సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (సిఎటి) ప్రత్యేక బెంచ్‌ని శ్రీనగర్ లో ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
రెండు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ బెంచ్‌లు కలిగిన ఏకైక రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కాశ్మీర్
సత్వరం, తక్కువ ఖర్చుతో బాధిత ప్రభుత్వ ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారానికి జమ్ము , శ్రీనగర్‌లలో వేర్వేరు ట్రిబ్యూనళ్లు.: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
23 NOV 2021 3:30PM by PIB Hyderabad
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు విషయాలను ప్రత్యేకంగా పరిష్కరించేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర),ప్రధానమంత్రి కార్యాలయ శాఖ ,సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి(స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు శ్రీనగర్ లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (సిఎటి) ప్రత్యేక బెంచ్‌ని ప్రారంభించారు. జమ్ము క్యాట్ బెంచ్ 08-06-2020 నుంచి ప్రారంభం కాగా, 17-11-2021న శ్రీనగర్ బెంచ్ పరిధికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ కావడంతో ఇది కూడా ప్రారంభమైంది. ఈ రోజు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో డి.ఒ.పిటి-సిఎటి, సిఐసి, సివిసిలు జమ్ము కాశ్మీర్, లద్దాక్‌లలో పూర్తిగా పనిచేస్తున్నట్టయిందని ఆయన అన్నారు.
రెండు క్యాట్ బెంచ్‌లు కలిగిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కాశ్మీర్ ఒక్కటే నని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చినందువల్లే ఇది సాధ్యమైందని అన్నారు. నూతన కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అంశాల విషయంలో ప్రధానమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన అన్నారు. జమ్ము కాశ్మీర్‌లో రెండు క్యాట్ బెంచ్ లు ఉండడం వల్ల వివిధ కోర్టులపై భారం తగ్గుతుందని అన్నారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ పరిధి కిందికి వచ్చే వారి సర్వీసు అంశాల ఫిర్యాదుల పరిష్కారానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
క్యాట్ జమ్ము బెంచ్ పరిధిని జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన పది జిల్లాలకు , లద్దాక్‌లోని లెహ్‌జిల్లాకు విస్తరించినట్టు ఆయన తెలిపారు. అలాగే శ్రీనగర్ బెంచ్ పరిధి జమ్ముకాశ్మీర్ లోని పది జిల్లాలు, లద్దాక్ లోని కార్గిల్‌కు వర్తిస్తుందని అన్నారు. జుడిషియల్ మెంబర్ శ్రీ డి.ఎస్. మహ్రా, ఇతర సిబ్బందిని శ్రీనగర్ బెంచ్ కోసం కేటాయించారు.
ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పారదర్శకతకు, అందరికీ న్యాయాన్ని అందిచేందుకు ,కట్టుబడి ఉందని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజాహిత సంస్కరణలు జమ్ము కాశ్మీర్,లద్దాక్ ప్రజలతో పాటు మొత్తం దేశ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆర్టికల్ 370, 35 ఎ ని 2019 ఆగస్టులో రద్దు చేసిన తర్వాత జమ్ము కాశ్మీర్‌కు వర్తించని సుమారు 800 కేంద్రప్రభుత్వ చట్టాలు ఇప్పుడు వర్తిస్తున్నాయని అన్నారు. ఇప్పుడు వీరంతా మిగిలిన భారతదేశ పౌరులకు వర్తించే హక్కులను పొందగలుగుతున్నారని అన్నారు.
2021 ఆగస్టు 13న జారీచేసిన ట్రిబ్యూనల్ సంస్కరణల చట్టం 2021 వల్ల క్యాట్‌లో ఖాళీలకు సభ్యుల నియామకం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం క్యాట్ ఛైర్మన్ పదవిలో శ్రీమతి మంజులా దాస్ ఉన్నారని, క్యాట్ లోని అన్ని బెంచీలకు మౌలిక సదుపాయాలు కల్పించి దానిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తున్నదని ఆయన అన్నారు. క్యాట్‌లో ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో పరిష్కారం అవుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. 1985లో ఏర్పడినప్పటి నుంచి 2021 జూన్ 30 నాటికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ 8,56,069 కేసులు పరిష్కారం కోసం రాగా (వివిధ హైకోర్టులనుంచి బదిలీ అయినవి కూడా కలుపుకుని) ఇందులో 7,86,647 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇక 69,442 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సగటున 91.89 శాతం పైగా కేసులు పరిష్కారం అయ్యాయని ఆయన తెలిపారు.
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్ము కాశ్మీర్, లద్దాక్‌లు రెండు వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపుదిద్దుకున్నాయి. పూర్వపు జమ్ము కాశ్మీర్ ఉద్యోగులు కేంద్ర పాలిత ప్రాంత ఉద్యోగులు అయ్యారు.దీనితో ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను క్యాట్ పరిష్కరిస్తోంది. జమ్ము బెంచ్ క్యాట్ ప్రారంభం నాటికి 30 వేల సర్వీసు అంశాలు పెండింగ్‌లో ఉందగా 17,363 హైకోర్టు నుంచి వచ్చినవి. ఇలా హైకోర్టు నుంచి వచ్చిన 17 363 కేసులలో జమ్ము క్యాట్ 4371 కేసులను పరిష్కరించింది ( ఇందులో శ్రీనగర్ విభాగం 2452 కేసులు, జమ్ము విభాగం 1919 కేసులు పరిష్కరించింది) ప్రస్తుతం 12,992 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ( 7610 శ్రీనగర్ విభాగం, 5382 జమ్ము విభాగంలో ఉన్నాయి.)7610 కేసులను జమ్ము క్యాట్ నుంచి శ్రీనగర్ క్యాట్‌కు పంపడం జరుగుతుంది. దాదాపు 13000 కేసులు ఇంకా హైకోర్టులో ఉన్నాయి ఇవి కూడా క్యాట్‌కు రానున్నాయి.
***
(Release ID: 1774726)
Visitor Counter : 140