యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

'చైతన్యంతో మేల్కొని లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించవద్దు' అనేది యువత నూతన విధానంగా ఉండాలి .. శ్రీ అనురాగ్ ఠాకూర్


25 వ జాతీయ యువజన ఉత్సవాల ముగింపు సమావేశంలో పాల్గొన్న శ్రీ తమిళిసై సౌందర్ రాజన్ శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 13 JAN 2022 8:23PM by PIB Hyderabad

ఈ రోజు జరిగిన 25 వ జాతీయ యువజన ఉత్సవాలు 2022 ముగింపు సమావేశంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ తమిళిసై సౌందర్ రాజన్ కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో క్రీడలుయువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ  నిసిత్ ప్రమాణిక్, పుదుచ్చేరి విద్యయువజన వ్యవహారాల మంత్రి  శ్రీ ఎ. నమశ్శివాయ,  యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి. ఉషా శర్మ మరియు యువజన వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ నితీష్ కుమార్ మిశ్రా కూడా  పాల్గొన్నారు.

ముగింపు సమావేశంలో ప్రసంగించిన శ్రీ అనురాగ్ ఠాకూర్ ఉత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి  కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు స్పందించిన లక్షలాది మంది యువతీ యువకులు దేశాన్ని 75వ స్వాతంత్ర్య సంవత్సరం నుంచి  100 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం వరకు ముందుండి నడిపిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. రెండు రోజుల పాటు సదస్సులో నిర్వహించిన సదస్సులు యువతకు స్ఫూర్తి ఇచ్చే విధంగా సాగాయని అన్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులు,మేధావులు సదస్సులో యువతకి స్ఫూర్తి కలిగించే విధంగా ప్రసంగించారని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి తులసి గౌడ లాంటి వారు సదస్సులో పాల్గొన్నారని తెలిపారు. గతంలో ఇటువంటి స్ఫూర్తి దాతలకు తగిన గుర్తింపు గౌరవం లభించలేదని శ్రీ ఠాకూర్ అన్నారు. దేశాభివృద్ధికి వారు చేసిన సేవలకు ప్రస్తుతం గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయని మంత్రి అన్నారు. 

యువజన ఉత్సవాలు ఘనంగా, విజయవంతంగా జరిగాయని శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. దేశం వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రశ్నలు సంధించి  వాటిపై యువత అభిప్రాయాలు తెలుసుకున్నారని మంత్రి వివరించారు. దీనిని వివరించిన మంత్రి అరకు లోయలో సాగుతున్న కాఫీ సాగును ప్రస్తావించారు. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు తోడ్పడతాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. విజయం సాధించేందుకు ఉన్న అవకాశాలను యువత శోధించాలని మంత్రి సూచించారు. పేటీమ్ మరియు బైజుస్ వంటి అంకుర సంస్థలు సాధించిన విజయాలతో యువత స్ఫూర్తి పొందాలని ఆయన సూచించారు. 

యువజన ఉత్సవాల్లో సాధించిన నైపుణ్యాలను యువత తమ రోజువారీ జీవనంలో అమలు చేసి ప్రయోజనం పొందాలని శ్రీ అనురాగ్ సింగ్ సూచించారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అవకాశాలను అన్వేషించాలన్న ప్రధానమంత్రి సూచనను యువత పాటించి ముందుకు సాగాలని మంత్రి అన్నారు. దీనికి ఉదాహరణ కోవిడ్ మహమ్మారి అని మంత్రి వ్యాఖ్యానించారు. మహమ్మారిని కేవలం ఎదురు దెబ్బగా మాత్రమే కాకుండా ఒక అవకాశంగా ప్రభుత్వం మలుచుకుని పనిచేసి ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం ప్రయత్నించి విజయం సాధించిందని మంత్రి వివరించారు. పీపీఈ కిట్ల తయారీ, వ్యాక్సిన్ రంగాల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. మన సామర్ధ్యాలను గుర్తించి కలిసి పనిచేసినప్పుడు విజయం మన సొంతమవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. యువత తమకు నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని  25 సంవత్సరాల కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని అన్నారు. 

ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తు చేసుకున్న శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్  "లేవండిమేల్కొలపండిలక్ష్యం చేరేవరకు విశ్రమించకండి "అన్న వివేకానంద సూచన   యువతకు మార్గదర్శకం కావాలని అన్నారు. 

