పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

గగనతల క్రీడల విధానం ముసాయిదా విడుదల


ప్రజాభిప్రాయం కోరుతూ వెబ్.సైట్లో
విధాన ముసాయిదాను పొందుపరిచిన
పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ..

2030కల్లా గగనతల క్రీడల్లో భారతదేశాన్ని
అగ్రశ్రేణి దేశాల సరసన చేర్చడమే ధ్యేయం..

గగనతల క్రీడల్లో భారత్ భారీ సామర్థ్యాన్ని
సానుకూలం చేసుకోవడం,

భద్రతలో అత్యుత్తమ అంతర్జాతీయ సాధనారీతులపై
దృష్టిని కేంద్రీకరించడమే లక్ష్యం...

Posted On: 02 JAN 2022 2:42PM by PIB Hyderabad

  జాతీయ గగనతల క్రీడల విధానం (ఎన్.ఎ.ఎస్.పి.) ముసాయిదాను కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రజాభిప్రాయం కోరుతూ ఈ ముసాయిదాను విడుదల చేశారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెబ్.సైట్లో ఈ ముసాయిదా అందుబాటులో ఉంటుంది. ముసాయిదా కోసం  ఈ కింది లింకును సంప్రదించవచ్చు:

https://www.civilaviation.gov.in/sites/default/files/Draft-NASP-2022.pdf

జాతీయ గగనతల క్రీడలపై ప్రజలు తమ సూచనలను, సలహాలను ఈ సంవత్సరం జనవరి 31వ తేదీలోగా పంపుకోవచ్చు.

  గగనతల క్రీడా ప్రపంచంలో అగ్రశ్రేణి దేశంగా రాణించగలిగే శక్తిసామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయి. సువిశాలమైన భౌగోళిక విస్తీర్ణం, విభిన్నమైన నైసర్గిక స్వరూప స్వభావాలు, సానుకూలమైన వాతావరణ పరిస్థితులు భారతదేశానికి ఉన్నాయి. భారతదేశానికి భారీ సంఖ్యలో జనాభా ఎక్కువ. అందులోనూ యువజనుల జనాభా కూడా సమృద్ధిగానే ఉంది. సాహస క్రీడలు విమానయానం వంటి విభిన్న అంశాలతో కూడిన సంస్కృతి దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తోంది. గగనతల క్రీడలు, క్రీడా కార్యకలాపాలతో ప్రత్యక్షంగా వచ్చే రెవెన్యూ మాత్రమే కాక, విభిన్నరకాలైన ప్రయోజనాలు కూడా దేశానికి సముకూరుతున్నాయి. పర్యాటకం, మౌలిక సదుపాయలు, స్థానికంగా ఉపాధి కల్పన వంటి రూపాల్లో ఈ ప్రయోజనాలు సమకూరుతున్నాయి. ప్రత్యేకించి కొండ ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఒనగూడే అవకాశాలున్నాయి. గగనతల క్రీడా కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం ద్వారా, ప్రపంచంవ్యాప్తంగా ఉన్న గగనతల క్రీడా నిపుణులను, పర్యాటకులను మనదేశంవైపు ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. 

   ఈ కారణాలన్నింటివల్లనే గగనతల క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం గట్టిగా సంకల్పించింది. అందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం, గగన క్రీడలను సురక్షితంగా, అందుబాటు యోగ్యంగా, ఆనందదాయంగా, సుస్థిరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన వ్యవస్థలను, వివిధ ప్రక్రియలను మరింత సరళతరం, పారదర్శకం చేయాల్సి ఉంది; అలాగే, నాణ్యత, భద్రత వంటి అంశాలపై మరింత దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది; గగనతల క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, శిక్షణ, అవగాహనా కల్పనకోసం పెట్టుబడులను సానుకూలంగా మార్చుకోవలసిన అవసరం కూడా ఉంది.

