జల శక్తి మంత్రిత్వ శాఖ
వేల్స్, యు.కె. లో నమామి గంగే: కార్డిఫ్ లో గంగా కనెక్ట్ ప్రారంభించబడింది
Posted On:
13 NOV 2021 7:11PM by PIB Hyderabad
స్కాట్లాండ్ లోని గ్లాస్గో లో, సో.ఓ.పి-26 వద్ద మొదటిసారి విజయవంతంగా ప్రారంభమైన గంగా కనెక్ట్ ఎగ్జిబిషన్, ఆ తర్వాత, 2021 నవంబర్, 12వ తేదీ, శుక్రవారం రోజున వేల్స్ లోని కార్డిఫ్ లో ప్రారంభమయ్యింది. కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో, ఈ ప్రదర్శనను, వేల్స్ ఫస్ట్ మినిష్టర్, గౌరవనీయులు మార్క్ డ్రేక్ ఫోర్డ్ ఎం.ఎస్. మరియు యు.కె. లో భారత హైకమిషనర్ గౌరవనీయులు గాయత్రి ఇస్సార్ కుమార్ ప్రారంభించారు.
క్లీన్ గంగా జాతీయ మిషన్, , సి-గంగా, భారత రాయబార కార్యాలయం సంయుక్తంగా, ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. "గంగా కనెక్ట్" అనేది ఒక ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ తో పాటు ఒక ఔట్‌రీచ్ వేదిక. ఇది నదీ వ్యవస్థ యొక్క బహుళ కోణాలను ప్రదర్శిస్తూ, ఆసక్తిగల భాగస్వాముల శ్రేణితో అనుసంధానమై ఉంటుంది.
ఈ ప్రదర్శనలోని ప్రధానాంశాలు :
* గంగా నది పర్యావరణ వ్యవస్థ యొక్క పరిమాణం, గొప్పతనం, సంక్లిష్టతల గురించి స్పష్టమైన, లోతైన అవగాహన కల్పించడం;
* అభివృద్ధి చేసి, అమలు చేస్తున్న పరిష్కారాల శ్రేణిపై దృష్టి పెట్టడం;
* ఈ కార్యక్రమం గురించి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితితో పాటు, నిర్ణీత కాల పరిమితిని తెలియజేయడం;
* భారతీయులు ఈ నదితో పెనవేసుకున్న లోతైన ఆధ్యాత్మిక, తాత్విక సంబంధాలను వివరించడం;
* నదీ వ్యవస్థ యొక్క పునరుజ్జీవనం, పునరుద్ధరణ, పరిరక్షణలో పాలుపంచుకోవాలనుకునే ఆసక్తిగల బృందాలు, ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరపి, ఒప్పందాలు కుదుర్చుకోవడం.
ఈ సందర్భంగా ఫస్ట్ మినిస్టర్ కీలకోపన్యాసం చేస్తూ, వాతావరణ సంక్షోభంలో సరిహద్దులు అసంబద్ధం అని, దేశాలు వ్యక్తిగతంగా ఒంటరిగా వ్యవహరించడం ద్వారా ప్రభావాలను తగ్గించలేవనీ , అంతర్జాతీయ సహకారంతో ముందుకు సాగడమే ఏకైక మార్గమని, పేర్కొన్నారు. భారతీయులు గంగానదిని ఎలా గౌరవిస్తారో భారత హైకమిషనర్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. నమామి గంగే మిషన్ కు భారత ప్రభుత్వం ఇచ్చే అధిక ప్రాధాన్యత గురించి ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. గంగా నదిని పునరుద్ధరించి, పునరుజ్జీవింపజేయడానికి నమామి గంగే మిషన్ ఏవిధంగా పబ్లిక్ పాలసీ, సాంకేతిక జోక్యం, కమ్యూనిటీ భాగస్వామ్యాలను అనుసంధానం చేస్తున్నదీ ఆమె వివరించారు.
వేల్స్ లోని బలమైన ప్రవాస భారతీయ సమాజం తప్పనిసరిగా పాల్గొనే, వార్షిక దీపావళి వేడుకల సందర్భాన్ని కూడా ఈ ఎగ్జిబిషన్ గుర్తించింది. గంగా పునరుజ్జీవన కార్యక్రమంలోని వివిధ అంశాల గురించి, ఫస్ట్ మినిస్టర్ మరియు భారత హైకమిషనర్లకు, ఎన్.ఎం.సి.జి., ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ అశోక్ కుమార్ మరియు సి-గంగా, సభ్య నిపుణుడు, శ్రీ సన్మిత్ అహుజా వివరించారు.
ఈ సందర్భంగా, రెండు వ్యూహాత్మక రౌండ్ టేబుల్ సమావేశాలు - శాస్త్రీయ రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు, వ్యాపార/పారిశ్రామిక రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. శాస్త్రీయ రౌండ్ టేబుల్ సమావేశాన్ని, జి.డబ్ల్యూ-4 వాటర్ అలయన్స్ లో భాగమైన నీటి పరిశోధన సంస్థ ఏర్పాటు చేసింది. ఇది, కార్డిఫ్, బాత్, బ్రిస్టల్, ఎక్సెటర్ విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో యు.కె. లో చేపట్టిన అతిపెద్ద నీటి ఆధారిత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థ.
