జల శక్తి మంత్రిత్వ శాఖ
రూ. 225.24కోట్లతో ఉత్తరాఖండ్ నీటి పథకాలకు ఆమోదం!
ఏడుజిల్లాల పరిధిలో 19,000ఇళ్లకు ప్రయోజనం..
వచ్చే ఏడాదికల్లా పల్లెల్లోని 15.18 లక్షల ఇళ్లకు
నీటి కుళాయిల ఏర్పాటుకు రాష్ట్రం ప్రణాళిక..
జలజీవన్ మిషన్ కింద 2021లో ఉత్తరాఖండ్.కు
కేంద్రం కేటాయింపు రూ.1,443.80కోట్లు.
Posted On:
27 NOV 2021 3:07PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రూ. 225.24కోట్ల మేర తాగునీటి పథకాలు అందించే ప్రతిపాదనలకు ఆమోదం పడింది. 2021వ సంవత్సరం నవంబరు 26వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి పథకాల మంజూరు కమిటీ సమావేశంలో ఈ తాగునీటి పనులకు ఆమోదముద్ర లభించింది. ఈ పథకాల ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 293 గ్రామాలకు కుళాయిల ద్వారా మంచినీరు అందించేందుకు వీలవుతుంది. మొత్తం 12 నీటి సరఫరా పథకాలు మంజూరు కాగా, వాటిలో 11 పనులు బహుళ గ్రామాల పథకాలవి కాగా, ఒకటి మాత్రం ఒకే గ్రామానికి సంబంధించిన పథకం. ఇందులో భాగంగా 19,000కు పైగా గ్రామాల్లోని ఇళ్లకు మంచి నీటి కుళాయిలను ఏర్పాటు చేస్తారు.
తాజా సమాచారం ప్రకారం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 15.18 లక్షల ఇళ్లు ఉండగా, 7.41లక్షల ఇళ్లకు (అంటే,. 48.79 శాతం ఇళ్లకు) నీటి కుళాయిల ఏర్పాటు కానున్నాయి. 2021-22వ ఆర్థిక సంవత్సరంలో 2.64లక్షల ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు అమర్చాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
జల జీవన్ మిషన్ (జె.జె.ఎం.) పథకం నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు కుళాయిల ద్వారా మంచినీటి కనెక్షన్ల కార్యక్రమాన్ని చేపట్టేందుకు వీలుగా, రాష్ట్రస్థాయి పథకం మంజూరు కమిటీ (ఎస్.ఎల్.ఎస్.ఎస్.సి.)ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర నీటి సరఫరా ప్రాజెక్టులు, పథకాల విషయంలో రాష్ట్ర స్థాయి కమిటీగా ఎస్.ఎల్.ఎస్.ఎస్.సి. వ్యవహరిస్తుంది. ఇక భారత ప్రభుత్వం తరఫున జాతీయ జలజీవన్ మిషన్ (ఎన్.జె.జె.ఎం.) ప్రతినిధికి కూడా ఈ కమిటీలో ప్రాతినిధ్యం ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలన్న ప్రధానమంత్రి కలను సాకారం చేసేందుకు, సుదూర ప్రాంతాలనుంటి నీటిని మోసుకురావల్సిన ప్రయాసనుంచి మహిళలకు, బాలికలకు విముక్తి కలిగించేందుకు జల జీవన్ మిషన్ రూ. 360.95 కోట్ల సహాయ గ్రాంటును ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కేటాయించారు. 2021-22వ సంవత్సరానికి ఈ మొత్తాన్ని కేటాయించారు. జలజీవన్ మిషన్ పథకం అమలుకోసం 2019-20వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ. 170.53కోట్ల మొత్తాన్ని కేటాయించింది. ఇక ఈ సంవత్సరం,..కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ రూ. 1,443.80 కోట్లను కేటాయించారు. గత ఏడాది మొత్తంతో పోల్చితే ఇది నాలుగు రెట్లు అవుతుంది. జలజీవన్ మిషన్ కింద 2022 డిసెంబరులోగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిల కనెక్షన్లు కల్పించేందుకు కేంద్రంనుంచి పూర్తి సహాయ, సహకారాలను అందిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి షెఖావత్ నిధుల కేటాయింపు సందర్భంగా హామీ ఇచ్చారు.
2019 ఆగస్టు 15వ తేదీన జలజీవన్ మిషన్ పథకం ప్రకటించే నాటికి, రాష్ట్రంలో 1.30లక్షల (8.58శాతం ఇళ్లకు) మాత్రమే ద్వారా మంచినీటి కుళాయిల కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత, 27 నెలల్లో కోవిడ్ వైరస్ మహమ్మారి, లాక్ ఆంక్షలు వంటి అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం 6.11లక్షల ఇళ్లకు (40.21శాతం ఇళ్లకు) నీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేయగలిగింది.
జలజీవన్ మిషన్ పథకం అమలులో వేగం పెంచేందుకు, రాష్ట్రంలోని 2.64లక్షల గ్రామీణ ఇళ్లకు ఈ ఏడాది నీటి కుళాయిల కనెక్షన్ల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవలసిందిగా జాతీయ జలజీవన్ మిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ సంవత్సరం కేంద్రం కేటాయించిన రూ. 1,443.80 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న రూ. 111.22 కోట్లు, 2021-22వ సంవత్సరపు రాష్ట్రం తరఫు మ్యాచింగ్ గ్రాంటు, తదితర మొత్తాలు కలిపి,. జలజీవన్ మిషన్ అమలుకోసం ఉత్తరాఖండ్ వద్ద రూ. 1,733 కోట్లు అందుబాటులో ఉంది. ఈ విధంగా చూస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ప్రత్యేక నీటి పథకం అమలుకోసం ఎలాంటి నిధుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్టుగా భావించవచ్చు.
