సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

వారణాసి సాంస్కృతిక వారతస్వాన్ని చాటి చెప్పేలా ‘కాశీ ఉత్సవ్’


నవంబరు 16నుంచి 18వరకూ నిర్వహణ

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఉత్సవ కార్యక్రమాలు

Posted On: 15 NOV 2021 9:54AM by PIB Hyderabad

  సుప్రసిద్ధ కాశీ క్షేత్రం ప్రాచీన సంస్కృతిని, వారసత్వ సంపదను ప్రతిబింబిజేసేలా కాశీ ఉత్సవ్ పేరిట 3రోజులపాటు ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అలనాటి మహా జ్ఞానులు, సాహితీ వేత్తలైన గోస్వామి తులసీదాస్, సంత్ కబీర్, సంత్ రైదాస్, భారతేందు హరిశ్చంద్ర, మున్షీ ప్రేమ్ చంద్, శ్రీ జైశంకర్ ప్రసాద్ వంటి వారి సేవలను స్మరించుకుంటూ ఈ ఉత్సవం నిర్వహిస్తారు. వారణాసి నగరానికి చెందిన రుద్రాక్ష ఇంటర్నేషనల్ కోఆపరేషన్, కన్వెన్షన్ సెంటర్ ఆధ్వర్యంలో 2021 నవంబరు 16వ తేదీనుంచి 18 వరకూ ఈ ఉత్సవం జరుగుతుంది.

  కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ తరఫున ఈ ఉత్సవానికి ఇందిరాగాంధీ జాతీయ కళల కేంద్రం (ఐ.జి.ఎన్.సి.ఎ.) ఆతిథ్యం ఇస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా ఈ ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవ నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, వారణాసి పరిపాలనా యంత్రాంగం తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నాయి.

   వారణాసి సాంస్కృతిక వారసత్వాన్ని, అద్భుతమైన చారిత్రిక నేపథ్యాన్ని, దేదీప్యమానమైన తేజస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నగరాన్ని ఉత్సవం కోసం ఎంపిక చేశారు. వారణాసి నగరం గుండా ప్రవహించే పవిత్ర గంగానది,..ఈ నగరానికి చెందిన పలువురు సుప్రసిద్ధ కళాకారులకు, పండితులకు, రచయితలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అన్ని కాలాల్లో మహామహులకు, మహనీయులకు జన్మనిచ్చిన దేదీప్యమానమైన కాశీ చారిత్రిక నేపథ్యాన్ని గురించి ప్రజలు తెలుసుకునేందుకు ఈ ఉత్సవం దోహదపడుతుంది.

   ఈ ఉత్సవంలో ఒక్కో రోజు జరిగే కార్యక్రమాన్ని,.. ఒక్కో ఇతివృత్తానికి అంకితం చేశారు. అవి: ‘ కాశీ కే హస్తాక్షర్’; ‘కబీర్, రైదాస్.కీ బనీ ఔర్ నిర్గుణ్ కాశీ’  ‘కవితా ఔర్ కహానీ-కాశీ కీ జుబానీ’ అన్న మూడు ఇతివృత్తాలతో ఈ మూడు రోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తొలి రోజు కార్యక్రమంలో సుప్రసిద్ధ రచయితలైన భారతేందు హరిశ్చంద్ర, శ్రీ జైశంకర్ ప్రసాద్ వంటి వారిని గురించి వివరిస్తారు. రెండవ రోజున సుప్రసిద్ధ కవిగాయకులు సంత్ రైదాస్, సంత్ కబీర్ దాస్.ల జీవిత విశేషాలకు ప్రాధాన్యమిస్తారు. చివరి రోజు ఉత్సవంలో గోస్వామి తులసీదాస్, మున్షీ ప్రేమ్చంద్.లకు ప్రాధాన్యమిస్తారు. 

  పలు రకాల చర్చాగోష్టులు, ప్రదర్శనలు, చలనచిత్ర ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, నాటకాలు, నృత్య ప్రదర్శనల ద్వారా కాశీ నగరానికి చెందిన మహనీయుల వ్యక్తిత్వాలను గురించి వివరిస్తారు. ప్రముఖ కళాకారులు కూడా ఈ ఉత్సవంలో పాలుపంచుకుంటారు. నవంబరు 16వ తేదీ కార్యక్రమంలో ‘మై కాశీ హూఁ’ పేరిట ఒక కార్యక్రమాన్ని డాక్టర్ కుమార్ విశ్వాస్ ప్రదర్శిస్తారు. ఇక ‘తులసీ కీ కాశీ’ పేరిట రూపొందించిన సంగీత కార్యక్రమాన్ని చివరి రోజున పార్లమెంటు సభ్యుడు మనోజ్ తివారీ సమర్పిస్తారు. కుమారి కళాపాణి కోంకాలీ, శ్రీ భువనేశ్ కోంకాలీ, పద్మశ్రీ భారతి బంధు, కుమారి మైథిలీ ఠాకూర్ తదితర కళాకారులు అనేక భక్తి ప్రధానమైన కార్యక్రమాలను ఈ ఉత్సవంలో నిర్వహిస్తారు.

