ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్-19 మహమ్మారి సమయంలో రాష్ట్రాలకు చెల్లించిన - జి.ఎస్.టి. పరిహారం

Posted On: 07 DEC 2021 5:38PM by PIB Hyderabad

జి.ఎస్.టి. (రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017 నిబంధనల ప్రకారం, 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జి.ఎస్.టి. పరిహారం ఇప్పటికే రాష్ట్రాలకు చెల్లించడం జరిగింది.  కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

మహమ్మారి వల్ల నెలకొన్న ఆర్థిక ప్రభావం కారణంగా జి.ఎస్.టి. వసూళ్ళు తక్కువగా ఉండడంతో జి.ఎస్.టి. పరిహారం ఎక్కువగా చెల్లించవలసిన పరిస్థితి నెలకొందనీ , అదే సమయంలో జి.ఎస్.టి. పరిహారం సెస్‌ కూడా తక్కువగా వసూలయ్యిందని మంత్రి పేర్కొన్నారు.

ఇటీవల, 2021 నవంబర్, 3వ తేదీన, కేంద్ర ప్రభుత్వం,  పరిహార నిధి నుండి రాష్ట్రాలకు జి.ఎస్.టి. పరిహారం కింద 17,000 కోట్ల రూపాయల మేర  విడుదల చేసింది.   రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన జి.ఎస్.టి. పరిహారం వివరాలు అనుబంధం లో పొందుపరచడం జరిగింది. 

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు చెల్లించాల్సిన పరిహారం పూర్తిగా చెల్లించడానికి, జీ.ఎస్‌.టీ. పరిహార నిధి లోని మొత్తం సరిపోకపోవడం తో, ఇంతకు ముందు 1,13,464 కోట్ల రూపాయల మేర పాక్షికంగా  విడుదల చేసిన జీ.ఎస్‌.టీ. పరిహారానికి అదనంగా ఈ నిధులు విడుదల చేయడం జరిగిందని మంత్రి వివరించారు. 

మహమ్మారి ఆర్థిక ప్రభావం కారణంగా, తక్కువగా వసూలైన జి.ఎస్.టి. పరిహార సెస్ గురించి, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు జి.ఎస్.టి. పరిహారం తక్కువగా విడుదల చేయడం గురించి, 41వ, 42వ, 43వ జి.ఎస్.టి. మండలి సమావేశాల్లో చర్చించినట్లు మంత్రి తెలియజేశారు. జి.ఎస్.టి. పరిహారంలో ఏర్పడిన లోటు కారణంగా, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, తమ అవసరాలను తీర్చుకోడానికి వీలుగా, జి.ఎస్.టి. మండలి నిర్ణయం ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1.1 లక్షల కోట్ల రూపాయలు; అదే విధంగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికి 1.59 లక్షల కోట్ల రూపాయలు, బ్యాక్-టు-బ్యాక్ రుణాలుగా విడుదల చేయడం జరిగింది.  రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మూలధన వ్యయాలను చేపట్టేందుకు వీలుగా ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని ముందుగా విడుదల చేయడం జరిగింది.   దీనికి అదనంగా, పరిహార నిధిలో అందుబాటులో ఉన్న మొత్తాన్ని బట్టి, జి.ఎస్.టి. రాబడి లోటును భర్తీ చేయడానికి కేంద్రం రాష్ట్రాలకు సాధారణ జి.ఎస్.టి. పరిహారాన్ని కూడా విడుదల చేస్తుంది. 

2020-21 ఆర్థిక సంవత్సరం మరియు 2021-22 ఆర్థిక సంవత్సరంలో విడుదలైన బ్యాక్-టు-బ్యాక్ రుణాలతో పాటు పరిహార నిధి నుంచి విడుదలైన జి.ఎస్.టి. పరిహారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, తాత్కాలిక గణాంకాల ప్రకారం,  రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు,   2020, ఏప్రిల్ నుంచి 2021, మార్చి వరకు 37,134 కోట్ల రూపాయలు;     2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 14,664 కోట్ల రూపాయల మేర జి.ఎస్.టి. పరిహారం బకాయిలు చెల్లించవలసి ఉందని, మంత్రి పేర్కొన్నారు.   జి.ఎస్.టి. (రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017 ప్రకారం, జి.ఎస్.టి. ఆదాయ లోటును భర్తీ చేయడంతో పాటు రుణాన్ని తీర్చడం కోసం పరిహారం సెస్‌ను 5 సంవత్సరాలకు మించి పొడిగించడం ద్వారా,  రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు జి.ఎస్.టి. పరిహారాన్ని పూర్తిగా విడుదల చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. 

జి.ఎస్.టి. పరిహారాన్ని 2022 తర్వాత పొడిగించాలనే ప్రతిపాదనపై మంత్రి వివరణ ఇస్తూ,  రాజ్యాంగంలోని సెక్షన్ 18 (నూట ఒకటవ సవరణ) చట్టం, 2016 ప్రకారం, వస్తు, సేవల పన్నుల మండలి చేసిన సిఫార్సులను అనుసరించి, చట్ట ప్రకారం,  పార్లమెంటు, జి.ఎస్.టి. అమలు తేదీ నుంచి ఐదేళ్ల వరకు వస్తు సేవల పన్ను అమలు కారణంగా ఉత్పన్నమయ్యే ఆదాయ నష్టానికి రాష్ట్రాలకు పరిహారం అందజేయవచ్చని, 

పేర్కొన్నారు.   పరివర్తన కాలంలో, రాష్ట్రాల ఆదాయం 2015-16 ఆధార సంవత్సరం ఆదాయం కంటే సంవత్సరానికి 14 శాతం వద్ద రక్షణ కల్పించడం జరుగుతుంది.   రాజ్యాంగ నిబంధన ప్రకారం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు జి.ఎస్.టి. పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

*****


(Release ID: 1779144) Visitor Counter : 184


Read this release in: English , Marathi , Tamil