ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
యు.పి.లో 7 ఇంటర్నెట్ ఎక్సేంజీలు!
కేంద్రమంత్రుల చేతుల మీదుగా ఒకేసారి ప్రారంభం..
ఉత్తరప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్ సేవలు,
మరింత మెరుగుపడే అవకాశం
Posted On:
23 DEC 2021 6:47PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 7 నగరాల్లో కొత్తగా 7 ఇంటర్నెట్ ఎక్సేంజీలు డిసెంబరు 23న ఒకేసారి ప్రారంభమయ్యాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్, నిక్సీ సి.ఇ.ఒ. అనిల్ కుమార్ జైన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఆగ్రాలో ఉదయం 11గంటలకు ప్రధాన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేషనల్ ఇంటర్నెట్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్.ఐ.ఎక్స్.ఐ.-నిక్సీ) చొరవతో మొదలైన ఈ కొత్త ఇంటర్నెట్ ఎక్సేంజీలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు, పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల నాణ్యత, బ్రాడ్ బాండ్ సేవల నాణ్యత మరింతగా మెరుపడుతుంది. నిక్సీ అందించే ఇంటర్నెట్ నాణ్యత కూడా పెరుగుతుంది. దీనితో ఉత్తరప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా ఎంతో మెరుగుపడతాయి. ఉత్తరప్రదేశ్.లోని ఇంటర్నెట్ వ్యవస్థ మరింత ఊపందుకుంటుంది.
ఇంటర్నెట్ ఎక్సేంజీల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెసిన వ్యాఖ్యలు.
- "ఈ రోజున మనం 2021వ సంవత్సరంలో ఉన్నాం. అయితే, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల జీవితాల్లో విభిన్నత్వం తీసుకురావాలన్న లక్ష్య సాధనలో మాత్రం మనం ఇప్పటికే ఎంతో ప్రగతిని సాధించామని తెలుస్తోంది."
- "గడచిన ఒక్క ఏడాదిలోనే భారతదేశానికి రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ.లు) వచ్చాయి. ఇపుడు మనం ప్రతి నెలా రెండు భారీ స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేయగలుగుతున్నాం. అంటే, ప్రపంచంలోనే అతి వేగంగా స్టార్టప్ కంపెనీల సానుకూల వ్యవస్థను సృష్టించేలా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాం."
- "మనం ఇక్కడ ఒక చిన్న బెంగళూరును ఏర్పాటు చేయలేకపోవచ్చు. అయితే, పెద్ద ఆగ్రాను మాత్రం తయారు చేస్తాం. యు.పి.ని డిజిటల్ ఉత్తరప్రదేశ్.గా తీర్చిదిద్దుతాం."
- "హైవేస్.ను (రహదారులను) కలిగి ఉండటం చాలా ముఖ్యమే. అయితే, ఐ. వేస్ కోసం (ఇంటర్నెట్ సేవల కోసం) ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలు కూడా అవసరం. ఇందుకోసమే మేం ఈ ఇంటర్నెట్ ఎక్సేంజీలను ప్రారంభిస్తున్నాం."
- "ఇక ఇపుడు ఉత్తరప్రదేశ్.ను పెట్టుబడులకు కేంద్రంగా పెట్టుబడిదారులంతా భావించవచ్చు. అదే దృష్టితో వారు ఉత్తరప్రదేశ్.ను చూడవచ్చని ఆశిస్తున్నాం."
- "డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద డిజిటల్ టెక్నాలజీకి ఒక ప్రధాన కేంద్రంగా ఉత్తరప్రదేశ్ ఆవిర్భవిస్తోంది. "
- "డిజిటల్ ఇండియా పథకంవల్లనే కోవిడ్ మహమ్మారి దాడినుంచి భారతదేశం విజయవంతంగా బయటపడింది. ఫలితంగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా 135కోట్ల వ్యాక్సీన్లను ప్రజలకు అందించగలిగాం."
- "కేవలం ఇంటర్నెట్ వినియోగదారులకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకే కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అంతటికీ ఇంటర్నెట్ ఎక్సేంజీ లాభం చేకూరుస్తుంది."
కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ వ్యాఖ్యలు
- "మార్కొనీ వైర్లెస్ రేడియోను మరీ ఆలస్యంగా కనుగొన్నాడు. అప్పటికే మనం ఆ సౌకర్యాన్ని కలిగి ఉన్నాం. ఇపుడు మనం చేయాల్సింది ఏమంటే.. మన పూర్వీకులు ఆవిష్కరించిన వాటన్నింటినీ తిరిగి వెలుగులోకి తెస్తే చాలు."
- "కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తిలో ఉన్నప్పటికీ జాతి ముందుకు సాగేందుకు ఇంటర్నెట్ ఎంతో దోహదపడింది. కోవిడ్ కారణంగా దేశంలో ఏ పనీ ఆగిపోలేదు."
- "హైదరాబాద్, బెంగుళూరు నగరాలతో సమాన స్థాయికి చేరాలని, దేశానికే కొత్త ఐ.టి. కేంద్రంగా ఎదగాలని ఆగ్రా నగరం కలలు కంటోంది."
- “ఇంటర్నెట్ ఎక్సేంజీ, ఇంటర్నెట్ సదుపాయం ఉనికి మనల్ని కాపాడుతోంది. పెన్షనర్ల నగరంగా మారకుండా ఇంటర్నెట్ నివారిస్తోంది."
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా, లక్నో, కాన్పూర్, ప్రయాగ్ రాజ్, వారణాసి, గోరఖ్.పూర్, మీరట్ నగరాల్లో డిసెంబరు 23న ఒకేసారి నిక్సీ ఎక్సేంజీలు మొదలవడం గొప్ప పరిణామం. రాష్ట్రంలో మెరుగైన ఇంటర్నెట్ వ్యవస్థకు ఇది దోహదపడుతుంది. ఇంటర్నెట్ సదుపాయం మరింత పటిష్టంగా తయారవుతుంది. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన ఇంటర్నెట్ బట్వాడా జరుగుతుంది. వ్యవసాయానికి, స్టార్టప్ వ్యవస్థలకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎం.ఎస్.ఎం.ఇ.లకు) మెరుగైన రీతిలో ఇంటర్నెట్ ద్వారా సమాచారం చేరువవుతుంది. ఉత్తరప్రదేశ్.లో కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఒ.టి.) వంటి సదుపాయాల ఆవిర్భావానికి గట్టి పునాదులు ఏర్పడతాయి. ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు పౌరులకు మరింత సౌకర్యవంతంగా, అందుబాటు యోగ్యంగా మారిపోతాయి. ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఎంతో మెరుగవుతాయి. అంటే,..ఇంటర్నెట్ ఎక్సేంజీల ప్రారంభంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారన్నమాట.
దేశంలోని ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో సమీప భవిష్యత్తులో మరెన్నో ఇంటర్నెట్ ఎక్సేంజీలను ప్రారంభించాలని నిక్సీ యోచిస్తోంది. ఇలాంటి ఎక్సెంజీలతో దేశం అంతటా ఇంటర్నెట్ వ్యవస్థను పూర్తిగా మెరుగు పరిచి, ఇంటర్నెట్ వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని నిక్సీ సంకల్పించింది.
తాను ప్రారంభించే ఏదైనా ఒక ఎక్సేంజీతో జతకలసి దేశంలో ఇంటర్నెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడాలంటూ, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్ సంస్థలన్నింటికీ నిక్సీ పిలుపునిచ్చింది.
.
నేషనల్ ఇంటర్నెట్ ఎక్సేంజీ ఆఫ్ ఇండియా (నిక్సీ) గురించి:
నేషనల్ ఇంటర్నెట్ ఎక్సేంజీ ఆఫ్ ఇండియా (ఎన్.ఐ.ఎక్.ఐ.-నిక్సీ) అనేది లాభాపేక్ష లేని సంస్థ. భారతీయ పౌరులకు ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసేందుకు 2003వ సంవత్సరంనుంచి ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ లక్ష్య సాధనకు ఈ కింది కార్యకాలాపాలను నిక్సీ నిర్వహిస్తోంది.: -
• ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య పరస్పరం ఇంటర్నెట్ డేటా పంపిణీ జరిగే చూడటం. అలాగే, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ (సి.డి.ఎన్.)ల మధ్య ఇంటర్నెట్ డేటా పంపిణీని ప్రోత్సహించడం.
• ఐ.ఎన్. కంట్రీ కోడ్ డోమైన్, భారత్ (भारत) ఐ.డి.ఎన్. డొమైన్ విక్రయానికి, నిర్వహణకు కృషి చేయడం.
• ఆస్ట్రేలియాకు చెందిన ఆసియా పసిఫిక్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎ.పి.ఎన్.ఐ.సి.) అధీకృత ఆమోదం ప్రకారం ఇంటర్నెట్ ప్రొటోకాల్ (IPv4/IPv6)ను విక్రయించడం, నిర్వహించడం, పనితీరును పర్యవేక్షించడం.
****
(Release ID: 1784804)
Visitor Counter : 189