శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
స్టార్టప్ కంపెనీల "సుస్థిరత" దేశ ఆర్థిక భవితకు కీలకం!
జీవనోపాధి అవకాశాలతో అవి అనుసంధామై
ఉండాలన్న కేంద్రమంత్రి జితేంద్ర సింగ్...
పనాజీలో ఐ.ఐ.ఎస్.ఎఫ్. ఏడవ సదస్సుకు
మంత్రి ప్రారంభోత్సవం..
విభిన్న రంగాల్లో స్టార్టప్.ల ద్వారా,
ప్రత్యామ్నాయ జీవనోపాధి వనరులను
సృష్టించాలని యువజనులకు పిలుపు...
Posted On:
11 DEC 2021 3:42PM by PIB Hyderabad
జీవనోపాధి అవకాశాలతో అనుసంధానమైన సార్టప్ కంపెనీల సుస్థిరత,. దేశ ఆర్థిక భవితవ్వానికి ఎంతో కీలకమని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ వైజ్ఞానిక ఉత్సవం (ఐ.ఐ.ఎస్.ఎఫ్.-2021) ఏడవ సదస్సును ఈ ఉదయం గోవాలోని పనాజీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ,.. ప్రస్తుత జనాభాలో 70శాతానికిపైగా యువజనులే ఉండటం మనదేశానికి ఉన్న గొప్ప సానుకూలమైన అంశమని అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరిస్తున్న ప్రస్తుత తరుణంలోనే సుస్థిరమైన స్టార్టప్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఉంటున్న జితేంద్ర సింగ్, సైన్స్, టెక్నాలజీతోపాటుగా, భూగోళ విజ్ఞానం, ప్రధానమంత్రి కార్యాలయ, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షపరిశోధన శాఖలను స్వతంత్ర బాధ్యతలతో నిర్వహిస్తూ వస్తున్నారు.
కేంద్ర ఆయుష్, ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర పర్యాటకం, ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల సహాయమంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మధ్యప్రదేశ్ సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రి ఓంప్రకాశ్ సక్లేచా, భూగోళ శాస్త్రాల శాఖ కార్యదర్శి డాక్టర్ రవిచంద్రన్, విజ్ఞాన భారతి అధ్యక్షుడు డాక్టర్ విజయ్ భట్కర్, సీనియర్ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, జీవనోపాధికోసం ప్రత్యామ్నాయ వనరులను సృష్టించే విషయమై ఆలోచించాలని, అందుకు సరైన దృక్పథాన్ని అలవర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఇందుకోసం వ్యవసాయం, పాడిపరిశ్రమ, పశుసంవర్థకం, ఆరోగ్యరక్షణ, విద్య, ఔషధరంగం, లాజిస్టిక్స్ వంటి వివిధ రంగాల్లో అవకాశాలకోసం సృజనాత్మకమైన స్టార్టప్ కంపెనీల వ్యవస్థ ద్వారా అన్వేషణ జరపాలన్నారు. చెత్తనుంచి సంపదను సృష్టించే వినూత్నమైన ప్రత్యాత్నాయ మార్గాలపై కూడా అన్వేషణ అవసరమని అన్నారు. ప్రజల జీవితాలను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్న సార్టప్ కంపెనీలు కేవలం 3-4 మార్కెట్లపై ఆధారపడటం మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రజల, వినియోగదారుల జీవితాలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. స్టార్టప్ కంపెనీల వ్యవస్థ భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలను కూడా కల్సిస్తున్నదని అన్నారు. గ్రామీణ భారతదేశాన్ని అధునాతన పరిష్కారాలు, సేవలతో అనుసంధానం చేస్తున్న స్టార్టప్ కంపెనీలు,..డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సృజనాత్మక శక్తులుగా ఆవిర్భవిస్తున్నాయని, వివిధ కార్యక్రమాలు మరింత వేగవంతం చేస్తున్నాయని అన్నారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ – "సుసంపన్న భారతావనికోసం సృజనాత్మకత, వైజ్ఞానికశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో విజయాల సాధన". అనే ఇతివృత్తంతో ఈ నాలుగు రోజుల ఐ.ఐ.ఎస్.ఎఫ్. ఉత్సవ సదస్సును నిర్వహించుకుంటున్నట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవాలను భారతదేశం జరుపుకుంటున్నదని, తదుపరి 25 సంవత్సరాల వైజ్ఞానిక శాస్త్ర ప్రగతికోసం ఇపుడే కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
“విజ్ఞాన్ ఉత్సవ్”లో పాల్గొనవలసిందిగా ఆయన యువతకు పిలుపునిచ్చారు. సృజనాత్మక స్టార్టప్ కంపెనీల ద్వారా 2024-25వ సంవత్సరానికల్లా భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల శక్తివంతమైన ఆర్థిక శక్తిగా తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో వైజ్ఞానిక శాస్త్రం కేవలం పరిశోధనాంశం మాత్రమే కాదని, అది మనకు ఆనందదాయకమైన అంశంగా రూపుదాల్చిందని, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో సైన్స్ ఉత్సవాన్ని నిర్వహించి, యువతలో విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించాలని అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణలను ప్రజలు వినింయోగించుకునేలా చేసి, ప్రజా సమూహానికి అందుబాటు యోగ్యంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడమే సైన్స్ ఉత్సవం ప్రధాన లక్ష్యమని కేంద్రమంత్రి అన్నారు.
