వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
చక్కెర రంగంలో ప్రస్తుత.. అమలులోగల భారతదేశ విధాన చర్యలపై చక్కెర సంబంధిత డబ్ల్యూటీవో కమిటీ నివేదిక ప్రభావం శూన్యం
దేశం.. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సదరు నివేదికను వ్యతిరేకిస్తూ డబ్ల్యూటీవోలో అప్పీలు దాఖలుకు భారత ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది
తన చర్యలు తనకుగల బాధ్యతలకు తగినట్లుగా.. డబ్ల్యూటీవో
ఒప్పందాల పరిధిలోనే ఉన్నాయని భారత్ పూర్తిగా విశ్వసిస్తోంది
డబ్ల్యూటీవో కమిటీ నివేదించిన అంశాలు భారత్‌కు ఆమోదయోగ్యం కాదు
Posted On:
14 DEC 2021 8:50PM by PIB Hyderabad
చక్కెర రంగంలో ప్రస్తుత.. అమలులోగల భారతదేశ విధాన చర్యలపై చక్కెరకు సంబంధించి ప్రపంచ వాణిజ్యం సంస్థ (డబ్ల్యూటీవో) కమిటీ నివేదిక ప్రభావం ఎంతమాత్రం ఉండదు. ఈ మేరకు దేశ ప్రయోజనాలతోపాటు రైతు ప్రయోజనాల పరిరక్షణ కోసం సదరు నివేదికను వ్యతిరేకిస్తూ డబ్ల్యూటీవోలో అప్పీలు దాఖలుకు భారత ప్రభుత్వం ఇప్పటికే తగిన చర్యలు ప్రారంభించింది. కాగా, చక్కెర రంగంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని విధాన చర్యలపై 2019లో ఆస్ట్రేలియా, బ్రెజిల్, గ్వాటెమాలా దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాలు చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా చెరకు ఉత్పత్తిదారులకు భారత్ ఇస్తున్న మద్దతు డబ్ల్యూటీవో అనుమతించిన పరిమితులను ఉల్లంఘించినట్లు ఆ దేశాలు ఆరోపించాయి. అంతేకాకుండా చక్కెర కర్మాగారాలకు నిషేధిత ఎగుమతి రాయితీలను కూడా భారత్ ఇస్తున్నదని అవాస్తవ ఆరోపణ చేశాయి.
ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో నియమించిన కమిటీ 2021 డిసెంబరు 14న ఇచ్చిన నివేదికలో చెరకు పండించే రైతులకు, ఎగుమతిదారులకు మద్దతుగా మన దేశం అమలు చేస్తున్న పథకాలకు వ్యతిరేకంగా పూర్తి అవాస్తవాలను నివేదించింది. అయితే, డబ్ల్యూటీవో కమిటీ నివేదించిన అంశాలు భారత్‌కు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావు. కమిటీ పేర్కొన్న అంశాలు అహేతుకమైనేవే కాకుండా డబ్ల్యూటీవో నిబంధనలకు ఏమాత్రం అనుగుణంగా లేవు. తనకు నిర్దేశించిన కీలక అంశాలను శోధించే బాధ్యతను సదరు కమిటీ పూర్తిగా విస్మరించింది. అంతేగాక ఫిర్యాదుదారీ దేశాలు ఆరోపిస్తున్నట్లుగా ఎగుమతి రాయితీలపై నివేదికలో పేర్కొన్న అంశాలు తర్కానికి, హేతుబద్ధతకు ఏమాత్రం పొసగని విధంగా ఉన్నాయి. అందుకే తన చర్యలు తనకుగల బాధ్యతలకు తగినట్లుగానే కాకుండా డబ్ల్యూటీవో ఒప్పందాల పరిధిలోనే ఉన్నాయని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు భారత్ స్పష్టం చేస్తోంది.
***
(Release ID: 1781798)
Visitor Counter : 170