  రాణీ లక్ష్మీబాయి జీవిత విశేషాలపై, ‘ఖూబ్ లడీ మర్దానీ’ పేరిట రూపొందించిన నాటికను నేషనల్ స్కూల్ ఆప్ డ్రామా (ఎన్.ఎస్.డి.) కళాకారులు నవంబరు 18వ తేదీన ప్రదర్శిస్తారు. ఎన్.ఎస్.డి.కే చెందిన కమారి భారతీ శర్మ దర్శకత్వంలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. ఇక జైశంకర్ ప్రసాద్ పద్యకావ్యం ఆధారంగా ‘కామయాని: నృత్య నాటకం’ పేరిట ఓ కార్యక్రమాన్ని నవంబరు 16న ప్రదర్శిస్తారు. వారణాసి నగరానికి చెందిన శ్రీ వ్యోమేష్ శుక్లా దర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తారు.  

   వారణాసి నగరంపై ఐ.జి.ఎన్.సి.ఎ. రూపొందించిన చలన చిత్రాల ప్రదర్శనను కూడా ఈ ఉత్సవంలో భాగంగా చేర్చారు. వీరేంద్ర మిశ్రా రూపొందించిన ‘బెనారస్ ఏక్ సాంస్కృతిక్ ప్రయోగశాల’; పంకజ్ పరాశర్ దర్శకత్వంలో రూపొందన ‘మేరీ నజర్ మేఁ కాశీ’;  ‘మన్.భవన్ కాశీ’; దీపక్ చతుర్వేది దర్శకత్వం వహించిన ‘కాశీ పవిత్ర భోగోళ్’; సత్యప్రకాశ్ ఉపాధ్యాయ్ రూపొందించిన ‘మేడ్ ఇన్ బెనారస్’; కుమారి రాధికా చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘కాశీ గంగా విశ్వేశ్వరై’;  ‘ముక్తి ధాం’; అర్జున్ పాండే రూపొందించిన ‘కాశీ కీ ఐతిహాసికత’; ‘కాశీ కీ హస్తియాఁ’ వంటి చలన చిత్రాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు.

https://ci4.googleusercontent.com/proxy/MtKeFR7fN7GBjda7rcAwHsF4VSBWJ7pzSRBchLvghWMDZuIq-rnRGGMbOWuRrRSyjdTkJJRC6d8a33StJBceLbuB01c_1fSIaBEZOzTSnYjRIBPUNw4oKhXeeQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001949X.jpg

  కాశీకి చెందిన ఆరుగురు సాహిత్యకారుల పుస్తకాలను, ఇతర సాహితీ ప్రక్రియల ప్రదర్శనను కూడా ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తారు.; ఈ ప్రదర్శనకు సంబంధించిన ఇతివృత్తాల ప్రణాళికలను, ఐ.జి.ఎన్.సి.ఎ., న్యూఢిల్లీకి చెందిన సాహిత్య అకాడమీ రూపొందించాయి.

  కాశీ నేపథ్యంతో కూడిన ఆరుగురు మహనీయులపై చేపట్టనున్న చర్చా కార్యక్రమంలో ప్రముఖ వక్తలు పాల్గొంటారు.: డాక్టర్ సచ్చిదానంద జోషి, ప్రొఫెసర్ మారుతీ నందన్ తివారీ, వీరేంద్ర మిశ్రా, ప్రొఫెసర్ నిరంజన్ కుమార్, అనంత్ విజయ్, ప్రాఫెసర్ పూనం కుమారి సింగ్, ప్రొఫెసర్ విశాంభర్ నాథ్ మిశ్రా, డాక్టర్ సదానంద షాహీ, డాక్టర్ ఉదయ్ ప్రతాప్ సింగ్ ఈ చర్చా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.

   ఈ ఉత్సవాల్లో గరిష్టస్థాయిలో ప్రజలు పాల్గొనేలా చూసేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నారు. స్థానిక కళాకారులు, సాంస్కృతిక పండితులను కూడా ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నారు. వారు వ్యక్తిగతంగాకానీ, వీడియో చిత్రీకరణల ద్వారా గానీ తమ అభిప్రాయాలను అందించాలని కోరనున్నారు. మొత్తం 150 మంది వరకూ కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొనబోతున్నారు.

   ఈ ఉత్సవాన్ని భారతీయ ప్రజలందరికీ అంకితం చేయాలని ఐ.జి.ఎన్.సి.ఎ. సంకల్పించింది. భరత జాతి అభివృద్ధిలో ప్రతి భారతీయుడికీ సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా కీలకపాత్ర ఉంది కాబట్టి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎంతో వైభవోపేతమైన దేశం గత చరిత్రను వివరించడంతోపాటుగా, స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర భారత్ కలను సాకారం చేసుకునే శక్తి భారతదేశానికి, భారతీయులకు ఉందని కాశీ ఉత్సవం ద్వారా చాటిచెప్పాలని ఐ.జి.ఎన్.సి.ఎ. సంకల్పించింది.  

    "మై హూఁ కాశీ" పేరిట ప్రముఖ గాయకుడు డాక్టర్ కుమార్ విశ్వాస్ ప్రదర్శించే కార్యక్రమానికి, “తులసీ కీ కాశీ” పేరిట పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ జానపద గాయకుడు మనోజ్ తివారీ నిర్వహించే కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ఎంట్రీ పాసులు పొందాలంటే వారణాసికి చెందిన రుద్రాక్ష ఇంటర్నేషనల్ కోఆపరేషన్, కన్వెన్షన్ సెంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవలసి ఉంటుంది.

 

***



(Release ID: 1772149) Visitor Counter : 227