ఉప రాష్ట్రపతి సచివాలయం
రామానుజుని ఆదర్శాలు స్ఫూర్తిదాయకం – ఉపరాష్ట్రపతి
• యువత రామానుజుని ఆదర్శాలను అర్ధం చేసుకుని, వివక్షలకు తావులేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
• అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలలో రామానుజుల వారి స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది
• సమానత్వ సాధన కోసం కృషి చేసిన రామానుజుల వారు నిజమైన ఆధ్యాత్మిక స్వరూపులు
• హైదరాబాద్ ముచ్చింతల్ లో ఉన్న సమతా ప్రతిమ (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ)ను సందర్శించిన ఉపరాష్ట్రపతి
• సమతా ప్రతిమ ఏర్పాటులో విశేష కృషి చేసిన శ్రీ చిన్న జియర్ స్వామి వారికి అభినందనలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి
• అష్టాక్షరి మంత్రాన్ని సమాజం కోసం బహిర్గతం చేసి ఆదర్శవాది రామానుజులు
• కులం కన్నా... మతం కన్నా... గుణం మిన్న అనే ఆదర్శాన్ని రామానుజులు ఆచరణలో చూపారు
• రామానుజుల తిరుక్కులత్తార్, మహాత్మ గాంధీ హరిజన పదాల వెనుక స్ఫూర్తి ఒక్కటే
• సందర్శన స్థలంగానే గాక, స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దడం అభినందనీయం
• తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకునేందుకు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలి
Posted On:
12 FEB 2022 8:42PM by PIB Hyderabad
వివక్షలకు తావులేని సమ సమాజ నిర్మాణంలో రామానుజుని ఆదర్శాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. వారి ఆదర్శాలను యువత అర్ధం చేసుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. 1000 సంవత్సరాల క్రితమే అంటరానితనం, వివక్షలకు తావులేని సమాజాన్ని ఆకాంక్షించి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే గాక, సామాజిక సంస్కరణాభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారన్నారు.
భగవంతుడు అందరివాడు అంటూ శ్రీ రామానుజుల వారు ప్రవచించిన విశిష్టాద్వైతం ప్రపంచానికి నూతన మార్గంలో దిశానిర్దేశం చేసిందన్న ఉపరాష్ట్రపతి, అలాంటి మహనీయుని అతిపెద్ద విగ్రహాన్ని ముచ్చింతల్ లో నెలకొల్పడం వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే గాక, వారి స్ఫూర్తిని ముందుతరాలకు అందజేయగలదన్నారు. సమతా ప్రతిమ ఏర్పాటులో విశేష కృషి చేసిన శ్రీ చిన్నజీయర్ స్వామి వారికి, భూమిని విరాళంగా ఇచ్చిన మై హోమ్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారికి, రామానుజ సహస్రాబ్ధి కమిటీ సహా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు.
రామానుజుల వారు గురువు కోసం సాగించిన అన్వేషణ ఈతరం యువతకు స్ఫూర్తిదాయకమన్న ఉపరాష్ట్రపతి, ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో గురువు ప్రాధాన్యతను గుర్తించే దిశగా వారి జీవితం నుంచి నేర్చుకోవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. 18 పర్యాయాలు నడిచి వెళ్ళి, ఎన్నో శ్రమలకోర్చి సంపాదించుకున్న అష్టాక్షరి మంత్రాన్ని సమాజం కోసం, సామాన్య జనావళి కోసం బహిర్గతం చేసి, విద్య అందరికీ.. విజ్ఞానం అందరిదీ అని చాటిన వారి స్ఫూర్తి ఆదర్శనీయమైనదని తెలిపారు. రామానుజుని బాటలో గురువులు, ఆచార్యులు, ఆధ్యాత్మికవేత్తలు సామాన్యులకు మరింత చేరువ కావాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతమైన సమాజాన్ని ఆకాంక్షించిన రామానుజుల వారు గురువు విషయంలోనే గాక, శిష్యుల విషయంలోనూ అదే ఆదర్శాలను కొనసాగించారని తెలిపారు. అంటరానితనం అమానుషమని శాసనం చేసిన రామానుజుల వారు, వారిని తిరుక్కులత్తార్ అని సంబోధించారన్న ఉపరాష్ట్రపతి, మహాత్ముడు సూచించిన హరిజన పదంలోనూ ఇదే స్ఫూర్తి దాగి ఉందన్నారు. అంతేకాకుండా మహాత్ముడు ఎంతో ఇష్టపడే వైష్ణవ జనతో గీతం కూడా రామానుజుల స్ఫూర్తితో రచించినదేనని పేర్కొన్నారు.
స్త్రీ విద్య విషయంలో వెయ్యేళ్ళ క్రితమే రామానుజుల వారు ఆచరణాత్మక ఆలోచన విధానాన్ని తెలియజేశారన్న ఉపరాష్ట్రపతి, బేటీ బచావ్ బేటీ పఢావ్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆచరణలో చూపించడం అభినందనీయమన్నారు. గడచిన ఏడేళ్ళలో బాలికల జననాల నిష్పత్తి 19 పాయింట్లు పెరగడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన, స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళ తర్వాత కూడా స్త్రీ విద్య గురించి, మహిళా సాధికారత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడడం విచారకరమన్నారు. ఇలాంటి వివక్షలకు అతీతమైన సమాజాన్ని నిర్మించేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. స్వచ్ఛభారత్ అభియాన్, జల్ జీవన్ మిషన్, సౌభాగ్య, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల్లోని సబ్ కా సాత్, సబ్ కా వికా, సబ్ కా విశ్వాస్ నినాదం వెనుక రామానుజుల వారి ఆలోచనలతో పాటు, అంత్యోదయ స్ఫూర్తి కనపడుతుందని తెలిపారు.
సమతా విగ్రహాన్ని సందర్శన స్థలంగానే గాకుండా, రామానుజాచార్యుల వారి చరిత్రను, సందేశాలను తెలియజేసే విధంగా గ్యాలరీను ఏర్పాటు చేయడం, వేదిక్ డిజిటల్ లైబ్రరీలకు రూపకల్పన చేయడం మంచి ఆలోచన అన్న ఉపరాష్ట్రపతి, వీటి ద్వారా ఆధ్యాత్మిక స్ఫూర్తి పరిఢవిల్లడమే గాక, మన సంస్కృతి – సంప్రదాయాల పరిరక్షణ సాధ్యమౌతుందని ఆకాంక్షించారు. ఇదే కేంద్రంలో ఆధ్యాత్మికతతో పాటు తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే విధంగా, భాషాభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బావుంటుందని శ్రీ జీయర్ స్వామివారికి ఉపరాష్ట్రపతి సూచించారు. విగ్రహ నిర్మాణంలో శ్రీ రామేశ్వరరావు గారి కృషిని అభినందించారు.
హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, కేంద్ర వినియోగదారులు వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అశ్విని చౌబే, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి, ప్రధాన ట్రస్టీ శ్రీ జె.రామేశ్వరరావు, సినీ నటులు శ్రీ చిరంజీవి, శ్రీ రామానుజ సహస్రాబ్ది కమిటీ అధ్యక్షులు శ్రీ జి.వి. భాస్కర్ రావు, జియ్యర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ అధ్యక్షులు శ్రీ సి.లక్ష్మణరావు, దివ్యసాకేతం అధ్యక్షులు శ్రీ కె.వి.చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(Release ID: 1797984)
Visitor Counter : 211