జాతీయ యువజన ఉత్సవాలు 2022 పుదుచ్చేరి లో జరగడం పట్ల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ హర్షం వ్యక్తం చేశారు. మహమ్మారి రూపంలో ఎదురైన సవాళ్ళను ఎదిరించి యువతకు స్ఫూర్తి నింపాలన్న లక్ష్యంతో ఉత్సవాలు జరిగాయని అన్నారు. ఉత్సవాల ద్వారా యువతకు  తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కలిగిందని అన్నారు. దేశాభివృద్ధిలో యువత పునాది రాయిగా ఉంటుందని డాక్టర్ తమిళిసై అన్నారు. పునాది పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల విజయంలో యువత పాత్ర ఉందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ  ఇండియా మిషన్ లాంటి పథకాలు సామాజిక విప్లవ సాధనకు ఉపకరిస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కిల్ ఇండియా కార్యక్రమం యువత నైపుణ్యాభివృద్ధికి దోహద పడుతుందని అన్నారు. 'పోటీ చేసి విజయం సాధించండి' అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని యువత తమ    ప్రతిభకు పదును పెట్టాలని ఆమె పిలుపు ఇచ్చారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిలా అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. యువజన ఉత్సవాలు యువతకు నూతన అవకాశాలను అందిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.  

శ్రీ నిసిత్ ప్రమాణిక్ ప్రసంగిస్తూ స్వామి వివేకానంద ఆలోచనలు యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని  అన్నారు. ఈ ఏడాది జరిగిన యువజన ఉత్సవాలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు.  కోవిడ్ కారణంగా వీటిని  వర్చువల్‌గా నిర్వహించాలని ఆఖరి క్షణంలో నిర్ణయించామని అన్నారు.  ఉత్సవాలు ఘన విజయం సాధించాయని అన్నారు.  యువత ఏదైనా నిర్ణయం తీసుకుంటే వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఉత్సవాలు రుజువు చేశాయని మంత్రి అన్నారు. దేశ చరిత్ర, సంస్కృతి లను విస్మరించకుండా యువత సాంకేతిక  పరిజ్ఞానం  అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ నవ భారత  నిర్మాణానికి సహకరించాలని శ్రీ ప్రమాణిక్ పిలుపునిచ్చారు.

 వర్చువల్ విధానంలో జరిగిన జాతీయ యువజన ఉత్సవాలు  2022ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జనవరి 12వ తేదీన  ప్రారంభించారు. పుదుచ్చేరి  ప్రభుత్వ సహకారంతో వీటిని నిర్వహించడం జరిగింది.  కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలోవర్చువల్‌గా జరిగిన ఈ ఉత్సవాలు యువతకి కొత్త అనుభూతిని అందించాయి.  భారతదేశంలోని వివిధ మారుమూల ప్రాంతాల నుంచి లాగిన్ అయిన యువత ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నవ భారతాన్ని నిర్మించేందుకు మరియు యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతోఈ రెండు రోజుల ఉత్సవాలను  నిర్వహించడం జరిగింది. పర్యావరణం మరియు వాతావరణ మార్పు నాయకత్వం, సాంకేతిక, ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకత, స్వదేశీ మరియు ప్రాచీన జ్ఞానం మరియు జాతీయ పాత్రదేశాభివృద్ధి, స్వదేశీ మేధావులు వంటి సమకాలీన అంశాలపై సదస్సులు జరిగాయి. 

సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.  పర్యావరణవేత్త హన్స్ దలాల్, రణదీప్ హుడా, స్వామి వివేకానంద జీవిత చరిత్ర రాసిన సంజీవ్ సన్యాల్ మరియు హిందోల్ సేన్‌గుప్తా వంటి చరిత్రకారులు,  వ్యవసాయవేత్త గా మారిన ఆర్థిక నిపుణులు శ్రీ  మనోజ్ కుమార్,   పేటీమ్ సీఈఓ   విజయ్ శేఖర్ శర్మ మరియు  బ్రాండ్ న్యూ ఇండియా  సిద్ధాంతాలు మరియు ప్రాథమిక  సూత్రాలను వేద జ్ఞానం ద్వారా అందిస్తున్న  శ్రీ దుష్యంత్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 

 

***



(Release ID: 1789831) Visitor Counter : 128


Read this release in: English , Hindi , Urdu , Punjabi