వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఎఫ్.టి.ఏ. చర్చల ప్రారంభం పై - భారత్-యు.కె. దేశాల సంయుక్త మీడియా ప్రకటన


భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరియు యు.కె. అంతర్జాతీయ వాణిజ్య శాఖ సహాయ మంత్రి అన్నే-మేరీ ట్రెవెల్యన్ ల - సంయుక్త ప్రకటన

Posted On: 13 JAN 2022 4:16PM by PIB Hyderabad

ఈ రోజు భారతదేశం మరియు యునైటెడ్ కింగ్‌, తమ రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం అధికారికంగా చర్చలు ప్రారంభించాయి.

భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరియు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల కోసం న్యూఢిల్లీ లో ఉన్న యు.కె. వాణిజ్య శాఖ సహాయ మంత్రి అన్నే-మేరీ ట్రెవెల్యన్ లు సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. 

భారత-యు.కె. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు గణనీయమైన అవకాశం మరియు భారత-యుకె ద్వైపాక్షిక సంబంధాలలో ఒక ముఖ్యమైన ఘట్టం. 

భారత-యు.కె. దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధం ఇప్పటికే ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇరు దేశాల ప్రధాన మంత్రులు  నరేంద్ర మోదీ మరియు బోరిస్ జాన్సన్ 2021 మే నెలలో ప్రకటించిన రోడ్‌ మ్యాప్ 2030 లో భాగంగా, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. భారత్, యు.కె. దేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలతో పాటు సమాజాలకు మద్దతు ఇచ్చే పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. 

2021 మే నెలలో ఇరుదేశాల ప్రధానమంత్రు లు మెరుగైన వాణిజ్య భాగస్వామ్యాన్ని ప్రారంభించడంతో, రెండు దేశాల మధ్య ఇప్పుడు జరిగే వాణిజ్య చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఈ చర్చల సమయంలో,  సమగ్ర ఒప్పందం కుదుర్చుకునే దిశగా,  రెండు దేశాలకు ముందస్తు ప్రయోజనాలను అందించే ఒక మధ్యంతర ఒప్పందం కుదుర్చుకోవాలనే అంశాన్ని, రెండు ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి.  అదేవిధంగా, వాణిజ్య చర్చలకు సమాంతరంగా,  భారత-యు.కె. వాణిజ్య సంబంధాన్ని మెరుగుపరచడంతో పాటు, వాణిజ్య ఒప్పందం వెలుపల మార్కెట్ వినియోగంలో ఎదురయ్యే అడ్డంకులను పరిష్కరించడంలో భారత-యు.కె. సంయుక్త ఆర్ధిక, వాణిజ్య సమితి కూడా  పని చేస్తూనే ఉంటుంది.

మొదటి దశ చర్చలు జనవరి 17వ తేదీన ప్రారంభించడానికి,   భవిష్యత్ చర్చలు దాదాపు ప్రతి ఐదు వారాలకు ఒక సారి నిర్వహించడానికి, ఇరు పక్షాలు అంగీకరించాయి.  భారతదేశ సంప్రదింపుల బృందానికి వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి నిధి మణి త్రిపాఠి నేతృత్వం వహిస్తారు. కాగా,   యు.కె. సంప్రదింపుల బృందానికి అంతర్జాతీయ వాణిజ్య శాఖ లో భారత సంప్రదింపుల విభాగం డైరెక్టర్ హర్జిందర్ కాంగ్ నేతృత్వం వహిస్తారు.

వ్యాపారాలు మరియు వినియోగదారుల ప్రయోజనం కోసం ఒక విస్తృత ఒప్పందాన్ని రూపొందించే దిశగా చర్చలు జరపడం ఇరు దేశాల ఆశయం.

 

*****



(Release ID: 1789856) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi , Tamil