ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా విద్యార్థుల అభ్యసన నాణ్యతను మెరుగు పరచడం కోసం రుణ ఒప్పందంపై సంతకాలు చేసిన - భారతదేశం మరియు ప్రపంచ బ్యాంకు

Posted On: 23 NOV 2021 1:28PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా విద్యార్థుల అభ్యసన నాణ్యతను మెరుగు పరిచే లక్ష్యంతో, 250 మిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టే ఒక ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు కలిసి చట్టపరమైన ఒప్పందాలపై 2021 నవంబర్, 18వ తేదీన సంతకాలు చేశాయి. 

పాఠశాల విద్య పరిధిలోని అన్ని తరగతులు, గ్రేడుల విద్యార్థులు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందుతారు.  ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందే లబ్దిదారులలో,  45,000 పైగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే సుమారు 40 లక్షల మంది (ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసుగల) విద్యార్థులు;  అంగన్‌వాడీ లలో (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలలో) నమోదు చేసుకున్న 10 లక్షల కంటే ఎక్కువ మంది (మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసుగల) చిన్నారులతో పాటు,  దాదాపు 1,90,000 మంది ఉపాధ్యాయులు, 50,000 మందికి పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఉన్నారు.

"సపోర్టింగ్-ఆంధ్రా" కు చెందిన "లెర్నింగ్-ట్రాన్స్‌ఫర్మేషన్-ప్రాజెక్టు" ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా,  కోవిడ్-19 మహమ్మారి ద్వారా ప్రభావితమైన పిల్లలకు నివారణ అభ్యాస కోర్సులను అందించడంతో పాటు,  ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, షెడ్యూల్డ్ తెగల పిల్లలు, బాలికలతో సహా అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.

“నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులో తీసుకురావడమే, భారతదేశ ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రధానం. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రభావితమైన పిల్లల అభ్యాస నష్టాలను పరిష్కరించడంతో పాటు, చిన్న పిల్లలకు బలమైన ప్రాథమిక విద్యాభ్యాసం పై దృష్టి సారించే శక్తివంతమైన విద్యాసంస్థలు గా ప్రభుత్వ పాఠశాలలను మార్చాలనే దార్శనికతను నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ తోడ్పడుతుంది." అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం పేర్కొంది.  

ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరఫున కేంద్ర  ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం, అదనపు కార్యదర్శి, శ్రీ రజత్ కుమార్ మిశ్రా;  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, శ్రీ బుడితి రాజశేఖర్;  ప్రపంచ బ్యాంకు తరఫున భారతదేశంలోని కంట్రీ డైరెక్టర్, శ్రీ జునైద్ అహ్మద్ సంతకాలు చేశారు. 

రాష్ట్రం కొత్త సామర్థ్య-ఆధారిత బోధన-అభ్యాస విధానాన్ని అవలంబించింది.  ఈ ప్రాజెక్ట్ తరగతి గది ఆధారిత మెంటర్‌-షిప్‌ ల ద్వారా;   అన్ని తరగతులు, సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ఆవశ్యక ఆధారిత ఉపాధ్యాయ శిక్షణ ద్వారా;  "పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ - పి.ఏ.ఎల్" పద్ధతులతో పాటు, ప్రమాణీకరించబడిన పాఠశాల-ఆధారిత మదింపులతో అనుసంధానించబడిన ఇతర పరిష్కార విద్య ద్వారా బోధనా పద్ధతులను మెరుగుపరుస్తుంది. 

సమాజ విశ్వాసాన్ని పెంపొందించడంలో, అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరచడంలో ఈ సేవలను అందించడానికి పాఠశాలల సంస్థాగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం చాలా దోహదపడుతుంది. పాఠశాల సౌకర్యాల మెరుగైన నిర్వహణ, పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణలో తల్లిదండ్రుల ప్రమేయానికి మద్దతు ఇవ్వడం, సమాచారాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు, పాఠశాల భద్రతను మెరుగుపరచడంలో ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుంది.

అంగన్వాడీ కార్యకర్తలకు, ప్రారంభ గ్రేడ్ (గ్రేడ్ 1 మరియు 2) ఉపాధ్యాయులకు స్వల్పకాలిక ఇన్-సర్వీస్ శిక్షణా కోర్సులు నిర్వహించడం ద్వారా, అదేవిధంగా, ఈ కేంద్రాలు, పాఠశాలల్లో బోధనాపరంగా తగిన బోధనా అభ్యాస సామగ్రి (టి.ఎల్.ఎం) సరఫరా చేయడం ద్వారా బలమైన ప్రాథమిక విద్యాభ్యాసం పై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. బలమైన ప్రాథమిక విద్యాభ్యాసం పై తీసుకునే ఇటువంటి శ్రద్ధ భవిష్యత్తులో లేబర్ మార్కెట్‌లకు అవసరమైన అభిజ్ఞా, సామాజిక ప్రవర్తనతో పాటు, భాషా నైపుణ్యాలతో పిల్లలను తయారు చేయడంలో పాఠశాలల సంసిద్ధతను మెరుగుపరుస్తుంది.  ఈ ప్రాజెక్టు గిరిజన ప్రాంతాల్లోని 3,500 పాఠశాలల్లో ఒక సంవత్సరం ప్రీ-స్కూల్-స్థాయి కోర్సును ప్రవేశపెడుతుంది. గిరిజన సమాజంలో తక్కువ స్థాయిలో నేర్చుకునే వారి సమస్యలను పరిష్కరించడానికి, ఈ విధానం సహాయపడుతుంది.

కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో, విద్యార్థులు ఇంటి వద్ద నుంచే నేర్చుకోవడానికి వీలుగా అవకాశాలు కల్పించడం రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత గల అంశంగా ఉంది.  విద్యార్థులకు డిజిటల్ పరికరాల లభ్యత తక్కువగా ఉన్న కారణంగా, టెలివిజన్, రేడియో ప్రసారాల కోసం భౌతిక అభ్యాస కిట్‌ లు మరియు కంటెంట్‌ ను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతోంది.  ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి, భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు లేదా వాతావరణ మార్పులకు సంబంధించిన ఇతర అంతరాయాల కారణంగా, పాఠశాలలు మూసి వేసే సందర్భంలో పిల్లలు  ఎదుర్కొనే అవకాశం ఉన్న అభ్యాస నష్టాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. 

*****



(Release ID: 1774420) Visitor Counter : 143


Read this release in: English , Urdu , Hindi