ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సినిమాతో సమానంగా నాటకరంగానికి ప్రాధాన్యత పెరగాలి - ఉపరాష్ట్రపతి


• నాటకాలు సమాజంలోని మార్పునకు ప్రతిబింబాలు

• అభిమానులు, ప్రేక్షకుల నాడి పట్టుకున్న కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది

• సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎన్నో వివక్షతలకు నాటకం ద్వారా తెరదించవచ్చన్న ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• నాటక రంగానికి సంబంధించి సింహావలోకనం చేసుకోవాల్సిన తరుణమిది

• మార్పును స్వాగతిస్తూనే.. పాత విధానాలను తర్వాతి తరాలకు అందించడం అవసరమే

• ‘నాటక సాహిత్యోత్సవం’ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

• “తెలుగు ప్రసిద్ధ నాటకాలు” ఆరు సంకలనాల ఆవిష్కరణ*

Posted On: 19 NOV 2021 6:34PM by PIB Hyderabad

నాటకాలు సమాజంలోని పరిస్థితులను, వాస్తవ స్థితిగతులను ప్రతిబింబిస్తాయని, అలాంటి నాటకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సినిమారంగంతో సమానంగా నాటకరంగానికి ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

శుక్రవారం హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ సమావేశ మందిరంలో జరిగిన  ‘నాటక సాహిత్యోత్సవం’ కార్యక్రమమంలో ఉపరాష్ట్రపతి పాల్గొని, ప్రసంగించారు. తెలుగు సాహితీ ప్రపంచంలో పేరెన్నికగన్న 100 ప్రసిద్ధ నాటకాల సంకలనంగా రూపొందిన 6 సంకలనాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంపై ప్రభావం చూపించడంలో నాటకాల పాత్ర కీలకమన్నారు. భాష ఉన్నతికి చిరునామాగా, సామాజిక హితాన్ని కాంక్షిస్తూ, ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే నాటకాలకు పూర్వవైభవం రావాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

అనేక భావజాలాలకు, అనేక సామాజిక ఉద్యమాలకు స్పందించడం, ఎప్పటికప్పడు సామాజిక వాస్తవికతను విమర్శనాత్మకంగా ప్రతిబింబించడం నాటకాల్లో మనకు కనపడుతుందన్న ఉపరాష్ట్రపతి, సినిమా వచ్చాక నాటకం బలహీన పడిందని చాలా మంది అంటుంటారని కానీ తాను ఆ వాదనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. నాటక రంగం సింహావలోకనం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని,  సినిమాతో సమానంగా నాటకం, దాని ప్రాధాన్యతను నిలబెట్టుకోవాలనేదే తన ఆకాంక్షన్నారు. సమాజాన్ని ప్రతిబింబిస్తూ, ప్రేక్షకుల నాడి పట్టుకున్న కళలకు ఎప్పటికీ  ఆదరణ ఉంటుందన్నారు. ‘మారే కాలంతోపాటే, మరెన్నో మార్పులు, ఇంకెన్నో ఆవిష్కరణలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో మార్పును స్వాగతించడంతో పాటు, మంచి మార్పును తరతరాలకు నిలబెట్టుకోవలసిన అవసరం ఉంది’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.

ప్రభుత్వాలే కాకుండా, ప్రైవేట్ సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు నాటక రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ముందుకు రావాలన్న ఉపరాష్ట్రపతి, ముఖ్యంగా ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు నాటకాలకు ప్రోత్సాహం అందించే ప్రయత్నాలు చేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు సైతం పిల్లలకు విద్యతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా ప్రోత్సాహం అందించాలని, దీని ద్వారా వారిలో సమాజం పట్ల అవగాహనతో పాటు, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని ఆయన పేర్కొన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ప్రక్రియలో మార్పులు రావాల్సిందేనన్న ఉపరాష్ట్రపతి, స్వరాజ్య ఉద్యమ కాలంలో ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని బలంగా నాటేందుకు నాటకాలు ఎంతగానో కృషి చేశాయని గుర్తుచేశారు. మహాత్మాగాంధీని సైతం నాటకం ఎంతో ప్రభావితం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సత్యహరిశ్చంద్ర నాటకం ద్వారా సత్యనిష్ఠ గొప్పతనాన్ని గాంధీజీ అలవర్చుకున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

శ్రవణ సహిత దృశ్యరూపకమే నాటకమని, జానపద కళలు విలసిల్లుతున్న కాలంలో ప్రజలకు మరింత చేరువైన నాటకాలు.. విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించాయని ఆయన అన్నారు. గ్రామాల్లో అక్షరాస్యత లేకపోయినా, భాష ఉన్నతిని కాపాడిన ఘనత నాటకాలకు దక్కుతుందన్నారు. ఒకప్పుడు చదువుతో సంబంధం లేకుండా.. అనేక నాటకాల ద్వారా ఎన్నో పద్యాలను ప్రజలు అలవోకగా చెప్పేవారన్నారు. 

భారతీయ సమజాన్ని పట్టి పీడిస్తున్న అనేక వివక్షలను నాటకం ఎండగట్టిందని, ముఖ్యంగా సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా నాటకం ఓ ఉద్యమమే చేసిందన్నారు. కన్యాశుల్కం, వరకట్నం, లింగ వివక్ష వంటివి సమాజ అభివృద్ధిని ఎలా వెనుక్కునెడుతున్నాయో అనేక నాటకాలు తెలియజేశాయన్నారు. రాజకీయ రంగంలోని అనారోగ్య ధోరణులను సైతం ప్రశ్నించిన నాటకాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం పంతులు, కన్నెగంటి హనుమంతు వంటి నాయకుల జీవితాలను ప్రతిబింబించే నాటకాలకు కూడా కొదవలేదన్నారు.

స్వచ్ఛభారత్ వంటి ఉద్యమాలు ప్రజలకు మరింత చేరువకావడంలో నాటక కళాకారులు, జానపద కళాకారులు పోషించిన పాత్రను ఈ సదర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. కోవిడ్ సమయంలోనూ ప్రజలకు అవగాహన కల్పించడంలో నాటక కళాకారుల పాత్రను అభినందించారు. 

1880 నుంచి 2020 మధ్యకాలంలో తెలుగు సాహిత్యంలో వచ్చిన 100 ప్రసిద్ధ తెలుగు నాటకాలను 6 సంకలనాలుగాతీసుకురావడం, వాటిని ఆవిష్కరించడం పట్ల ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. చొరవతీసుకుని ఈ చక్కటి పుస్తకాలను రూపొందించిన అరవింద ఆర్ట్స్ వారికి, తానా ప్రచురణల సంస్థను ఆయన అభినందించారు. ఈ ప్రయత్నం, తెలుగు నాటక వికాసానికి నూతన బాటలు వేస్తుందన్నారాయన. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, ఆంధ్రనాటక కళా పరిషత్ అధ్యక్షులు శ్రీ బొల్లినేని కృష్ణయ్య, తానా నిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీ శృంగవరపు నిరంజన్, తెలుగు ప్రసిద్ధనాటకాలు సంకలనాల సంపాదకులు శ్రీ వల్లూరి శివప్రసాద్, సహ సంపాదకులు శ్రీ గంగోత్రి సాయి, నాటక రచయిత డా. దీర్ఘాసి విజయ భాస్కర్ సహా పలువురు తెలుగు భాషాభిమానులు, నాటక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

***


(Release ID: 1773289) Visitor Counter : 230