిపుణులు ఈ సదస్సులో పాలుపంచుకున్నారు.
వెబినార్ సదస్సుకోసం గుర్తించిన వివిధ అంశాలు:
- డిజిటల్ విశ్వవిద్యాలయం:
అందరికీ అందుబాటులో ఉండేలా ప్రపంచ శ్రేణి ఉన్నత విద్యను తీర్చిదిద్దడం. అన్న ఇతివృత్తంతో జరిగిన ఈ చర్చాగోష్టికి కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కె. సంజయ్ మూర్తి, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కె. రాజారామన్ సహాధ్యక్షత వహించారు. 2022 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన విస్తృతాంశాలపై చర్చించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో సమగ్ర విద్యా సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థను, డిజిటల్ వేదికను, పాఠ్యాంశాలను సృష్టించడం, సమర్థవంతమైన డిజిటల్ విద్యాబోధన పద్ధతులు రూపొందించడం, పటిష్టమైన శిక్షణా సిబ్బంది ఏర్పాటు, వర్చువల్ లేబరేటరీలు, డిజటల్ విద్యా బోధన, అభ్యసన వంటి అంశాలు డిజిటిల్ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. చర్చ సందర్భంగా బహుభాషలతో కూడిన, అందుబాటులో ఉండే అధ్యయన నిర్వహణా వ్యవస్థ, అధ్యయన అనుభవాలు, పటిష్టమైన అధ్యయన సమూహాలతో తోటి అధ్యయన కర్తలను అనుసంధానం చేయడం, ఆన్ లైన్ విద్యాబోధనను, భౌతిక విద్యా విధానంతో సమ్మిళితం చేయడం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్యానెల్ చర్చలో వక్తలంతా అభిప్రాయపడ్డారు. నాణ్యమైన ఉన్నత విద్యను విస్తృతస్థాయిలో ఆందుబాటులోకి తెచ్చేందుకు డిజిటల్ విశ్వవిద్యాలయం దోహదపడుతుంది. దేశంలోని గ్రామీణ/మారుమూల/గిరిజన ప్రాంతాలకు ఇది ఎంతో ప్రయోజనకారి. బోధనా సిబ్బంది, ఫ్యాకల్టీ అభివృద్ధి ప్రక్రియలో ఏర్పడే అంతరాలను పూడ్చివేయడానికి, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలకు నోచుకోని వర్గాలను నమోదు చేయడానికి, నైపుణ్యాల ఉపాధికల్పనా సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రాంతీయ భాషల్లో నాణ్యమైన అధ్యయనా సామగ్రిని రూపొందించడానికి, నియత-అనియత విద్యా ఆవకాశాలకు, ఇతర సంబంధిత అంశాలకు డిజిటల్ విశ్వవిద్యాలయం ఎంతో ఉపకరిస్తుంది.
- డిజిటల్ టీచర్:
సర్వీసులోని ఉపాధ్యాయులతోపాటుగా, సర్వీసు ముందస్తుగా కూడా శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన కోర్సు ఇది. మరింత మెరుగైన అధ్యయన ఫలితాలు, నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా నాణ్యతతో కూడిన ఎలక్ట్రానిక్ పాఠ్యాంశాలు, వర్చువల్ లేబరేటరీల రూపకల్పన ప్రధానాంశాలుగా జరిగిన చర్చాగోష్టికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎ.పి. సాహ్నే, కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి అనితా కర్వాల్ సహాధ్యక్షత వహించారు. యూనిసెఫ్ ప్రతినిధి టెర్రీ డుర్నియాన్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి డాక్టర్ షబ్నమ్ సిన్హా వక్తలుగా పాల్గొన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అధ్యయనా ఫలితాల పరిస్థితి గురించి వారు విపులంగా చర్చించారు. డిజిటల్ టీచర్ వ్యవస్థ, నాణ్యమైన పాఠ్యాంశాల రూపకల్పన వంటి అంశాలనుంచి,.. డిజిటల్ ఉపకరణాలను వినియోగించేలా ఉపాధ్యాయులకు తగిన సాధికారత కల్పించడం వరకూ,..డిజిటల్ విద్యకు సంబంధించిన పలు విస్తృతాంశాలపై వారు చర్చించారు. అందరికీ విద్య అనే అంశాన్ని జాతీయ ప్రాధాన్యతతో అమలుపరిచేందుకు వీలుగా ‘డిజిటల్ టీచర్స్’ అనే ఉపకరణాన్ని మరింత వెసులుబాటుతో వినియోగించుకొనే మార్గాలను, ఆ ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కార పద్ధతులను, వ్యూహాలను వారు సూచించారు.
- వన్ క్లాస్, వన్ చానెల్ పద్ధతిని విస్తృతం చేయడం:
అతి సుదూరమైన మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన డిజిటల్ విద్యాబోధనా వ్యవస్థను చేరువగా తీసుకెళ్లడం....ఈ అంశంపై చర్చాగోష్టికి ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు, భాస్కరాచార్య నేషనల్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ (బిసాజ్-ఎన్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టి.పి. సింగ్ సహాధ్యక్షత వహించారు. విద్యాబోధనకు సంబంధించి దేశంలో 200 విద్యాచానళ్ల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ వివరాలను, సన్నాహాలను వివరిస్తూ ఒక నివేదికను డాక్టర్ టి.పి. సింగ్ సదస్సుకు సమర్పించారు. ఒకే తరగతి, ఒకే ఛానెల్ (వన్ క్లాస్, వన్ చానెల్) పద్ధతిని విస్తృతం చేసే ప్రయత్నంలో ఎదురయ్యే సవాళ్లను గురించి కూడా సదస్సులో చర్చించారు. విద్యా బోధనా పద్ధతుల అమలులో ఆవిష్కరణలను, ఈ ప్రయత్నంలో తలెత్తే సాంకేతిక నిర్వహణాపరమైన అంశాలను గురించి కూడా చర్చించారు. వందే గుజరాత్ చానెల్స్, వాటి పనితీరుపై జరిపిన అధ్యయన నివేదికను కూడా ఈ సదస్సుకు సమర్పించారు.
4. పట్టణ ప్రణాళిక, నమూనాల రూపకల్పనపై భారతదేశపు పరిజ్ఞానం:
ఈ చర్చాగోష్టికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి మనోజ్ జోషి సహాధ్యక్షత వహించారు. పట్టణ ప్రణాళికా రంగంలో కొత్తగా ఆవిర్భవిస్తున్న ధోరణులు, పద్ధతులు, పట్టణ ప్రణాళిక, నమూనాల రూపకల్పనకు సంబంధించి భారతదేశపు పరిజ్ఞానంపై దృష్టిని కేంద్రీకరించడం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. పట్టణ ప్రణాళిక ద్వారా సామాజిక, ఆర్థిక లక్యాలసాధనా ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానానికి మరింత ఎక్కువ ప్రమేయం, ప్రాధాన్యం కల్పించే అంశంపై నిపుణులు చర్చ జరిపారు. దేశంలో ప్రణాళికా అధ్యయన అంశాలను మరోసారి పరిశీలించవలసిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. సరైన విధానాలను సూచించి, సామర్థ్యాల నిర్మాణంపై, నైపుణ్యాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించేలా తగిన వనరులను సృష్టించుకోవలసిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
5. పరిశ్రమలు, నైపుణ్యాల మధ్య అనుసంధానం పెంపొందించడం
ఈ అంశంపై జరిగిన చర్జాగోష్టికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ అగ్గర్వాల్, పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ జి. కమలవర్ధన రావు, కేంద్ర పారిశ్రామిక రంగ ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య వ్యవహారాల శాఖ (డి.పి.ఐ.ఐ.టి.) కార్యదర్శి అనురాగ్ జైన్ ఉమ్మడిగా అధ్యక్షత వహించారు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్.ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ అగ్గర్వాల్ మాట్లాడుతూ, ఈ విషయంలో క్రియాశీలక నైపుణ్యాల వ్యవస్థ ఎంతో అవసరమని, పారిశ్రామిక అవసరాలకు, జాతీయ నైపుణ్యాల, అర్హతల వ్యవస్థకు (ఎన్.ఎస్.క్యు.ఎఫ్.) అనుగుణమైన నైపుణ్యాలు మరింత ఆవశ్యకమని చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ, ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంపొందించేందుకు కావలసిన నైపుణ్యాభివృద్ధి అంశాలు, అవకాశాల గురించి వివరించారు.
6. గిఫ్ట్ సిటీలో విద్యా సంస్థల అభివృద్ధి
ఈ అంశంపై జరిగిన సదస్సుకు అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్ర ప్రాధికార సంస్థ (ఐ.ఎఫ్.ఎస్.సి.ఎ.) చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. గిఫ్ట్ సిటీ చైర్మన్ సుధీర్ మంకడ్ సహాధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా అనేక విస్తృతాంశాలపై చర్చ జరిగింది. గిఫ్ట్ సిటీ పరిధిలో విదేశీ సంస్థల ఏర్పాటుకు అవసరమైన పద్ధతులు, ప్రక్రియ, ప్రభుత్వ పాలనా పరమైన అంశాలు, న్యాయపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. రూపకల్పనా విధానాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను, వ్యూహాలను ప్యానెల్.లోని వక్తలు సూచించారు. భవిష్యత్తు ప్రయోజనాలకోసం ఉద్దేశించిన విద్యాబోధనా నమూనాలు దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే అదుకు,.. ప్రభుత్వపరంగా, న్యాయపరంగా పటిష్టమైన వ్యవస్థ అవసరమని ఈ చర్చలో వక్తలు అభిప్రాయపడ్డారు.
7. అనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ (ఎ.వి.జి.సి..)రంగంతో పరిశ్రమలు- నైపుణ్యాల అనుసంధాన్ని బలోపేతం చేయడం
ఈ అంశంపై జరిగిన చర్చా గోష్టికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాక కార్యదర్శి అపూర్వ చంద్ర, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్.పెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ అధనపు కార్యదర్శి అతుల్ తివారీ ఉమ్మడిగా అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో అపూర్వ చంద్ర ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సారి బడ్జెట్ ప్రసంగంలో ఎ.వి.జి.సి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అసరాన్ని ప్రస్తావించడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని, దీనితో ఎ.వి.జి.సి. రంగం ప్రాముఖ్యతను, దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో ఆ రంగం పాత్రను ఇది తెలియజేస్తోందని అన్నారు. ఈ సదస్సులో అతుల్ తివారీ మాట్లాడుతూ,..కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ చేపట్టే వివిధ కార్యకలాపాలను వివరించారు. పి.ఎం. కౌశల్ వికాస్ యోజన, ఐ.టి.ఐ.లు, పి.ఎం. కౌశల కేంద్రాల పరిధిలో జరిగే స్వల్పకాలిక, దీర్ఘకాలిక శిక్షణ, తదతర అంశాలను ఆయన ఉదహరించారు. ఈ రంగంలో నైపుణ్యాలకు సంబంధించి ఎలాంటి అవసరాన్ని అయినా తీర్చేందుకు తాము సంసిద్ధంగా ఉన్నట్టు ఆయన హామీ ఇచ్చారు. ఎ.వి.జి.సి. రంగానికి సంబంధించి విద్యాబోధన, నైపుణ్యాలు వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రంగానికి సంబంధించి స్కూళ్లలో తొలి వయస్సులోనే నైపుణ్యాలను అలవర్చుకోవలసిన అవసరాన్ని గురించి చర్చించారు. భవిష్యత్తులో వృద్ధి, ఉపాధి అవకాశాల సామర్థ్యం తదితర అంశాలపై కూడా ఈ సదస్సులో చర్చ జరిగింది.
వెబినార్ ముగింపు సందర్భంగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ మాట్లాడుతూ, ఏడు ఉప అంశాలు, ఇతివృత్తాలకు సంబంధించి పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించడం అభినందనీయమని అన్నారు. బడ్జెట్లో చేసిన వివిధ ప్రకటనల అమలుకు సంబంధించి సమగ్ర వ్యూహాన్ని రూపొందించడమే లక్ష్యంగా ఈ వెబినార్.ను నిర్వహించినట్టు చెప్పారు. ఈ రంగంలో అమలు జరిగే సంస్కరణలను, చోటుచేసుకునే పరిణామాలను తెలుసుకునేందుకు కూడా ఈ వెబినార్ ఉపకరిస్తుందన్నారు. వివిద భాగస్వామ్య వర్గాల ఆలోచనలనుంచి అత్యుత్తమ విధానాలను వెలికి తెచ్చేందుకు కూడా ఈ వెబినార్ దోహదపడుతుందని అన్నారు. భాగస్వామ్య వర్గాల మధ్య సమన్వయం సాధించేందుకు, అవసరమైన రంగాల ప్రాధాన్యాలను తెలుసుకునేందుకు, భవిష్యత్తుకోసం అత్యుత్తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు కూడా ఈ వెబినార్ వీలు కలిగించిందన్నారు. ఇందుకు కృషి చేసిన భాగస్వాములకు, నిపుణులకు ఆయన అభినందనలు తెలిపారు.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్కిల్ ఇండియా పథకం కింద చేపట్టిన కార్యకలాపాలన్నింటినీ విద్యారంగంతో సమీకృతం చేసి, విద్యార్థులు నైపుణ్యాల వ్యవస్థతో సులభంగా అనుసంధానం చేయవలసిన అవసరం ఉందన్నారు. నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల ద్వారా వేగంగా మారుతున్న పారిశ్రామిక అవసరాలకు తగినట్టుగా ఉపాధి కల్పన, క్రియాశీలక ఔత్సాహిక తత్వం సాధించే అవకాశం ఉండాలన్నారు. డెష్ స్టాక్ ఇ పోర్టల్ (DESH Stack e-portal) ప్రారంభంతో దేశంలో నైపుణ్యాభివృద్ధి రంగం సామర్థ్యాన్ని మనం మరింతగా పెంపొందించుకోవాలని, తద్వారా ప్రపంచ శ్రేణి సాంకేతిక పరిజ్ఞాన రంగంలో భారతదేశం అగ్రశ్రేణిలో నిలిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
****
(Release ID: 1800195)
Visitor Counter : 194