వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

లాజిస్టిక్ వ్యయాన్ని తగ్గించుకునే తరుణమిదే: పీయూష్ గోయల్


ఐదేళ్లలో 5శాతం తగ్గుతుందన్న కేంద్ర వాణిజ్యమంత్రి..
వివిధ రాష్ట్రాల్లో సదుపాయాల మెరుగుదలపై
లీడ్స్ నివేదిక ఇదే చెబుతోందని వెల్లడి..

లీడ్స్ 2021 నివేదికలో గుజరాత్, హర్యానా,
పంజాబ్ రాష్ట్రాలకు అగ్రశ్రేణి ర్యాంకులు...

లీడ్స్ నివేదికతో పి.ఎం. గతిశక్తి
మాస్టర్ ప్రణాళికకు చక్కని ఉద్దీపన...

వాణిజ్యానికి, పౌరులకు సౌకర్యం, సాధికారత
కల్పించడంలో లాజిస్టిక్స్.దే కీలకపాత్ర

Posted On: 08 NOV 2021 5:16PM by PIB Hyderabad

  వివిధ సరుకులు, సంజామాలకు సంబంధించిన రవాణా, పంపిణీ, నిల్వ వ్యయం (లాజిస్టిక్ వ్యయాన్ని) రాబోయే ఐదేళ్లలో 5శాతం తగ్గే అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదార్ల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, జవుళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు చెప్పారు. లాజిస్టిక్స్ కు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలపై జరిగిన 2021వ సంవత్సరపు సర్వే నివేదికను బట్టి ఈ విషయం తెలుస్తోందని ఆయన అన్నారు. లాజిస్టిక్స్ పై ఈ రోజు ఢిల్లీలో లీడ్స్ నివేదిక విడుదలైన సందర్భంగా కేంద్రమంత్రి గోయల్ మాట్లాడుతూ, అధునాతన మౌలిక సదుపాయాల వ్యవస్థను నిర్మించుకునేందుకు భారతదేశం ఎంతో చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని, గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మౌలిక సదుపాయాల వ్యవస్థ నిర్మాణ ప్రక్రియ జరగబోతోందని అన్నారు.

   ప్రధానమంత్రి ఇటీవల ప్రారంభించిన పి.ఎం. గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఎంతో విశిష్టమైనదని,  దేశంలో రేపటితరం బహుళ నమూనా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రక్రియను ఇది విప్లవాత్మకంగా తీర్చిదిద్దగలదని కేంద్రమంత్రి అన్నారు.  మౌలిక సౌకర్యాల, వసతుల అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం దృష్టిని కేంద్రీకరించడం అభినందనీయమని అన్నారు. పదమూడేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయన గుజరాత్ రాష్ట్రంలో చూపిన చొరవ కారణంగానే, ఆ రాష్ట్రం క్రమం తప్పకుండా లీడ్స్ నివేదికలో అగ్రస్థానం కొనసాగించేందుకు పునాదులు పడ్డాయన్నారు.

  దేశంలో రహదారుల నిర్మాణ వేగం మూడు రెట్లు పెరిగిందని గోయల్ అన్నారు. 2013-14వ సంవత్సరంలో రోజుకు 12కిలోమీటర్ల నిడివితో రహదారిని నిర్మించగలిగామనీ 2020-21లో రోజువారీగా నిర్మించే రోడ్డు నిడివి 37కిలోమీటర్లకు పెరిగిందని, రైల్వేలకు సంబంధించిన మూలధన వ్యయమైతే నాలుగింతలు పెరిగిందని అన్నారు. 2013-14లో రూ. 54,000కోట్లు ఉన్న ఈ వ్యయం 2021-22లో రూ. 2.15లక్షల కోట్లకు పెరిగిందని ఆయన తెలిపారు. 2014వ సంవత్సరానికి ముందు ఐదేళ్లలో 60 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఆప్టికల్ ఫైబర్ అనుసంధానం కల్పించగలిగామని, గత ఏడేళ్లలో మాత్రం లక్షన్నరకుపైగా గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ అనుసంధానం ఏర్పడిందని అన్నారు.

