ఆర్థిక మంత్రిత్వ శాఖ

స్థానిక సెంట్రల్ జి.ఎస్.టి. అధికారుల సహకారంతో కాన్పూర్‌లో సోదాలు ప్రారంభిన - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జి.ఎస్.టి. ఇంటెలిజెన్స్ (డి.జి.జి.ఐ), అహ్మదాబాద్ అధికారులు

Posted On: 24 DEC 2021 4:40PM by PIB Hyderabad

నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు, స్థానిక సెంట్రల్ జి.ఎస్.టి. అధికారుల సహకారంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జి.ఎస్.టి. ఇంటెలిజెన్స్ (డి.జి.జి.ఐ), అహ్మదాబాద్ అధికారులు 22.12.2021 తేదీన కాన్పూర్‌లో సోదాలు ప్రారంభించారు.  శిఖర్ బ్రాండ్ పాన్ మసాలా మరియు పొగాకు ఉత్పత్తుల తయారీదారులైన కాన్పూర్ లోని లు త్రిమూర్తి ఫ్రాగ్రెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు, ఆ ఉత్పత్తుల రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాన్పూర్, ట్రాన్స్‌పోర్ట్ నగర్ లోని గణపతి రోడ్ క్యారియర్స్ సంస్థ కార్యాలయం / గోడౌన్లలో ఈ సోదాలు జరిగాయి. 

చట్ట నిబంధనల ప్రకారం చెల్లించవలసిన పన్ను చెల్లించకుండా తయారీదారులు తమ ఉత్పత్తులను రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు సమాచారం అందుకున్నారు.   సరకులను తరలించే సమయంలో ఇ-వే బిల్లులు తయారు చేయకుండా నివారించడానికి, ఒక పూర్తి ట్రక్కు నిండా సరుకు రవాణా చేస్తూ, వాటి విలువ 50,000 రూపాయల కంటే తక్కువగా ఉన్నట్లు ప్రకటిస్తూ, ఉనికిలో లేని సంస్థల పేరుతో రవాణా సంస్థ తరచుగా అనేక ఇన్వాయిస్ లు రూపొందించినట్లు సమాచారం వచ్చింది.   దీనికి తోడు, ఆ రవాణా సంస్థ అటువంటి రహస్య సరఫరా ద్వారా లభించే ఆదాయాన్ని నగదు రూపంలో సేకరించి,  తమ కమిషన్ మినహాయించుకుని, ఆ తర్వాత, ఆ మొత్తాన్ని తయారీ సంస్థ కు అందజేయడం జరుగుతోంది. 

ఇన్వాయిస్ లు మరియు ఈ-వే బిల్లులు లేకుండా ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చిన అటువంటి 4 ట్రక్కులను, అధికారులు ముందుగా ఫ్యాక్టరీ ప్రాంగణం వెలుపల, విజయవంతంగా అడ్డగించి, స్వాధీనం చేసుకుని, తమకు అందిన నిఘా సమాచారాన్ని ధృవీకరించారు.   

ఫ్యాక్టరీ ఆవరణలో, భౌతికంగా ఉన్న సరకుల వివరాలను పరీక్షించిన సమయంలో, ముడి పదార్థాలు, పూర్తయిన ఉత్పత్తులు తక్కువగా ఉన్నట్టు తేలడంతో, పూర్తయిన ఉత్పత్తులను రహస్యంగా తరలించినట్లు గుర్తించడం జరిగింది.  జి.ఎస్.టి. చెల్లించకుండా వస్తువులు తరలించినట్టు, కంపెనీ తరఫున అధీకృత సంతకం చేసే వ్యక్తి అంగీకరించారు. 

జి.ఎస్.టి. చెల్లించకుండా వస్తువుల రవాణా కోసం గతంలో ఉపయోగించిన 200 కంటే ఎక్కువ నకిలీ ఇన్వాయిస్ లను కూడా రవాణా సంస్థ, గణపతి రోడ్ క్యారియర్స్ ప్రాంగణం నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది.   నకిలీ ఇన్వాయిస్ ల ముసుగులో ఈ-వే బిల్లులు లేకుండా సరుకులు రవాణా చేసి,  అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉత్పత్తిదారునికి అందజేయడానికి నగదు రూపంలో సేకరించినట్లు,  రవాణా సంస్థ అంగీకరించింది.  రవాణా సంస్థ నుండి 1.01 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 

నిఘా వర్గాలకు అందిన సమాచారం ఆధారంగా, ఈ కంపెనీ కి ఎక్కువగా నగదు రూపంలో పెర్ఫ్యూమరీ కాంపౌండ్‌ లను సరఫరా చేస్తున్న, కాన్పూర్‌, ఆనంద్‌ పురి లోని 143 లో ఉన్న కన్నౌజ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓడోచెమ్ ఇండస్ట్రీస్ సంస్థ భాగస్వాముల నివాస ప్రాంగణాల్లో సోదాలు చేయడం జరిగింది.   అమ్మకాల ద్వారా వచ్చిన నగదును ఆ ప్రాంగణంలో రహస్యంగా ఉంచినట్లు అనుమానించడం జరిగింది. 

వారి నివాస ప్రాంగణంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో భారీ మొత్తంలో కాగితాల్లో చుట్టిన నగదు బయటపడింది.   కాన్పూర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల సహాయంతో ప్రారంభించిన నగదు లెక్కింపు ప్రక్రియ 24.12.2021 తేదీ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది.   మొత్తం నగదు 150 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.  తదుపరి విచారణలు పెండింగ్‌ లో ఉన్న సమయంలో, సి.జి.ఎస్.టి. చట్టంలోని సెక్షన్-67 నిబంధనల ప్రకారం, నగదును స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులు ప్రతిపాదించారు.

పన్ను బకాయిల కింద ఇప్పటివరకు 3.09 కోట్ల రూపాయలు రాబట్టడం జరిగింది.   సున్నితమైన ఈ విచారణలో అవసరమైన తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి. 

 

*****



(Release ID: 1785107) Visitor Counter : 115


Read this release in: English , Urdu , Hindi