భారత ప్రతినిధి బృందంలో - ఎన్.ఎం.సి.జి., ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్), శ్రీ అశోక్ కుమార్ సింగ్; సి-గంగా, సభ్య-నిపుణుడు, శ్రీ సన్మిత్ అహుజా; మద్రాస్ లోని ఐ.ఐ.టి. కి చెందిన ప్రొఫెసర్ సచిన్ ఎస్. గుంతే; కోల్‌కతా లోని ఐ.ఐ.ఎస్.ఈ.ఆర్. కు చెందిన ప్రొఫెసర్ ప్రశాంత సన్యాల్; కాన్పూర్ లోని ఐ.ఐ.టి. కి చెందిన డాక్టర్ విశాల్ కపూర్ మొదలైన వారు ఉన్నారు
కాగా, వెల్స్ ప్రతినిధి బృందంలో - ప్రొఫెసర్ ఒమర్ రానా; ప్రొఫెసర్ మైక్ బ్రూఫోర్డ్; ప్రొఫెసర్ ఇసాబెల్లె డ్యూరెన్స్; డాక్టర్ శిబు రామన్; ప్రొఫెసర్ స్టీవ్ ఒర్మెరోడ్; ప్రొఫెసర్ షుంకి పాన్; డాక్టర్ రెజా అహ్మడీయన్; డాక్టర్ టామ్ బీచ్; డాక్టర్ ఎమ్మా మెకిన్లీ; డాక్టర్ డెవిన్ సాప్స్‌ఫోర్డ్ మొదలైన వారు ఉన్నారు.
ఈ సందర్భంగా - భారతీయ నదీ పరీవాహక ప్రాంతాల నిర్వహణ; జీవవైవిధ్యం; రుతుపవన వర్షపాతంపై వాతావరణ మార్పు ప్రభావం; నదీ పరీవాహక నిర్వహణలో తదనంతర సమస్యలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై వివరణాత్మకంగా చర్చించడం జరిగింది. గంగా నది పునరుజ్జీవనం కోసం ప్రభుత్వ దృక్పథం గురించి, ఎన్.ఎం.సి.జి. విధానం గురించి, శ్రీ అశోక్ కుమార్ సింగ్ వివరంగా తెలియజేశారు. శ్రీ సన్మిత్ అహుజా, ఈ సందర్భంగా మాట్లాడుతూ, నీటి మార్కెట్, వాటి ధర, జీవవైవిధ్య బంధాలు, వాటి ఆర్థిక సంబంధాల కోసం ప్రాజెక్టు సంభావ్యతల గురించి వివరించారు.
వీటితో పాటు - భారతీయ నగరాలను నివాసయోగ్యమైన నగరాలుగా మార్చడం; గంగా నది పరీవాహక ప్రాంతంలో నీటి బడ్జెట్లు, కాలుష్యం; వేల్స్ మరియు హిమాలయ పర్వత ప్రాంతాల్లో నది పర్యావరణ వ్యవస్థ అధ్యయనాలు; వాతావరణ మార్పు మరియు భారత రుతుపవనాలు; నదీ వ్యవస్థల జీవవైవిధ్య వ్యవస్థ, దానికి సంభవించే ముప్పులు, పరిరక్షణ చర్యలు; పర్యావరణ, జీవావరణ వ్యవస్థలకు చెందిన జల వాతావరణ శాస్త్రం; అనువర్తిత ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి పెద్ద వ్యవస్థలు, కార్యక్రమాలను ఉపయోగించడం వంటి సంభావ్య సహకారానికి చెందిన ముఖ్య రంగాలపై కూడా చర్చలు జరిగాయి.
వ్యాపార/పారిశ్రామిక రౌండ్ టేబుల్ సమావేశంలో వినూత్న సాంకేతికతలు, పరిష్కారాలతో అనేక కంపెనీలు పాల్గొని, మార్కెట్ లోకి కొత్త ఆవిష్కరణలను తీసుకురావడానికి, ఎన్.ఎం.సి.జి. ఆధ్వర్యంలో సి-గంగా నిర్వహిస్తున్న, పర్యావరణ సాంకేతిక ధృవీకరణ (ఈ.టి.వి) ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. ఈ చర్చకు శ్రీ అశోక్ కుమార్ సింగ్ నేతృత్వం వహించగా, శ్రీ సన్మిత్ అహుజా నిర్వహించారు. ఆవిష్కరణ, సాంకేతికతలను ఎన్.ఎం.సి.జి. ప్రోత్సహిస్తున్న తీరు గురించి, శ్రీ అశోక్ కుమార్ సింగ్ వివరించారు. వ్యర్థ పదార్థాలను జీవ పదార్ధాల ద్వారా శుద్ధిచేయడం; హైడ్రోజన్ నుండి వెలువడే వ్యర్థాలు; మురుగునీటి శుద్ధిలో వెలువడే బురద ఉత్పత్తిని తొలగించడానికి అధునాతన పద్ధతులు; వ్యవసాయ రంగంలో అత్యంత సమర్థవంతమైన వడపోత మాధ్యమంగా, దిగుబడిని పెంచే నూతన పదార్థాలు వంటి అనేక వినూత్న పరిష్కారాలను కొన్ని కంపెనీలు ఈ సందర్భంగా అందించాయి.
"గంగా కనెక్ట్-ఎగ్జిబిషన్" ప్రారంభోత్సవ ప్రత్యేక సందర్భానికి పురస్కరించుకుని, వెల్ష్ జెండా తో పాటు భారత జెండాను కార్డిఫ్ కాజిల్ పై ఎగురవేసి, సాయంత్రం ఆ ప్రాంతాన్ని, త్రివర్ణ శోభితంగా అలంకరించారు.
*****
(Release ID: 1771618)
Visitor Counter : 157