"భారత, శ్రీలంక దేశాలు 2500 సంవత్సరాల కంటే ముందునుంచీ, పురాతనమైన మేధో, సాంస్కృతిక, మతపరమైన పరస్పర సంబంధాలతో కూడిన గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. కాగా, ఇటీవలి కాలంలో వాణిజ్యం, పెట్టుబడులు, విద్య తో సహా ఇతర రంగాలలో సహకారం మరింత పెరిగింది. అదే క్రమంలో ఎస్.&టి. లో సహకారం కూడా చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది." అని భారత శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ కు చెందిన, శాస్త్ర సాంకేతిక విభాగంలోని అంతర్జాతీయ సహాకారం అధిపతి, సలహాదారుడు, దేశం నుండి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన, భారతదేశ సహ-అధ్యక్షుడు, శ్రీ ఎస్.కె. వర్ష్ ణే, పేర్కొన్నారు.
“ఎస్.&టి. డొమైన్ లో సహకారం కోసం సాధ్యమయ్యే అనేక ఇతర అంశాలను చర్చించడానికి ఈ వేదిక అవకాశాన్ని కల్పిస్తోంది. ద్వైపాక్షిక సహకారానికి చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశం ఎస్.&టి. ఫెలోషిప్; ఈ- ఐ.టి.ఈ.సి. వంటి ఫెలోషిప్‌లను అందిస్తోంది. రెండు దేశాలూ భాగస్వాములుగా ఉన్న బిమ్-స్టెక్ (బి.ఐ.ఎం.ఎస్.టీ.ఈ.సి) వంటి అనేక బహుపాక్షిక వేదికల ద్వారా కూడా కలిసి పని చేయవచ్చు.”, అని ఆయన వివరించారు.
శ్రీలంక నుండి సహా అధ్యక్ష పదవిలో ఉన్న శ్రీలంక ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, పరిశోధన, ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీమతి దీపా లియాంగే మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సుస్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ఘాటించారు. తమ దేశంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఎస్.&టి. రంగాలతో పాటు, పరిశోధనా రంగాలలో భారతదేశం అందిస్తున్న సహకారాన్ని ఆమె స్వాగతించారు.
శ్రీలంకలో భారతదేశ డిప్యూటీ హైకమిషనర్, శ్రీ వినోద్ కె. జాకబ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీలంక తో సహకారానికి మార్గనిర్దేశనం చేయడానికి, భారతదేశం అనుసరిస్తున్న "పొరుగు ప్రాంతాలకు ప్రాధాన్యం" (నైబర్‌హుడ్ ఫస్ట్) అనే విధానంలో భాగంగా, ఇప్పటికే నెలకొన్న సహకార ప్రక్రియలను కొనసాగించడంతో పాటు, వీటిని మరింత పెంపొందించడానికి ఈ సమావేశం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ-ఐ.టి.ఈ.సి. కార్యక్రమం కింద, 2020 ఏప్రిల్ నెల నుండి, బయోటెక్, వైద్య పరిశోధన, పునరుత్పాదక ఇంధనం మొదలైన రంగాలలో 550 మంది శ్రీలంక జాతీయులు వివిధ భారతీయ సంస్థలలో శిక్షణ పొందడం ద్వారా ప్రయోజనం పొందారని కూడా, ఆయన తెలియజేశారు.
భారతదేశంలో శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ శ్రీ నిలుక కదురుగామువా మాట్లాడుతూ, “సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, స్థిరమైన అభివృద్ధికి ఎస్.&టి. కీలకమైన శక్తినిస్తుంది. 2030 లో ప్రపంచ దేశాలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి సైన్స్ లోని సాధనాలు దోహదపడతాయి. మనం, ఎస్.&టి. తో పాటు ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి సమయం ఆసన్నమైంది. దేశ ప్రగతికి బలమైన ద్వైపాక్షిక సహకారం చాలా ముఖ్యం. అటువంటి ఫలవంతమైన ఉమ్మడి సహకార కార్యక్రమం కోసం శ్రీలంక ఎదురుచూస్తోంది.", అని పేర్కొన్నారు.
ఉభయ దేశాల్లో కొనసాగుతున్న ఎస్.&టి. కార్యకలాపాలపై ప్రతినిధులు పరస్పరం సమాచారాన్ని తెలియజేసుకున్నారు. డి.ఎస్.టి. ప్రధాన ఆదేశాలు, డి.ఎస్.టి. బహుళ-స్టేక్ హోల్డర్ బేస్, ఎస్.&టి. లో భారత దేశ ఇటీవలి పురోగతి; ఎన్.ఎమ్-ఐ.పి.ఎస్; ఎన్.ఎం-క్యూ.టి.ఏ; మిథనాల్ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా టెక్నాలజీ లో భారత దేశ భవిష్యత్తును సురక్షితం చేయడంపై దృష్టి పెట్టడాన్ని ప్రదర్శించడంతో పాటు; వజ్ర, తారే, విజ్ఞాన్ జ్యోతి, ఆక్సిలరేట్ విజ్ఞాన్ వంటి నూతన ప్రోత్సాహకాల ద్వారా భారతదేశం, తన మొత్తం ఎస్.టి.ఐ. విధానం, ప్రాధాన్యతా అంశాలను తెలియజేసింది. భారతదేశ అంతర్జాతీయ ఎస్.&టి. కార్యక్రమాల గురించి కూడా వివరించడం జరిగింది. శ్రీలంక కూడా తమ దేశంలో ఎస్. & టి. యొక్క పరిధి, స్థితి తో పాటు జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ రంగాలలో దాని అనువర్తనాలు గురించి వివరించింది. శ్రీలంక లోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్; భారతదేశం లోని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి; శ్రీలంక లోని పారిశ్రామిక సాంకేతిక సంస్థ వంటి సంస్థలు, వాటికి సంబంధించిన శాస్త్రీయ ఏజెన్సీలు నిర్వహించే కార్యకలాపాలతో పాటు రెండు దేశాల మధ్య సంభావ్య సహకార రంగాల గురించి వివరించాయి.
ఆహార సాంకేతికత; ఔషధ మొక్కలు; వాతావరణ శాస్త్రం; అంతరిక్ష పరిశోధనలు; అప్లికేషన్లు; రోబోటిక్స్; ఆటోమేషన్; పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు; వ్యర్థ పదార్థాల నిర్వహణ; సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానం వంటి 9 రంగాలలో విస్తరించి, కొనసాగుతున్న సహకార కార్యకలాపాలను ఈ సందర్భంగా ప్రతినిధులు సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు.
రెండు దేశాల మధ్య సహకార కార్యక్రమాన్ని (పి.ఓ.సి) ని మరో మూడు సంవత్సరాల పాటు పొడిగించేందుకు బోర్డు పరస్పరం అంగీకరించింది. వ్యర్థ జల సాంకేతికతలు, పరిశ్రమలు, జీవ సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర వ్యవసాయం, అంతరిక్ష విజ్ఞానం, రోబోటిక్స్, భారీ సమాచార విశ్లేషణలు, కృత్రిమ మేధస్సు వంటి గురించిన అనేక కొత్త రంగాలను, పి.ఓ.సి. లో చేర్చవలసి ఉంది. ఎస్. & టి. రంగాలలో కొత్త ఉమ్మడి ప్రతిపాదనలను ఆహ్వానించవలసిన అవసరాన్ని కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుత మహమ్మారి పరిస్థితి నేపథ్యంలో సహకార పరిశోధనలను మెరుగుపరచడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి మరిన్ని వెబినార్ లు నిర్వహించాలని బృందం సిఫార్సు చేసింది.
*****