ఐ.ఐ.ఎస్.ఎఫ్. ఏడవ సదస్సు ప్రారంభోత్సవంలో సైన్స్ గ్రామం, సంప్రదాయ సిద్ధమైన హస్తకళలు, కళాకారుల సమావేశం, గేమ్స్, ఆటబొమ్మల స్టాల్స్, ప్రపంచ భారతీయ శాస్త్రవేత్తల, టెక్నాక్రాట్ల ఉత్సవం, ఇకో-ఫెస్ట్, కొత్త యుగపు సాంకేతిక పరిజ్ఞానం, మెగా సైన్స్, టెక్నాలజీ ప్రదర్శన వంటి విభిన్న కార్యక్రమాలను నిర్వహించారు.
దేశంలో సుస్థిర అభివృద్ధి, నూతన సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కారాలే లక్ష్యంగా వైజ్ఞానిక ఆలోచన ధోరణిని విస్తృతం చేయాలన్న దీర్ఘకాలిక దార్శనికతలో భాగంగానే ఐ.ఐ.ఎస్.ఎఫ్. ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ద్వారా నూతన గ్రామీణ భారత దేశ నిర్మాణం ఐ.ఐ.ఎస్.ఎఫ్. లక్ష్యమని అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న నవయువ విద్యార్థులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక పరిజ్ఞాన నిపుణులు తమ ఆలోచనలను, భావనలను పరస్పరం పంచుకునేందుకు ఐ.ఐ.ఎస్.ఎఫ్. ఒక వేదికగా ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి అన్నారు. అలాగే, ప్రధానమంత్రి గత ఏడేళ్ల కాలంలో ప్రారంభించిన ఫ్లాగ్.షిప్ కార్యక్రమాలైన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’, స్వస్థ్ భారత్ అభియాన్, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్మార్ట్ గ్రామాలు’, ‘స్మార్ట్ నగరాలు’ ‘ నమామి గంగే’, ‘ఉన్నత్ భారత్ అభియాన్’ వంటి వాటికి కూడా ఐ.ఐ.ఎస్.ఎప్. ఒక వేదికగా ఉంటుందని జతేంద్ర సింగ్ అన్నారు.
భారతీయ అంతర్జాతీయ వైజ్ఞానిక శాస్త్ర ఉత్సవం (ఐ.ఐ.ఎస్.ఎఫ్.) అనేది, కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వశాఖ, కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ, విజ్ఞాన భారతి (విభా) కలసి ఉమ్మడిగా నిర్వహిస్తున్న కార్యక్రమం. స్వదేశీ భారత ఉద్యమంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఐ.ఐ.ఎస్.ఎఫ్. తొలి కార్యక్రమాన్ని 2015లో నిర్వహించారు. ఈ ఉత్సవం ఆరవ భాగాన్ని 2020లో నిర్వహించారు. వైజ్ఞానిక శాస్త్ర ప్రయోజనాలను దేశంలోని ప్రజలతో పాటుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో కలసి ఉత్సవంగా నిర్వహించుకోవడమే ప్రధాన ధ్యేయంగా ఐ.ఐ.ఎస్.ఎఫ్.ను నిర్వహిస్తూ వస్తున్నారు.
<><><>
(Release ID: 1780553)
Visitor Counter : 178