ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ. 10.68కోట్ల మోసం బట్టబయలు!
నవీముంబై సి.జి.ఎస్.టి కమిషనరేట్ దాడుల్లో
ఇన్.పుట్ క్రెడిట్ అక్రమాల గుట్టు రట్టు..
స్టీల్ కంపెనీ యజమాని అరెస్ట్
Posted On:
03 FEB 2022 4:48PM by PIB Hyderabad
పది కోట్ల రూపాయలకు పైగా అక్రమ కార్యకలాపాల గుట్టును నవీ ముంబైకి చెందిన వస్తు సేవల పన్ను కేంద్ర కమిషనరేట్ (సి.జి.ఎస్.టి) బుధవారం బట్టబయలు చేసింది. ఈ కేసులో నవనీత్ స్టీల్స్ (GSTIN: 27AEXPD3871K1ZV) అనే సంస్థ యజమానిని ఫిబ్రవరి 2వ తేదీన అరెస్ట్ చేశారు. రూ. 60కోట్ల రూపాయలకు బోగస్ ఇన్వాయిస్ బిల్లులు చూపించి, ఇన్.పుట్ క్రెడిట్ (ఐ.టి.సి.) సదుపాయాన్ని అక్రమంగా వాడుకున్న ఈ సంస్థ ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా నష్టం కలిగించిందని అధికారులు తెలిపారు.
నవనీత్ స్టీల్స్ సంస్థపై నవీ ముంబై సి.జి.ఎస్.టి. పరిధిలోని పన్ను ఎగవేత నిరోధక శాఖ అధికారుల బృందం జరిపిన విచారణలో ఈ అక్రమాల గుట్టు బట్టబయలైంది. అల్యూమినియం, స్టీల్ లోహాల ముడి సామగ్రి, తుది ఉత్పాదనల వాణిజ్యాన్ని తమ సంస్థ సాగిస్తున్నట్టుగా ఆ సంస్థ యజమాని ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే,.. అసలు ఉనికిలోనే లేని పలు రకాల బోగస్ సంస్థల ద్వారా ఐ.టి.సి. సదుపాయాన్ని ఈ సంస్థ అక్రమంగా వాడుకుందని విచారణలో తేలింది. నిందితుడైన సంస్థ యజమానిని 2017వ సంవత్సరపు సి.జి.ఎస్.టి చట్టంలోని సెక్షన్ 69 (1) కింద అరెస్ట్ చేశారు. ఇదే చట్టంలోని సెక్షన్ 132 (1) (బి) &(సి.) కింద నేరానికి పాల్పడినట్టు అభియోగం నమోదు చేశారు. యజమానిని ఫిబ్రవరి 3వ తేదీన బేలాపూర్.లోని వషీలో ఉన్న ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని, 14రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని నవీ ముంబై సి.జి.ఎస్.టి., సెంట్రల్ ఎక్సయిజ్ కమిషనర్ ప్రభాత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
అక్రమ కార్యకలాపాలకు, పన్ను ఎగవేతకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వారిపై గట్టి చర్యలు తీసుకునేందుకు ముంబై జోన్ సి.జి.ఎస్.టి. విభాగం ప్రారంభించిన దాడుల్లో భాగంగా ఈ కేసును నమోదు చేశారు. నవీ ముంబై కమిషరేట్ పరిధిలో అధికారులు ఇటీవల జరిపిన దాడుల్లో రూ. 425కోట్ల మేర పన్ను ఎగవేత కార్యకలాపాలను పసిగట్టారు. ఇందుకు సంబంధించి రూ. 20కోట్లను స్వాధీనం చేసకుని 11మందిని అరెస్ట్ చేశారు.
పన్ను ఎగవేతకు పాల్పడేవారిని గుర్తించేందుకు సి.జి.ఎస్.టి. శాఖ డేటా అనాలసిస్ ఉపకరణాలను వనియోగిస్తోంది. డేటా అనాలిసిస్, నెట్వర్ అనాలిస్ ప్రక్రియల ద్వారా గత ఐదు నెలల కాలంలో 625కి పైగా పన్ను ఎగవేత కేసులను ముంబై జోన్ సి.జి.ఎస్.టి. అధికారులు నమోదు చేశారు. రూ. 5,500కోట్ల మేర పన్ను ఎగవేతను కనుగొన్నారు. రూ. 630కోట్లను స్వాధీనం చేసుకుని 48మందిని అరెస్ట్ చేశారు. నిజాయితీగా పన్ను చెల్లించే వారిని అనారోగ్యకరమైన పోటీకి గురిచేస్తూ, ప్రభుత్వ ఖజనాకు నష్టంకలిగిస్తూ పలు రకాల అక్రమాలకు పాల్పడేవారిని, పన్ను ఎగవేదార్లను పట్టుకునేందుకు రానున్న రోజుల్లో సి.జి.ఎస్.టి. శాఖ తన దాడులను మరింత తీవ్రతరం చేయబోతోంది.
***
(Release ID: 1795300)
Visitor Counter : 222