జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జల్ జీవన్ మిషన్ కింద మహారాష్ట్రకు రూ.1,667 కోట్ల కేంద్ర గ్రాంట్ విడుదల

Posted On: 04 DEC 2021 5:24PM by PIB Hyderabad

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలన్నీటిలో ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరందించటానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. అందుకే జల్ జీవన్ మిషన్ అమలు చేయటానికి మహారాష్ట్రకు రూ.1666.64 కోట్ల గ్రాంటు విడుదలచేసింది. 2021-22 సంవత్సరానికి గాను కేంద్రనిధిగా రూ. 7064.41 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే, ఇది అంతకు ముందు సంవత్సరం కంటే  దాదాపు 4  రెట్లు ఎక్కువ.

 

మహారాష్ట్రలో మొత్తం 142.36 లక్షల గ్రామీణ నివాసాలున్నాయి. వాటిలో  96.46 ఇలక్షల ఇళ్ళు (67.76%) ఇప్పటికే కుళాయిల ద్వారా నీళ్ళందుకుంటున్నాయి. 2021-22 లో ఈ రాష్ట్రం 27.45 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ కు అత్యంత ప్రాధాన్యమిచ్చి ప్రోత్సాహిస్తోంది. బడ్జెట్ కేటాయింపులే అందుకు నిదర్శనంగా నిలిచాయి. 2020-21 లో రూ. 23,022 కోట్లు కేటాయించగా ప్రస్తుత సంవత్సరమైన 2021-22 లో రూ. 92,309 కోట్లు కేటాయించటమే అందుకు నిదర్శనం.

  

పైగా, 2021-22 లో  నీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలకు స్థానిక సంస్థలకిచ్చే 15 వ ఆర్థిక సంఘం గ్రాంటుగా 2021-22 లో మరో రూ. 2,584 కోట్లు మహారాష్ట్రకు కేటాయించింది.  వచ్చే అయిదేళ్లలో, అంటే 2025-26 వరకు  రూ. 13,628 కోట్లు ఇవ్వటానికి కూడా హామీ ఇచ్చింది.  

 

మారుమూల గ్రామాలకు ముందస్తుగా సౌకర్యం కల్పించే పద్ధతిలో జల్ జీవన్ మిషన్  అమలును మారుమూల ప్రాంతాలనుంచి ప్రారంభిస్తున్నారు. స్థానిక గ్రామ సంఘాలు ఇందులో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రణాళికా రూపకల్పన మొదలుకొని అమలు దాకా, నిర్వహణ మొదలుకొని సరఫరా, మరమ్మతుల దాకా వీళ్ళదే బాధ్యత. ఇందుకోసం నీటి సమితుల ఏర్పాటు, గ్రామీణ కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనలలో రాష్ట్రం చురుగ్గా వ్యవహరిస్తుంది. గ్రామ సభలో ప్రణాళికల తయారీ, నీటి సరఫరా పథకాలమీద చర్చ జరుగుతాయి. అక్కడే ఆమోదం కూడా పొందుతాయి.

 

గ్రామాలలో ఏ ఇంటిలోనైనా  ప్రధానంగా నీటి నిర్వహణ మహిళల చేతుల మీదు గానే సాగుతుంది గనుక ఈ చర్చలలో మహిళలు పాల్గొనటాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. ప్రజలలో అవగాహన పెంచటానికి కూడా అమలుకు దోహదం చేసే ఏజెన్సీల సేవలు వాడుకుంటారు. సురక్షిత నీటి అవసరాన్ని తెలియజెప్పటానికి, ఈ కార్యక్రమాన్ని అమలు చేయటానికి పంచాయితీరాజ్ సంస్థలకు సహకరించటానికి ప్రాధాన్యమిస్తారు.

ఇందులో భాగంగా 2.74 లక్షలమంది సామర్థ్య నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వీరిలో గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీలు, ఇంజనీర్లు, నిఘా సంఘాలు పంచాయితీ సభ్యులు ఉంటారు. రాష్ట్రంలోని  దాదాపు  4.15 లక్షలమందికి నైపుణ్య శిక్షణ ఇస్తారు. స్థానికులకే శిక్షణ ఇవ్వటం వలన తాపీ మేస్త్రీ , ప్లంబర్,  ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్ లాంటివాళ్ళు అందుబాటులో ఉంటారు. లక్షలాది మంది గ్రామీణులకే ఉపాధి అవకాశం కూడా ఇచ్చినట్టవుతుంది.  ఆదాయమిచ్చే అవకాశాలు అందుబాటులో ఉంటాయి.   

 

ప్రజారోగ్యం మీద దృష్టిసారించి దేశవ్యాప్తంగా 2,000 కు పైగా నీటి నాణ్యతా పరీక్షాకేంద్రాలు ప్రారంభమయ్యాయి.  దీనివలన ప్రజలు కోరుకున్నప్పుడు తమ నీటి నమూనాల నాణ్యతను నామమాత్రపు ధరకే పరీక్షించుకోగలుగుతారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 177 నీటి నాణ్యతా పరీక్ష చేసే లేబరేటరీలున్నాయి. తాగటానికి, మధ్యాహ్న భోజనం వండటానికి, చేతులు కడుక్కోవటానికి, స్కూళ్ళలో టాయిలెట్లలో వాడటానికి , అంగన్వాడీ కేంద్రాలకూ తగినంత కుళాయినీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని 72,032 స్కూళ్ళు  (84%) , 73,377 (80%) అంగన్వాడీ కేంద్రాలలో కుళాయి నీరు అందుబాటులో ఉంది.

 

2019 లో జల్ జీవన్ మిషన్ మొదలైనప్పుడు మొత్తం 19.20 కోట్ల గ్రామీణ నివాసాలకు గాను కేవలం 3.23 కోట్ల  (17%) ఇళ్లకు మాత్రమే కుళాయిల ద్వారా నీరందుకునే సౌకర్యం ఉంది.  కోవిడ్  సంక్షోభం విసిరిన సవాళ్ళ మధ్య కూడా 5.38 కోట్లకు పైగా  (28%) ఇళ్ళకు కుళాయి నీరు అందించగలిగారు. ప్రస్తుతం 8.61 కోట్ల (45%) గ్రామీణ నివాసాలకు కుళాయి నీరు అందుతోంది. గోవా, తెలంగాణ, అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా-నాగర్ హవేలి, డామన్-డయ్యూ , పుదుచ్చేరి, హర్యానా లో “హర్  ఘర్ జల్”  సాకారమైంది. 100% ఇళ్ళకు కుళాయి నీరందుతోంది.  మహారాష్ట్ర  2024 నాటికి హర ఘర్ జల్ స్థాయికి చేరుకుంటుంది.  

 

***


(Release ID: 1778210) Visitor Counter : 113