  సరుకుల, వస్తువుల రవాణా, పంపిణీ, నిల్వల ప్రక్రియకు (లాజిస్టిక్స్.కు) ఎంతో ప్రాధాన్యం ఉందని, వాణిజ్యానికి, ప్రజలకు కూడా సౌలభ్యం, సాధికారత కల్పించడంలో ఈ ప్రక్రియ  ప్రముఖపాత్ర పోషిస్తుందని అన్నారు. కోవిడ్-19 వైరస్ మహమ్మారి కట్టడికోసం జరిగిన పోరులో లాజిస్టిక్ ప్రక్రియ తో గొప్పగా సేవలందించిందని, కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ద్రవరూప మెడికల్ ఆక్సిజన్.తో పాటుగా, నిత్యావసరాలన్నింటినీ దేశవ్యాప్తంగా సరఫరా చేయగలిగిందని అన్నారు.

  లాజిస్టిక్ ప్రక్రియ అనేది బహుళ దృషితో కూడినదని, భారతదేశంలో తయారీ స్థానంనుంచి ప్రపంచ దేశాల్లో చివరి గమ్యం వరకూ సరఫరా వ్యవస్థలో ఇది ప్రముఖ పాత్ర పోషించిందని అన్నారు. నిర్దేశించుకున్న బృహత్తరమైన లక్ష్యాలను చేరుకోవాలంటే భూ ఉపరితలం, గగనతలం, జల ఉపరితలంలో వేగవంతమైన మార్గాలు అవసరమని అన్నారు.

  పటిష్టమైన లాజిస్టిక్స్. కోసం మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సేవలు, సానుకూలమైన నియంత్రణ వ్యవస్థ అనేవి,.. మూడు మూల స్తంబాలుగా ఉపయోగపడతాయని అన్నారు. పోటీతత్వంతో కూడిన సహకార ఫెడరలిజం వ్యవస్థ సహాయంతో లీడ్స్ ప్రతిభావంతమైన విధానాన్ని ఏర్పాటు చేయగలిగిందని, ఆరోగ్యకరమైన పోటీతత్వంతో కూడిన స్ఫూర్తి ప్రతి ఒక్కరూ అలవర్చుకునేలా చేసిందని అన్నారు.

  "ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే లాజిస్టిక్స్ ప్రక్రియలో మెరుగుదలను సాధించడం కంటే, అన్ని రాష్ట్రాల్లో సాధించడం అవసరమని, దేశవ్యాప్తంగా లాజిస్టిక్ వ్యవస్థ మొత్తాన్ని ఇది బలోపేతం చేస్తుందని కేంద్రమంత్రి అన్నారు. లాజిస్టిక్స్.లో వరుసగా 3 అగ్రశ్రేణి స్థానాలు సాధించిన గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను ఆయన అభినందించారు.

  లీడ్స్-2019 నివేదికకు అనుణంగా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని గోయల్ అన్నారు. ఈ నివేదిక ప్రకారం,.. రోడ్ల విస్తరణ, లైసెన్స్ నవీకరణలో మానవ ప్రమేయం లేని పద్ధతులు, గిడ్డంగుల వ్యవస్థ విస్తరణ వంటి చర్యలను గుజరాత్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. లాజిస్టిక్స్ రంగంలో 2019నుంచి 7దాకా లీప్ ఫ్రాగ్ ర్యాంకులు సాధించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

 వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిలో లాజిస్టిక్స్ వ్యవస్థ పనితీరు మధింపుకోసం తొలి ఏడాది 2018వ సంవత్సరంనుంచి లీడ్స్ నివేదిక ప్రగతిశీలకమైన పద్ధతిని అనుసరిస్తూ వస్తోందని కేంద్రమంత్రి అన్నారు.

