మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

మత్స్య పరిశ్రమ ప్రగతి లక్ష్యంగా “ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్”


స్టార్టప్ కంపెనీలకోసం వినూత్న పోటీకి శ్రీకారం

Posted On: 13 JAN 2022 8:50PM by PIB Hyderabad

   దేశంలో, మత్స్య పరిశ్రమకు, రొయ్యలసాగుకు ఎదురయ్యే సవాళ్లకు స్టార్టప్ కంపెనీలు తమ సృజనాత్మక పరిష్కారాలను వెల్లడించేలా తగిన వేదికను ఏర్పాటు చేసేందుకు “ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్” పేరిట రూపొందించిన పోటీని కేంద్ర మత్స్యశాఖ ప్రారంభించింది. స్టార్టప్ ఇండియా, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖలతో కలసి జనవరి 13వ తేదీన కేంద్ర మత్స్యశాఖ ఈ పోటీకి శ్రీకారం చుట్టింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, సహాయమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్.ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.   

   ఇన్ ల్యాండ్ ఫిషరీస్ శాఖ సంయుక్త కార్యదర్శి సాగర్ మెహ్రా ప్రారంభోపన్యాసంతో ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్య రంగంలో ఎదురయ్యే సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనడంలో యువజనుల ప్రతిభను సద్వినియోగం చేసుకొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సముద్ర మత్స్యవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ జె. బాలాజీ మాట్లాడుతూ, మత్స్య పారిశ్రామిక రంగంలో ఇప్పటికీ వెలికి తీయని అంశాలతో వివిధ రకాల ఉపాధి అవకాశాలు ముడివడి ఉంటాయని, మత్స్యకారులు, మత్సరంగంలోని రైతులకు విస్తృత ప్రయోజనాలు అందించేందుకు ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు.

   మత్స్యశాఖ కార్యదర్శి జతీందర్ నాథ్ స్వైన్ మాట్లాడుతూ, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధానమైన ఉత్పాదనా రంగాల్లో మత్స్య పారిశ్రామిక రంగం కూడా ఉందని అన్నారు. మత్స్య రంగంనుంచి అసలు సిసలైన ప్రయోజనాలను రాబట్టుకునేందుకు,.. ఉత్పత్తిని, ఉత్పాదనా శక్తిని, మత్స్యకారుల వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు మరింత  సాంకేతిక పరిజ్ఞాన ప్రతిభ అవసరమవుతుందని అన్నారు.

  కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ మాట్లాడుతూ,.. దేశ ఆర్థికవృద్ధిలో, బహుముఖ అభివృద్ధిలో మత్స్య రంగం ఎంతో కీలకపాత్ర పోషిస్తుందన్నారు.  మత్స్య శాఖను “సూర్యోదయ రంగం”గా ఆయన అభివర్ణించారు. సమానత్వంతో కూడిన, సమ్మళిత వృద్ధి ద్వారా విస్తృతమైన ప్రయోజనాలను అందించే సామర్థ్యం మత్స్య రంగానికి ఉన్నదని అన్నారు. దేశవ్యాప్తంగా కోటీ 45లక్షల మందికి ఉపాధి కల్పించి, 2.8కోట్ల మంది మత్స్యకారులకు జీవనోపాధిని కల్పించేందుకు బలమైన ఛోదక శక్తిగా మత్స్య రంగం మారగదలని ప్రభుత్వం గుర్తించినట్టు ఆయన చెప్పారు. ఈ రంగంలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలకు, సవాళ్లకు సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మక ఆవిష్కరణల ద్వారా తమ వంతు పరిష్కారాలను సూచించేందుకు ఔత్సాహిక, క్రియాశీలులైన యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 మత్స్య పరిశ్రమక, రొయ్యల సాగు రంగాల విస్తృత సామర్థ్యాన్ని గురించి కేంద్రమంత్రి వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిలో మత్స్య రంగానికి ఎంతో కీలకపాత్ర ఉంటుందన్నారు. ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్ కార్యక్రమాన్ని సానుకూలంగా వినియోగించుకోవాలని యువమేధావులకు విజ్ఞప్తి చేశారు. మత్స్య రంగానికి ఎదురయ్యే వివిధ రకాల సవాళ్లకు పరిష్కారాలను వెలుగులోకి తెచ్చేందకు ఈ గ్రాండ్ చాలెంజ్.ని ఒక వేదికగా వినియోగించుకోవాలని సూచించారు. మత్స్యరంగం విలువల వ్యవస్థలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ తగిన పరిష్కారాలను రూపొందించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం హెక్టారు విస్తీర్ణంలో సగటు ఉత్పత్తిని 3 టన్నులనుంచి ఐదు టన్నులకు పెంచేలా, ఎగుమతి ద్వారా ఆదాయం రెట్టింపు అయ్యేలా, రొయ్యల సాగులో దిగుబడి అనంతర నష్టాలు 25శాతం నుంచి 10శాతానికి తగ్గేలా  ఈ పరిష్కారాలు ఉండాలన్నారు.