దీనికి తోడు, మరో వైపు రూ. 256కోట్లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మంజూరయ్యాయి. 2021-22వ సంవత్సరంలో గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు, పంచాయతీ రాజ్ సంస్థలకు నీరు, పారిశుద్ధ్య సదుపాయాల కల్పనకోసం 15వ ఆర్థిక సంఘంతో అనుసధానించిన గ్రాంటుగా ఈ మొత్తాన్ని ఉత్తరాఖండ్.కు కేటాయించారు. తదుపరి ఐదేళ్లవరకూ అంటే, 2025-26వ సంవత్సరం వరకూ అనుసంధాన నిధుల కింద రూ. 1,344 కోట్ల మేర మొత్తం సరఫరా అవుతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకోసం జలజీవన్ మిషన్ అమలుకోసం చేసే ఈ భారీస్థాయి పెట్టుబడితో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఉత్తరాఖండ్.లో గ్రామీణ ఆర్థిక పరిస్థితికి ఊతం లభిస్తుంది. దీనితో గ్రామాల్లోని ప్రజలకు ఆదాయాన్ని అందించే ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి.
మరోవైపు.., పథకం అమలులో ప్రజాసమూహం సేవలు అందించాల్సిన అవసరం ఉందని ఎన్.జె.జె.ఎం. స్పష్టంచేసింది. మురుగునీటి నిర్వహణ, మరుగుదొడ్లనుంచి వెలువడే మురుగునీరు కాక, మిగతా జల వ్యర్థాల నిర్వహణను కూడా నీటి సరఫరా వ్యవస్థల కింద చేపట్టాలని ఎన్.జె.జె.ఎం. పేర్కొంది. నీటి నాణ్యతా పరీక్షల నిర్వహణకు ఈ పథకంలో అగ్రప్రాధాన్యం ఇచ్చారు. ఒక్కో గ్రామానికి ఐదుగురు చొప్పున మహిళలకు నీటి పరీక్షల నిర్వహణలో శిక్షణ ఇస్తారు. పథకం కోసం వాడే నీటి వనరుల వద్ద, సరఫరా జరిగే చోట, క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు నీటిని పరీక్షించడం, ఇందుకోసం క్షేత్రస్థాయి పరీక్షా కిట్లను (ఎఫ్.టి.కె.లను) వినియోగించడం వీరి విధి. ఈ కిట్ల వినియోగంలో ఇప్పటివరకూ 38 వేల మంది మహిళలకు శిక్షణ ఇప్పించారు. రాష్ట్రంలో నీటి పరీక్షలను నిర్వహించే లేబరేటరీల స్థాయిని కూడా నవీకరించారు. నామమాత్రపు ధరతో ప్రజలంతా నీటి నమూనాలను పరీక్షించుకునే సదుపాయాన్ని ఈ లేబరేటరీల్లో ఏర్పాటు చేశారు.
ఇక, రాష్ట్రంలోని నీటి నాణ్యత దెబ్బతిన్న జనావాసాలు, ఆశావహ జిల్లాలు, మెదడువాపు వ్యాధి ప్రభావిత జిల్లాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రజలు ఎక్కువగా ఉన్న గ్రామాలు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్.ఎ.జి.వై.) పథకం అమలులో ఉన్న గ్రామాలకు జల జీవన్ మిషన్ పథకంలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అన్న నినాదానికి అనుగుణంగా జలజీవన్ మిషన్ పథకం ప్రధాన సిద్ధాంతాన్ని రూపొందించారు. నీటి సరఫరాకు నోచుకోకుండా ఎవరూ మిగలిపోకూడదన్నది ఈ పథకం లక్ష్యం. అలాగే, పరిశుభ్రమైన తాగునీటిని కుళాయిల ద్వారా అందరికీ సరఫరా చేయాలన్నది కూడా ఈ పథకం ధ్యేయం.
2019వ సంవత్సరంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టినపుడు,..దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 19.10కోట్ల ఇళ్లలో కేవలం 3.23కోట్ల ఇళ్లకు (అంటే 17శాతం ఇళ్లకు) మాత్రమే నీటికుళాయిలు ఉన్నాయి. గడిచిన 27 నెలల్లో కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం, లాక్ డౌన్ ఆంక్షలతో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఎంతో వేగంగా జలజీవన్ మిషన్ పనులు జరిగాయి. ఈ రోజుకు, గ్రామీణ ప్రాంతాల్లోని 5.32 కోట్ల ఇళ్లకు నీటి కుళాయిల ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం మొత్తం 8.56కోట్ల ఇళ్లకు (అంటే 44.52శాతం ఇళ్లకు) నీటి కుళాయిలు అందుబాటులో ఉన్నాయి. గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, దాద్రా నాగర్ హవేళీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు, వందకు వందశాతం నీటి కనెక్షన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం,..83 జిల్లాల్లోని ప్రతి ఇంటికీ, 1.24లక్షల పైచిలుకు గ్రామాలకు కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా అవుతోంది.
****
(Release ID: 1775726)
Visitor Counter : 147