  ఇందులో భాగంగా తొలి ప్రయత్నంగా, జాతీయ. గగనతల క్రీడల విధానం ముసాయిదా (ఎన్.ఎ.ఎస్.పి 2022)కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. విధాన నిర్ణాయకులు, గగనతల క్రీడల అభ్యాసకులు, సాధకులు, ప్రజలనుంచి సేకరించిన సమాచారం ప్రాతిపదికగా ఈ ముసాయిదాను తయారు చేశారు. ఈ ముసాయిదా ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. క్రమం తప్పకుండా అవసరమైన సవరణలు చోటుచేసుకుంటూ ఉంటాయి.

 

జాతీయ గగనతల క్రీడల విధానం ముసాయిదాలోని కీలకాంశాలు:

  1. ఎయిరోబిక్స్, ఎయిరో మాడలింగ్, అమెచ్యూర్ బిల్ట్,  ఎక్సెరిమెంటల్ ఎయిర్ క్రాఫ్ట్, బెలూనింగ్, డ్రోన్లు, గ్లైడింగ్, హ్యాంగ్ గ్లైడింగ్, ప్యారా గ్లైడింగ్, మైక్రో లైటింగ్, ప్యారా మోటారింగ్, స్కై డైవింగ్, వింటేజ్ ఎయిర్ క్రాఫ్ట్ వంటి విభిన్నమైన క్రీడలను ఎన్.ఎ.ఎస్.పి. 2022 ముసాయిదాలో పొందుపరిచారు.
  2. 2030వ సంవత్సరానికల్లా భారతదేశాన్ని గగనతల క్రీడా రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన చేర్చాలనే కలను సాకారం చేయడమే ఈ ముసాయిదా లక్ష్యం. సురక్షితమైన, అందుబాటుయోగ్యమైన, ఆనందదాయకమైన గగనతల క్రీడల సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది సంకల్పం.
  3. దేశంలోని విభిన్నమైన నైసర్గిక స్వరూపం స్వభావం, విస్తృతమైన భౌగోళిక విస్తీర్ణం, చక్కని వాతావరణ పరిస్థితులను గగనతల క్రీడలకు సానుకూల సామర్థ్యాలుగా మార్చుకోవడానికి ఎన్.ఎ.ఎస్.పి. 2022 దోహదపడుతుంది.
  4. గగనతల క్రీడాంశాలకు సంబంధించిన పరిపాలన, పర్యవేక్షక కేంద్రసంస్థగా భారతీయ గగనతల క్రీడల సమాఖ్యను (ఎ.ఎస్.ఎఫ్.ఐ.ని) ఏర్పాటు చేస్తారు. గగనతల క్రీడారంగంలోని వివిధ క్రీడాంశాల సంఘాలు,.. ఆయా క్రీడల రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి. ఉదాహరణకు..ప్యారా గ్రైడింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, లేదా,.. స్కైడైవింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తదితర సంఘాలు.
  5. గగనతల క్రీడా సంఘాలన్నీ, ఎ.ఎస్.ఎఫ్.ఐ.కి జవాబ్దారీగా వ్యవహరించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా పోటీల నిర్వహణ, పొరపాట్లను నివారించడం, సురక్షితంగా, అందుబాటు యోగ్యంగా, ఆనందదాయకంగా క్రీడలను నిర్వహించడం వంటి విధులను ఈ సంఘాలు గౌరవించవలసి ఉంటుంది.
  6. ఫెడరేషన్ ఎయిరోనాటిక్ ఇంటర్నేషనల్ (ఎఫ్.ఐ.ఎ.)తో పాటుగా, గగనతల క్రీడలకు సంబంధించిన ఇతర ప్రపంచ వేదికలపై భారతదేశానికి ఎ.ఎస్.ఎఫ్.ఐ. ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రపంచ గగనతల క్రీడాపోటీల్లో మరిన్ని ఎక్కుసార్లు పాల్గొనేందుకు చర్యలు తీసుకుంటుంది. అలాగే, క్రీడల్లో విజేయులైన భారతీయ క్రీడాకారులను తగినరీతిలో సత్కరిస్తుంది.
  7. గగనతల క్రీడల సామగ్రికి, క్రీడా పరికరాలకు సంబంధించి, స్వదేశీ నమూనాల తయారీ, రూపకల్పన, ఉత్పాదన వంటి కార్యకలాపాలను ఆత్మనిర్భర భారత్ అభియాన్ పథకానికి అనుగుణంగా చేపడతారు.
