రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

రహదారుల వెంట మొక్కల పెంపకం

Posted On: 01 DEC 2021 2:50PM by PIB Hyderabad

జాతీయ రహదారుల అభివృద్ధి అంటే అందులో ఎం.ఓ.ఆర్.టి.హెచ్. ద్వారా సేకరించిన చెట్ల ను సరైన రీతిలో నరికివేయడం కూడా ఒక భాగం.  అందువల్ల, ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల విస్తరణ కోసం, వాటి వెంబడి ఉన్న చెట్లను కనిష్ట స్థాయిలో తొలగించడంపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతోంది. 

అటవీ (పరిరక్షణ) చట్టం- 1980; అటవీ మరియు అటవీ యేతర ప్రాంతాలకు సంబంధించిన స్థానిక చట్టాల ప్రకారం చెట్లను నరకడం లేదా తొలగించడం కోసం తగిన అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాత, చెట్లను నరకడం లేదా తొలగించడం అనే ప్రక్రియను అటవీ శాఖ, అటవీ కార్పొరేషన్ లేదా కాంట్రాక్టర్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.  చెట్ల నరికివేతకు సంబంధించిన సమాచారాన్ని, ఆయా ప్రాజెక్టుల స్థాయిలో సమీకరించి, నిర్వహించడం జరుగుతుంది. 

పర్యావరణ పరంగా సంభవించే నష్టాన్ని భర్తీ చేసేందుకు, రహదారుల మధ్యలోనూ, రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ ద్వారా లేదా అటవీ శాఖ ద్వారా చేపట్టడం జరుగుతుంది.  వీటికి అదనంగా, ఎఫ్.సి.ఏ.-1980 మరియు స్థానిక చట్టాల ప్రకారం చట్టబద్ధమైన సమ్మతి కోసం అటవీశాఖ పరిహార అడవుల పెంపకాన్ని చేపట్టడంతో పాటు, పోటీ బిడ్డింగ్ ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలు / ఎన్.జి.ఓ. సంస్థలు కూడా ఈ మొక్కలు పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 

2017-2018 నుండి 2021-22 వరకు (అక్టోబర్, 2021 వరకు) జాతీయ రహదారుల వెంబడి ఎన్.హెచ్.ఏ.ఐ.మొత్తం 223.94 లక్షల మొక్కలను నాటింది. 

వీటికి అదనంగా, 2021, మార్చి వరకు 94 ప్రాజెక్టుల్లో 55.10 లక్షల మొక్కలు నాటడం జరిగింది. 

ఈ విషయాన్ని, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో తెలిపారు.

*****



(Release ID: 1777187) Visitor Counter : 135


Read this release in: English , Urdu , Bengali , Tamil