   మత్స్యశాఖ ప్రారంభించిన “ఫిషరీస్ స్టార్టప్ చాలెంజ్” పోటీ దరఖాస్తు చేసుకోవడానికి 45రోజుల గడువు ఉంటుంది. ఇంటర్నెట్.లోని స్టార్టప్ ఇండియా పోర్టల్ (www.startupindia.gov.in)పై ఈ పోటీ అందుబాటులో ఉంటుంది. ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్ కింద,. ఈ దిగువన ఇచ్చిన అంశాలు, ఇతివృత్తాలపై పోటీకోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించి, అభివృద్ధి చేయడం/ మత్స్యకారులకు, చేపల రైతులకు మరింత మెరుగైన ధరలు లభించేలా ఉత్పాదనును పెంచేందుకు తగిన పరిష్కారాలను రూపొందించడం...  మత్స్యకారులు, చేపల రైతులు తమ చేపల ఉత్పాదనలకు తగిన విలువ జోడింపు లభించి, వృధా కనీస స్థాయికి తగ్గిపోయేలా చూసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం.. దిగుబడి అనంతర సమస్యలకు తగిన పరిష్కారాలను రూపొందించడం... భూమి కోతను, జలాశయాల్లో ఒండ్రు మట్టిని తగ్గించడం, తీరప్రాంతంకోసం పర్యావరణహితమైన పరిష్కారాలను రూపొందించడం...ఇలాంటి ఇతివృత్తాలపై పోటీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

 మత్స్య పారిశ్రామిక రంగంలో అంతర్గతంగా స్టార్టప్ కంపెనీల రూపకల్పనా సంస్కృతిని పెంపొందించడానికి ఈ పోటీ దోహదపడుతుందని భావిస్తున్నారు. తద్వారా, ఇందుకోసం ఒక ఔత్సాహిక క్రియాశీలక నమూనాకు పునాదులు పడతాయన్నది ఆలోచన. ఈ పోటీ నిర్వహణ కోసం కేంద్ర మత్స్యశాఖ రూ. 3.44కోట్ల రూపాయలమేర నిధులను కేటాయించింది. చాలెంజ్ పోటీలో విజేతలుగా ఎంపికైన 12 కంపెనీలకు రూ. 2లక్షల చొప్పున నగదు పురస్కారం అందిస్తారు. తమ భావనలను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్టుగా (పి.ఒ.సి.గా) రూపొంతరం చెందించినందుకు ఎంపిక చేసిన పది స్టార్టప్ కంపెనీలకు పురస్కారాలు అందిస్తారు. చివరి రౌండులో  విజేతలుగా నిలిచిన వారు, తమ భావనలను వాణిజ్య ప్రాతిపదికన ప్రయోగాత్మక ప్రాజెక్టులుగా మార్చడానికి, జనరల్ కేటగిరీ కింద 20 లక్షల రూపాయలు, ఎస్.సి., ఎస్.టి.లకు, మహిళలకు అయితే రూ. 30లక్షలు సహాయంగా అందిస్తారు.

  “ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్” పోటీ ప్రారంభోత్సవానికి వివిధ భాగస్వామ్య వర్గాల ప్రతినిధులు హాజరయ్యారు. కీలకమైన స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక నిపుణులు, ఔత్సాహికులు, పెట్టుబడిదార్లు, ఇంకుబేటర్లు, విధాన నిర్ణయకర్తలు హాజరయ్యారు. కేంద్ర మత్స్యశాఖకు చెందిన మత్స్యరంగం గణాంక వ్యవహారాల డైరెక్టర్ ముకేశ్ వందన సమర్పణతో ప్రారంభోత్సవం ముగిసింది. అతిథులకు, ఆహూతులైన ఇతరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ చాలెంజ్ పోటీ విజయవంతం కావాలన్న ఆశాభావాన్ని ముకేశ్ వ్యక్తం చేశారు.

  ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ చాలెంజితో పాటుగా, ఇలాంటి ప్రభావవంతమైన మరిన్ని పోటీల ద్వారా స్థూల స్థాయిలో మత్స్య పరిశ్రమ రంగంలో సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేయాలని కేంద్ర మత్స్యశాఖ కృషి చేస్తోంది. వివిధ భాగస్వామ్య వర్గాల సహాయ, సహకారాలతో ఈ లక్ష్యం సాధించబోతోంది. స్వావలంబనతో కూడిన జాతి నిర్మాణమే లక్ష్యంగా దేశాన్ని ‘ఆత్మనిర్భర భారత్’గా తీర్చిదిద్దేందుకు తగిన సేవలందంచాలని మత్స్యశాఖ భావిస్తోంది.

 

***(Release ID: 1789853) Visitor Counter : 113


Read this release in: English , Urdu , Hindi