  8. గగతల క్రీడలకు ప్రపంచ స్థాయి పరిపాలనా వ్యవస్థగా, స్విట్జర్లాండ్.లోని లాసేన్.లో ఉన్న ఫెడరేషన్ ఎయిరోనాటిక్ ఇంటర్నేషనల్ (ఎఫ్.ఎ.ఐ.) వ్యవహరిస్తోంది. ఎఫ్.ఎ.ఐ. మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే భారతదేశంలోని గగనతల క్రీడా పోటీలన్నింటినీ నిర్వహిస్తారు.
  9. సాధారణ విమానం నడపడం కంటే, గగనతల క్రీడలకు సంబంధించిన విమానం నడపడం స్వభావ సిద్ధంగానే కాస్త ఎక్కువ ప్రమాదం. ఈ నేపథ్యంలో గగనతల క్రీడల్లో భద్రతాపరంగా అత్యుత్తమైన అంతర్జాతీయ పద్ధతులను అనుసరించే విషయమై ఎన్.ఎ.ఎస్.పి. 2022 తన దృష్టిని కేంద్రీకరిస్తుంది.
  10. గగనతల క్రీడలకు సంబంధించిన ఏదైనా సంఘం నిర్ణీత భద్రతా ప్రమాణాలను అమలు చేయలేని పక్షంలో ఎ.ఎస్.ఎఫ్.ఐ. తగిన క్రమశిక్షణా చర్య తీసుకుంటుంది. పరిస్థితి తీవ్రత ప్రాతిపదికగా ఈ విషయంలో ఆర్థిక రూపంలో జరిమానాలతో పాటుగా, సస్పెన్షన్, బర్తరఫ్ వంటి క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయి.
  11. గగనతల క్రీడలకు సంబంధించిన సేవలందించే వ్యక్తులు, సంస్థలు తమ సంబంధిత గగనతల క్రీడా సంఘాల్లో సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా క్రీడలకు వినియోగించే క్రీడా పరికరాల వివరాలను కూడా సంబంధిత సంఘంతో రిజిస్టర్ చేస్తారు. క్రీడా సామగ్రిని వినియోగించడం ఆపేవరకూ, లేదా మరమ్మతులకు కూడా సాధ్యంకాని రీతిలో దెబ్బతినేంతవరకూ, లేదా అవి ఆచూకీ తెలియకుండా పోయేంతవరకూ ఈ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది.
  12. భారతదేశపు గగనతల రేఖాచిత్రం ఇప్పటికే పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ డిజిటల్ స్కై ప్లాట్.ఫాం (https://digitalsky.dgca.gov.in)పై ప్రచురితమైంది. మనదేశపు మొత్తం గగనతల రేఖా చిత్రాన్ని రెడ్ జోన్, యెల్లో జోన్, గ్రీన్ జోన్.గా వర్గీకరించారు. గగనతల క్రీడల్లో సాధన చేసేవాళ్లు తమ మార్గదర్శకత్వంకోసం ఈ రేఖాచిత్రాన్ని అనుసరించాల్సి ఉంటుంది. రెడ్ జోన్ పరిధిలో గగనతల క్రీడాకార్యకలాపాలను నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వంనుంచి,  యెల్లో జోన్.లో అయితే, సంబంధిత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీనుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. ఇక గ్రీన్ జోన్ పరిధిలో గరిష్టంగా 500 కిలోగ్రాముల వరకూ బరువున్న విమానాన్ని నడపడానికి, లేదా గగనతన క్రీడాకార్యాకలాపాలు నిర్వహించడానికి ఎలాంటి  అనుమతులూ తీసుకోవాల్సిన అవసరం లేదు.