  దేశంలోని లాజిస్టిక్ వ్యవస్థను మెరుగుపరచడంలో రాష్ట్రాలకు అనివార్యమైన పాత్ర ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు గోయల్ పలు రకాల సూచనలు చేశారు. సొంతంగా లాజిస్టిక్ విధానాన్ని, మాస్టర్ ప్రణాళికను రూపొందించుకోవడం, ఫిర్యాదులు, వివాదాల పరిష్కారానికి సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, లాజిస్టిక్స్.లో సొంత మౌలిక సదుపాయాలతో నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడం వంటి చర్యలను రాష్ట్రాలు చేపట్టాలని ఆయన సూచించారు.  రాష్ట్రాలు తమ లాజిస్టిక్ వ్యవస్థ పనితీరును మెరుగుపరుచుకునేందుకు వీలుగా తమ బలాలను, అవకాశాలను గుర్తించేందుకు లీడ్స్ నివేదిక ఎంతో ఉపయోగపడుతుందని, క్రియాశీలక మార్గదర్శిగా నివేదిక పనిచేస్తుందని మంత్రి గోయల్ అన్నారు. 

 “వివిధ రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ సానుకూల వ్యవస్థ (లీడ్స్)” పేరిట ఒక అధ్యయనాన్ని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2018లో ప్రారంభించింది. లాజిస్టిక్స్ వ్యవస్థలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సామర్థ్యాలను ర్యాంకుల ద్వారా బేరీజు వేయడమనే ప్రధాన లక్ష్యంతో ఈ అధ్యయనం చేపట్టారు.

  లీడ్స్ తొలి నివేదికలో, మాత్రం ఎగుమతి-దిగుమతి వాణిజ్యంపై దృష్టిని కేంద్రీకరించారు. ఇందుకు సంబంధించి ప్రతి రాష్ట్రంలో, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతంలో లాజిస్టిక్ వ్యవస్థ పనితీరును అంచనా వేశారు.  2019వ సంవత్సరంలో చేపట్టిన లీడ్స్ రెండవ అధ్యయనాన్ని అంతర్జాతీయ, దేశీయ వాణిజ్యానికి వర్తింపజేశారు.

  2021వ సంవత్సరంలో లీడ్స్ అధ్యయనం మరో అడుగు ముందుకేసింది. స్వదేశీ లాజిస్టిక్ వ్యవస్థను, ఎగుమతి, దిగుమతి లాజిస్టిక్స్ వ్యవస్థను ఈ అధ్యనయం విశ్లేషించింది. ప్రత్యేకించి,..మొత్తం మధింపు వ్యవస్థను రెండు రకాలుగా మెరుగుపరిచి ప్రక్రియను నిర్వహించారు. ప్రత్యామ్నాయంగా మొత్తం 21 అంశాలను గణాంక సహితంగా విశ్లేషించి, దాని ఆధారంగా రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయించారు.

  లాజిస్టిక్ ప్రక్రియకు సంబంధించిన నాలుగు భాగస్వామ్య వర్గాలు అంటే, వ్యాపారాలు, రవాణాదారులు లేదా రవాణా సేవలందించే వారు, టర్మినల్ ఆపరేటర్లు, లాజిస్టిక్ సేవలందించేవారిపై పర్సెప్షన్ సర్వేను అమలు చేశారు. ద్విభాగాల ప్రతిస్పందనలతో ఈ సర్వేని నిర్వహించారు. విధానం, సంస్థాగత వ్యవస్థ, ప్రస్తుతం అమలులో ఉన్న యంత్రాంగం, గిడ్డంగుల వ్యవస్థ, నగర లాజిస్టిక్స్ వంటి అంశాలపై ఈ సర్వే చేపట్టారు. రాష్ట్రాలు తమ పరిధులలో లాజిస్టిక్స్ సానుకూల వ్యవస్థ మెరుగుదలకు చేపట్టిన చర్యలను అర్థం చేసుకునేందుకు ఈ అంశాలపై సర్వేని చేపట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంబంధిత ఏజెన్సీల సహాయంతో ద్వితీయ శ్రేణి సమాచారాన్ని సేకరించారు.

  2021వ సంవత్సరపు లీడ్స్ సర్వేని 2021 మే నెలనుంచి ఆగస్టు వరకూ చేపట్టారు. కోవిడ్ కారణంగా సవాళ్లతో కూడిన తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య సర్వే జరిగింది. ఈ మొత్తం కసరత్తులో దేశవ్యాప్తంగా 1,405మందిని సంప్రదించి, 3,771 ప్రతిస్పందనలను నమోదు చేశారు. అన్ని రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న కారణంగా వివిధ రాష్ట్రాలను ‘ఈశాన్య రాష్ట్రాలుగా, హిమాలయాల్లోని కేంద్ర పాలిత ప్రాంతాలు’గాను, ‘ఇతర రకాల కేంద్ర పాలిత ప్రాంతాల’ వర్గీకరించారు. లీడ్స్ 2021వ సంవత్సరపు సూచికలో వరుసగా గుజరాత్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు,. అగ్రశ్రేణి పనితీరు ప్రదర్శించిన రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి.

