జల శక్తి మంత్రిత్వ శాఖ

నదుల పునరుజ్జీవంలో యువతకు మరింత భాగస్వామ్యం!


వెబ్ సిరీస్ 3వ విడత కార్యక్రమంలో
ఎన్.ఎం.జి.సి డైరెక్టర్ జనరల్ ఉద్బోధ
జాతీయ స్వచ్ఛ గంగా పథకం ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ
జల సంరక్షణ, నదుల పునరుజ్జీవం భావనలను
యువత మనసుల్లో రగిల్చాలని డి.జి. పిలుపు..

జలశక్తి అభియాన్ పథకం కింద రూపుదాల్చిన
47లక్షల జలసంరక్షణ నిర్మాణాలు

Posted On: 09 FEB 2022 2:30PM by PIB Hyderabad

   'నమామి గంగే' పేరిట చేపట్టిన నదుల పునరుజ్జీవం ప్రక్రియలో యువజనుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే లక్ష్యంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 3వ విడత వెబ్ సిరీస్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 'యువత మనసుల ఉద్దీపన, నదుల పునరుజ్జీవం' పేరిట ఈ వెబ్ సిరీస్ కార్యక్రమాల పరంపరను ఎ.పి.ఎ.సి. న్యూస్ నెట్వర్ సంస్థతో కలసి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ వస్తోంది. నాలుగు గంటలపాటు జరిగిన వెబ్ సిరీస్ తాజా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ నిపుణులు, శిక్షకులు పాల్గొన్నారు.

   కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జాతీయ స్వచ్ఛ గంగా పథకం (ఎన్.ఎం.సి.జి.) డైరెక్టర్ జనరల్ జి. ఆశోక్ కుమార్ మాట్లాడుతూ, నీటి సంరక్షణ, నదుల పునరుజ్జీవం ప్రాధాన్యం అన్న భావనలను యువజనుల హృదయాల్లో రగిల్చడం ఇపుడు అత్యంత ఆవశ్యకమని అన్నారు. నీటికీ, యువతకూ మధ్య ఎంతో సాదృశ్యం, సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. జలశక్తిలాగే, యువశక్తి కూడా చాలా గొప్పదని, సరైన మార్గంలోకి నిర్మాణాత్మక రీతిలో క్రమబద్ధీకరిస్తే జీవితానికి అదే ఆధారభూతమవుతుందని అన్నారు. ఈ రకంగా చూస్తే ‘జలశక్తి’, ‘యువశక్తి’ సమానస్థాయి కలిగిన శక్తి రూపాలని ఆయన అన్నారు.

  చిన్నపాటి చర్యలు కూడా భారీ ఫలితాలను అందిస్తాయని అశోక్ కుమార్ అభిప్రాయపడ్డారు. జలశక్తి అభియాన్ పథకం కింద, -వర్షం నీటిని ఒడిసి పట్టు- అనే కార్యక్రమం పేరిట 47లక్షలకు పైగా జల సంరక్షణ నిర్మాణాలు రూపుదాల్చడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. మొదటగా చిన్న చిన్న నదులు, చిన్న ఏర్లు, కాలువలను పునరుద్ధరించడం ద్వారా దేశంలో జలసంరక్షణను ప్రారంభించాలని ఆయన సూచించారు. నదీ జలాలను పొదుపుచేయడమే కాక, నీటిని, నదులను గౌరవించే ఆనవాయితీని యువత అలవర్చుకునేలా, ప్రముఖ శిక్షకులు, ప్రబోధకులు తగిన కృషి చేయాలని అన్నారు.

https://ci3.googleusercontent.com/proxy/kxpEeol4wD8qBMAsgf7raiRsqLCorvwVlOuQMrVTFljPUSjGB-6B8wvX_ZpX6DwUKIKXAsJOWn9Ty1QKhXqekJ8FU-Pn6icX_ExP-_wGEkxaKDc6dXredQ_abQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016H4C.png

  హర్యానాకు చెందిన అమిటీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ డాక్టర్ పి.బి. శర్మ, ఢిల్లీ రాజధాని ప్రాంతానికి చెందిన కె.ఐ.ఇ.టి. గ్రూపు సంస్థల డీన్ డాక్టర్ శైలేంద్ర కుమార్ తివారీ, గ్రేటర్ నోయిడాకు చెందిన శారదా విశ్వవిద్యాలయం టీచింగ్, లెర్నింగ్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సూర్య ప్రసాదరావు సువ్వారు తదితర నిపుణులు ఈ వెబ్ సిరీస్ కార్యక్రమంలో ప్యానెలిస్టులుగా పాలుపంచుకున్నారు.

  డాక్టర్ పి.బి. శర్మ మాట్లాడుతూ, యువత హృదయాల్లోనే కాకుండా, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, పురపాలక అధికారులు, ఇతర భాగస్వామ్య వర్గాల మనసుల్లో కూడా నదుల సంరక్షణ, పునరుజ్జీవం అనే భావనను రగిలించాలని చెప్పారు. జలసంరక్షణకోసం విస్తృతస్థాయిలో వ్యూహాలను అనుసరించవలసిన అవసరం ఉందన్నారు. సుస్థిర జల వినియోగం పాటించడం,  నీటి వాడకం అలవాట్లను సవరించుకోవడం, నీటి సంరక్షణను అలవర్చుకునేలా జీవన శైలిని మార్చుకోవడం మన దేశానికి తప్పనిసరి అవసరాలని అన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 'జల సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాలు' తదితర సంస్థలను స్థాపించవలసిన అవసరం ఉందన్నారు.

 డాక్టర్ శైలేంద్ర కుమార్ తివారీ మాట్లాడుతూ, మన దేశంలోని నదీ జల పర్యావరణ వ్యవస్థలు,.. జీవ, జీవేతర వనరుల సంక్లిష్టమైన మిశ్రమరూపాలని, మనం ఎంతో జాగరూకతతో నదీజలాల వ్యవస్థను సంరక్షించుకోవాలని అన్నారు. సుస్థిర అభివృద్ధిపై మనం నిర్దేశించుకున్న 17 లక్ష్యాల్లో పర్యావరణ సుస్థిరతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, నదులను శాశ్వత వనరులుగా పరిగణించి, వాటి పర్యావరణ సమగ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

  డాక్టర్ సూర్యప్రసాద రావు సువ్వారు మాట్లాడుతూ, జలసంరక్షణ, నదుల పునరుజ్జీవానికి సంబంధించి నిర్వహించే సమాజ అనుసంధాన కార్యక్రమాలు ఎప్పటికీ అద్భుతమైన సత్ఫలితాలను అందిస్తాయన్నారు. సామాజికంగా సమంజసమైన, నిర్వహణా సౌలభ్యంతో కూడిన ప్రాజెక్టులను చేపట్టేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.  వాటర్ రీసైక్లింగ్, నీటి పునర్వినియోగానికి పటిష్టమైన పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని ఆయన సూచించారు.

 

***



(Release ID: 1797042) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Hindi