  13.  ఒక నిర్దిష్టమైన స్థలంలో గనగతల క్రీడలను కేంద్రీకరించినట్టయితే, సదరు ప్రాంతాన్ని గగనతల క్రీడలకు సంబంధించిన ‘కంట్లోల్ జోన్’గా ప్రకటించవచ్చు. ఇందుకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖలనుంచి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంనుంచి, స్థానిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీనుంచి తగిన అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, హిమాచల్ ప్రదేశ్.లోని బీర్-బిల్లింగ్, సిక్కింలోని గ్యాంగ్టక్, మహారాష్ట్రలోని హదాప్సారీ, కేరళలోని వాగతమాన్ ప్రాంతాలకు సంబంధించి ఈ నిబంధనను పాటించవలసి ఉంటుంది. దీనితో అలాంటి కంట్రోల్ జోన్ల పరిధిలో ఔత్సాహిక గగనతల క్రీడాకారులు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా, జాతీయ భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సాధన చేసేందుకు వీలుంటుంది.
  14. శీతాకాలం తీవ్రత పెరిగినపుడు యూరప్, ఉత్తరఅమెరికా ప్రాంతాల్లో గగనతల క్రీడల స్థాయి క్రమంగా తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో గగనతల క్రీడల ఔత్సాహికులు, అభిమానులు కాస్త సానుకూలమైన ఉష్షోగ్రతా ప్రాంతాలకు వలస పోతారు. అలాంటి వారికి భారతదేశానికి వచ్చేందుకు సానుకూలంగా ఎలాంటి ఆటంకాలు లేని ప్రక్రియను అమలుచేసేందుకు ఎ.ఎస్.ఎఫ్.ఐ., ఇతర గగనతల క్రీడా సంఘాలు తగిన చర్యలు తీసుకుంటాయి. దీనివల్ల భారతీయ ఔత్సాహిక గగనతల క్రీడాకారులు ఇతరదేశాల గనగతల క్రీడా నిపుణుల అనుభవాలనుంచి మెలకువలు తెలుసుకునేందుకు వీలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఉత్తమమైన క్రీడా సాధనను అలవర్చుకునేందుకు మన క్రీడాకారులకు వీలు కలుగుతుంది. దీనికితోడు భారతదేశంలో ప్రపంచ స్థాయి పోటీలను నిర్వహించేందుకు కూడా అవకాశాలు ఏర్పడుతాయి.
  15. గగనతల క్రీడలకు సంబంధించిన పరికరాలను, సామగ్రిని ఎలాంటి సుంకంలేకుండా విదేశాలనుంచి దిగుమతికి కొన్నేళ్లపాటు అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఇంతకు ముందు వినియోగించిన క్రీడా పరికరాలను నిర్దేశిత నిబంధనలను, వినియోగ యోగ్యతను బట్టి స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతించవచ్చు.
  16. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తమ అధ్యయనాంశాల ప్రణాళికలో గగనతల క్రీడలను చేర్చేలా ప్రోత్సహించేందుకు వీలవుతుంది.
  17. భారతదేశంలో గగనతల క్రీడల అభివృద్ధికి, సభ్యత్వం రుసుముకు, పోటీలకు, మిడియా హక్కులకు సంబంధించి కార్పొరేట్ పెట్టుబడిదారులు, స్పాన్సారర్లు దీర్ఘకాలికంగా నిధులు అందించేందుకు అవకాశం ఉంటుంది. గగనతల క్రీడలను ప్రోత్సహించేందుకు, ప్రత్యేకించి ప్రారంభ సంవత్సరాల్లో ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వంనుంచి ఆర్థిక సహాయం కావాలని ఎ.ఎస్.ఎఫ్.ఐ. కూడా కోరేందుకు వీలుంటుంది.
  18. సామాన్య ప్రజలకు గగనతల క్రీడలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా గగనతల క్రీడా పరికకాలపై  వస్తు సేవలపన్నును (జి.ఎస్.టి.ని) 5శాతానికి లేదా అంతకంటే తక్కువ శాతానికి హేతుబద్ధం చేసే విషయం పరిశీలించాలంటూ ప్రభుత్వం జి.ఎస్.టి. మండలికి సూచించవచ్చు.

 

***



(Release ID: 1787010) Visitor Counter : 225