  నిర్మాణాత్మక విధానాలు, అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు, ప్రతిస్పందనా పూర్వక ప్రభుత్వ సారథ్యంలో సేవలు తదితర అంశాల కారణంగా గుజరాత్ అగ్రస్థానాన్ని కొనసాగించేందుకు దోహదపడ్డాయి. హర్యానా రెండవ ర్యాంకు సాధించగా, పంజాబ్ తదుపరి స్థానంలో వచ్చింది.

   ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతం పరిధిలో జమ్ము కాశ్మీర్ అగ్రశ్రేణి ర్యాంకు సాధించింది. సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలు తర్వాతి స్థానాలు ఆక్రమించాయి. ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల కేటగిరీలో ఢిల్లీ అగ్రస్థానంలో వచ్చింది. 2019 లీడ్స్ ర్యాంకులతో పోల్చినపుడు ఉత్తరప్రదేశ్, ఉతరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు అగ్రశ్రేణిలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేశాయి.

  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరుపై విశ్లేషణతో కూడిన ప్రత్యేక విభాగంతో ఈ నివేదికను రూపొందించారు. లీడ్స్ లో వాటి పనితీరుపై సవివరమైన విశ్లేషణను ఈ నివేదిక అందించింది. సమస్యలు, భాగస్వామ్య వర్గాలు ఎదుర్కొన్న సవాళ్లు, సమస్యల పరిష్కారంకోసం సలహాలు, సూచనలతో నివేదికను రూపొందించారు.

  లాజిస్టిక్స్.పై పనితీరులో మెరుగుదల లక్ష్యంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన వ్యూహాన్ని రూపొందించుకునేందుకు వీలుగా నివేదికలోని అంశాలను పరిశీలించి, తమ స్థాయిని అంచనావేసుకునేలా ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన ప్రోత్సాహాన్ని అందించారు.

  లీడ్స్ సర్వే అనేది నిరాటంకంగా సాగే కసరత్తు. లాజిస్టిక్ ప్రక్రియ మెరుగుదల లక్ష్యగా ఈ సర్వే నిర్వహణకోసం, భాగస్వామ్య వర్గాలన్నింటినీ అనుసంధానం చేసేందుకు, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంతో ఆసక్తిని, శ్రద్ధను కనబరుస్తోంది. లాజిస్టిక్ వ్యవస్థ మెరుగుదలకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన కార్యకలాపాల తీరును బట్టి చూస్తే, సరుకుల రవాణా, పంపిణీ, నిల్వలకోసం జరిగే వ్యయం రాబోయే ఐదేళ్లలో ఐదుశాతం మేర తగ్గుతుందన్నది ఇపుడు కలిగిన ఆశాభావం. దీనితో లాజిస్టిక్ రంగం ప్రగతి ఛోదక శక్తిగా, భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక శక్తిగా పరివర్తన చెందించే కీలక శక్తిగా లాజిస్టిక్ రంగం ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.

  దేశంలోని అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లాజిస్టిక్ వ్యవస్థకు లీడ్స్ సర్వేద్వారా మద్దతు ఇచ్చేందుకు, తగిన సదుపాయాలు కల్పించేందుకు, మెరుగుదలను ప్రోత్సహించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ తన కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగిస్తుంది. ఎంతో సమన్వయంతో కూడిన ఈ కృషితో లాజిస్టిక్ వ్యయం తగ్గే అవకాశాలు ఉన్నాయి. పి.ఎం. గతిశక్తి జాతీయ మాస్టర్ ప్రణాళికను ఉద్దీపనం చెందడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

వెబ్ లింక్- https://commerce.gov.in/whats-new/

 

****



(Release ID: 1770162) Visitor Counter : 170