వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా చెరకు రైతులతో డి ఎఫ్ పి డి ముఖాముఖి


పరిశ్రమలో నిలదొక్కుకునేలా నగదు నిల్వల కోసం ఇథనాల్ అధికోత్పత్తికి చక్కెర మిల్లులకు పిలుపు

అధికోత్పత్తి వంగడాలు, తుంపర సేద్యం, భూసారంపై అధికారులతో మెలకువలు పంచుకున్న రైతులు

మెరుగైన విధానాలతో సగటుకు రెట్టింపుగా హెక్టార్ కు 150 టన్నుల చెరకు దిగుబడి

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2021 6:11PM by PIB Hyderabad

ఆహార, ప్రజాపంపిణీ శాఖ  75 వ స్వాతంత్ర్య వార్షికోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. ఈ వేడుకలలో భాగంగా  ఈశాఖలోని చక్కెర విభాగం రైతులు, స్వయం సహాయక బృందాలతో ముఖాముఖీ ఏర్పాటు చేసింది.  చెరకు పంట సాగులో ఉత్తమ విధానాలు అనే అంశం మీద ఈ  కార్యక్రమం జరిగింది.  .వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెరకు పండించే అన్నీ ప్రధాన రాష్ట్రాలనుంచి రైతులతోబాటు స్వయం సహాయక బృందాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

ఈ ముఖాముఖిలో భాగంగా చక్కెర విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ సుబోధ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఉత్పాదకత పెంచుకోవటం ద్వారా చెరకు సాగు ఖర్చు తగ్గుతుందన్నారు. ఆ విధంగా ఆదాయం పెరుగుతుందన్నారు. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే చక్కెర మిల్లులు ఎక్కువ ఇథనాల్ ఉత్పత్తి చేయాల్సిన అవసరముందని, అప్పుడే నగదు ప్రవాహం కూడా సంతృప్తికరంగా ఉంటుందని చెప్పారు. వ్యర్థం నుంచి సంపద అనే అనే టెక్నిక్ ను అనుసరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. చక్కెర రంగం ఆత్మ నిర్భర కావటానికి, పర్యావరణ హితం కావటానికి  భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. రైతుల బకాయిలు తగ్గించటానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

వివిధ రాష్ట్రాల రైతులు, చక్కెర  మిల్లుల ప్రతినిధులు ఉత్తమ ఆచరణ విధానాలను చర్చించారు. అందులో ప్రధానంగా అధికోత్పత్తి వంగడాలు, తుంపర సేద్యం, భూసార మెరుగుదల వంటి అంశాలున్నాయి. వీటిని ఆచరించటం వలన హెక్టారుకు  150 టన్నుల మేరకు చెరకు పండించే అవకాశం కలిగిందన్నారు. ఇది దేశ సగటు ఉత్పాదకతకు రెట్టింపు అని కూడా గుర్తు చేశారు. ప్రముఖ చెరకు బ్రీడర్ డాక్టర్ బక్షీ రామ్ మాట్లాడుతూ అధికోత్పత్తి వంగడాల పంపిణీమీద దృష్టిపెట్టాలన్నారు. సీవో 0238 రకం కోసం కంగారు  పడాల్సిన అవసరం లేదన్నారు. ఉత్తరభారత ఫాక్టరీలలో 2% కోలుకోవటానికి ఇది కారణమైందన్నారు. చెరకు సేద్య నిపుణులు డాక్టర్ ఏ. డి. పాఠక్  చెరకు సాగులో యంత్రాల వాడకం, మెరుగైన నీటిపారుదల విధానాల ద్వారా ఉత్పాదకత పెంచాలని సూచించారు. అధికోత్పత్తికి వీలుగా చెరకు విత్తనాలను ఉత్పత్తి చేయాలని కూడా కోరారు.  చెరకు సేద్యాన్ని, చెరకు క్రషింగ్ ను సమీకృతం చేయాలని అప్పుడే సగటు చెరకు దిగుబడి పెరుగుతుందని కాన్పూర్ లోని ఎన్ ఎస్ ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ నరేంద్ర మోహన్ అన్నారు. 

 

భారత ప్రభుత్వపు డి ఎఫ్ ఐ డి లోని  చక్కెర విభాగం మధ్యాహ్నం మరో వెబినార్ నిర్వహించింది. చక్కెర/ ఇథనాల్ రంగంలో సవాళ్ళు-అవకాశాలు అనే అంశం మీద జరిపిన ఈ  కార్యక్రమం చక్కెర విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీ సుబోధ్ కుమార్ సింగ్ కీలకోపన్యాసంతో మొదలైంది. ఆ తరువాత అంతర్జాతీయ చక్కెర, ఇథనాల్ పరిస్థితి మీద శ్రీ అరవింద్ చూడాశమ ప్రసంగం, ఇథనాల్ పరిశ్రమలో పర్యావరణ సమస్యలమీద డాక్టర్ బీబీ గుంజాల, ఇథనాల్ పరిశ్రమలో ఇటీవలి సాంకేతిక పరిజ్ఞానం మీద శ్రీ మహేశ్ కులకర్ణి, సహకార చక్కెర రంగంలో సవాళ్ళ మీద శ్రీ జయప్రకాశ్, రైతుల ప్రయోజనాలు, చక్కెర పరిశ్రమ ప్రయోజనాల మధ్య సమతుల్యత కాపాడటం మీద శ్రీ ఎన్ రామనాథం ప్రసంగించారు.    

 

ఈ రెండు కార్యక్రమాలలోనూ సహకార, ప్రయివేటు రంగ చక్కెర కర్మాగారాల ప్రతినిధులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. చర్చించిన అంశాల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ కృషిని అభినందించారు. సకాలయంలో చెరకు రైతులకు చెల్లింపులు చేస్తుండటం పట్ల  సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పరిశ్రమ ఎదుగుదలకు దోహదం  చేస్తుందన్నారు.

***


(రిలీజ్ ఐడి: 1773100) సందర్శకుల సూచీ సంఖ్య : : 160
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी