సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అఖిలభారత నృత్య పోటీలు ‘వందేభారతం-నృత్య ఉత్సవ్’ను ప్రారంభించిన శ్రీమతి మీనాక్షి లేఖి
రాజ్‌పథ్‌లో 2022 గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా
ఎంపిక చేసిన అగ్రశ్రేణి నృత్య కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమం
Posted On:
12 NOV 2021 6:37PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
- ‘వందే భారతం’ వెబ్‌సైట్... మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించిన శ్రీమతి లేఖి
- ఈ పోటీల్లో తుది దశకు చేరిన 480 మంది నృత్య కళాకారులతో గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శన
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ‘వందే భారతం-నృత్య ఉత్సవ్’ పేరిట అఖిల భారత నృత్య పోటీలను నిర్వహించనుంది. రాజ్‌పథ్‌లో 2022 గణతంత్ర దినోత్సవాల కవాతు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమంలో నాట్య ప్రదర్శన కోసం నృత్యకారుల ఎంపికే ఈ పోటీల లక్ష్యం. ఈ మేరకు 2022 జనవరి 26న రాజ్‌పథ్‌లో ఇండియా గేట్ వద్ద తుది ప్రదర్శన జరుగుతుంది. ఇవాళ కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యాప్‌ను కూడా శ్రీమతి మీనాక్షి లేఖి ప్రారంభించారు.
ఈ ‘వందే భారతం’ బృందనాట్య పోటీలు 2021 నవంబర్ 17 నుంచి జిల్లా స్థాయిలో ప్రారంభం అవుతాయని శ్రీమతి మీనాక్షి లేఖి విలేకరులకు వివరించారు. ఈ విధంగా జిల్లా, రాష్ట్ర, జోన్, అంతర-జోన్/జాతీయ స్థాయులలో పోటీలు నిర్వహించబడతాయి. అనంతరం తుది దశ జాతీయస్థాయి పోటీని 2021 డిసెంబర్ 19న న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో నిర్వహించబడుతుంది. ఈ పోటీల్లో పాల్గొనేవారు- ‘‘సంప్రదాయ, జానపద, గిరిజన, సమ్మిశ్రిత/సమకాలీన’’ అనే నాలుగు విభాగాలలో ప్రదర్శన ఇవ్వవచ్చు. తుదిదశ పూర్తయిన తర్వాత జాతీయస్థాయి నుంచి 480 మంది నృత్యకారులు విజేతలుగా ఎంపికవుతారు. వీరంతా గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు.
ప్రధానమంత్రి ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహించ తలపెట్టారని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలను మమేకం చేస్తూ ఈ వేడుకలను, కార్యక్రమాలను మూలమూలకూ తీసుకెళ్లడం ముఖ్యమన్నారు. అలాగే మన వారసత్వం, సంస్కృతితో యువతరాన్ని అనుసంధానించడం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో కీలకాంశమని ఆమె వివరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అసమాన రీతిలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అజ్ఞాత వీరుల త్యాగాన్ని ప్రముఖంగా ఎత్తిచూపాల్సిన అవసరం ఉందని శ్రీమతి మీనాక్షి లేఖి అన్నారు. తదనుగుణంగా ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ ప్రేరణతో దేశం మొత్తాన్నీ ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందని స్పష్టం చేశారు.
ఈ మహోత్సవాల కోసం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఒక ప్రత్యేక వెబ్‌సైట్ సహా మొబైల్ అనువర్తనాన్ని కూడా రూపొందించిందని శ్రీమతి లేఖి తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన అన్ని అంశాలతోపాటు పోటీల గురించి వీటిద్వారా ప్రజలకు సమగ్ర సమాచారం అందించబడుతుందని ఆమె చెప్పారు. ‘‘పోటీ సంబంధిత మార్గదర్శకాలు, ఇతర ప్రయోజనకర సమాచారాన్ని వెబ్‌సైట్/మొబైల్ అనువర్తనం అందజేస్తాయి. వీటిద్వారా జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించబడుతుంది’’ అని ఆమె వెల్లడించారు.
***
(Release ID: 1771339)
Visitor Counter : 170