పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

బేసిక్ గ్రూపు దేశాల తరఫున కేంద్రమంత్రి భూపేందర్ ప్రకటన!


కాప్-26 సదస్సు సందర్భంగా విడుదల

Posted On: 01 NOV 2021 3:00AM by PIB Hyderabad

  వాతావరణ పెనుమార్పులతో పెరుగుతున్న భూతాపోన్నతి నియంత్రణ, కర్బన ఉద్గారాల కట్టడిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రస్తుతం స్కాట్లండ్.లోని గ్లాస్గోలో   జరుగుతున్న సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-కాప్26) నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. పారిశ్రామిక దేశాలుగా నూతనంగా రూపుదాల్చిన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారతదేశం, చైనా దేశాల సభ్యత్వంతో బేసిక్ గ్రూప్ పేరిట ఏర్పాటైన కూటమి తరఫున ఆయనీ ప్రకటనను విడుదల చేశారు.

  కాప్-26 వాతావరణ సదస్సు నిర్వహణ ఒక ఏడాది ఆలస్యమైనా,..ఇదివరకే అంగీకారం కుదిరిన జాతీయ నిర్ణయాత్మక అంశాలను (ఎన్.డి.సి.లను) భాగస్వామ్య వర్గాలన్నీ అమలు చేయడం ఇప్పటికే ప్రారంభమైందని ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ చెప్పారు. ఈ కారణంవల్లనే, వాతావరణ మార్పులపై కుదిరిన పారిస్ ఒప్పందం, నియమావళిపై ప్రస్తుతం జరిగే కాప్-26 సదస్సులో ఒక నిర్ణయం తీసుకోవడం చాలా కీలకంగా మారిందని అన్నారు.

 “ఈ విధిని నిర్వర్తించడంలో సమానమైన, ఉమ్మడి ప్రాతిపదిక కలిగిన సూత్రాలను అమలు చేసేందుకు, వివిధ రకాల బాధ్యతల నిర్వహణకు తప్పనిసరిగా పూర్తి స్థాయి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అలాగే, భాగస్వామ్య వర్గాల, ప్రాతినిధ్య దేశాల విభిన్నమైన జాతీయ పరిస్థితులను కూడా గుర్తించాల్సి ఉంది.” అని కేంద్రమంత్రి తన ప్రకటనలో అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కర్బన ఉద్గారాలు, కలుషిత వాయువులను తక్కువ స్థాయికి నియంత్రించేందుకు వర్ధమాన దేశాలకు తగిన వ్యవధి ఇవ్వాలని, అలాగే విధాన నిర్ణయాలకు కూడా వాటికి అవకాశం ఇవ్వాలని, తగిన మద్దతును కూడా అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

   వాతావరణ మార్పుల నియంత్రకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ప్రపంచ స్థాయిలో మరింత ఎక్కువ స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ మంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే, విభిన్నమైన చారిత్రక బాధ్యతలు, అభివృద్ధి సవాళ్లను ఎదుర్కొంటున్న వర్ధమాన దేశాల బాధ్యతలేమిటో గుర్తించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ దేశాలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరింతగా పెరిగాయన్నారు.

  భూతాపోన్నతి విసురుతున్న సవాళ్ల పరిష్కారంపై కుదిరిన పారిస్ ఒప్పందం స్వభావాన్ని గురించి, తమ జాతీయ నిర్ణయాత్మక అంశాల విషయంలో ప్రాతినిధ్య దేశాలకు ఉన్న స్వేచ్ఛను గురించి కేంద్రమంత్రి యాదవ్ తన ప్రకటనలో ప్రస్తావించారు. జాతీయ పరిస్థితులు, వైజ్ఞానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ నిర్ణయాత్మక అంశాలను ప్రపంచ పరిస్థితుల ఆధారంగా ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని ఆయన సూచించారు.

  భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రతను దీర్ఘకాల వ్యవధిలో కనీస స్థాయికి నియంత్రించాలన్న లక్ష్యాన్ని గురించి భూపేందర్ యాదవ్ ప్రస్తావిస్తూ,. ఈ విషయంలో అన్ని ప్రాతినిధ్య దేశాలూ సత్వరం శక్తివంచన లేకుండా కృషి చేయాలని, తాజాగా అందుబాటులోకి వచ్చిన వైజ్ఞానిక సమాచారం కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నదని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే, అభివృద్ధి చెందిన సంపన్న దేశాలన్నీ, కాలుష్యాల విడుదలను వేగంగా తగ్గించాలని, ఇందుకోసం వర్ధమాన దేశాలకు  అందించే ఆర్థిక సహాయాన్ని పెంచాలని మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. 

 “వాతావరణ మార్పుల నియంత్రణకోసం వర్ధమాన దేశాలకు సంవత్సరానికి వంద బిలియన్ డాలర్లమేర సహాయం అందించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో సంపన్న దేశాలు ప్రతి ఏడాదీ విఫలమవుతూ ఉన్నాయని, 2009నుంచి అవి ఇలా వైఫల్యం కొనసాగుతోందని, అంతేకాక, 2025వరకూ కూడా అవి ఇదే తరహా మార్గాన్ని అనుసరించేలా ఉన్నాయి. వాతావరణ పెనుమార్పుల సవాళ్ల పరిష్కార యత్నాలను బేసిక్ గ్రూపు దేశాలతో సహా అభివృద్ధి చెందిన దేశాలు 2009నుంచి భారీ ఎత్తున చేపట్టాయి. వాతావరణ మార్పులతో ఎదురయ్యే సవాళ్ల నియంత్రణ మార్గాలను అమలు చేసేందుకు సంపన్నదేశాలకు అందే ఆర్థిక సహాయం ఇప్పటికీ సరిగా లేకపోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.” అని ఆయన స్పష్టం చేశారు. కాప్ 26 సదస్సును ఒక విధంగా గుర్తుపెట్టుకోదగినదిగా నిలిచిపోవాలని, వర్ధమాన దేశాలకు సంపన్నదేశాలనుంచి గణనీయమైన స్థాయిలో ఆర్థిక సహాయం అందించినందుకు గుర్తుగా ఈ సదస్సు నిలిచిపోవాలన్నారు.  ఆర్థిక సహాయాన్ని పెంచడంతోపాటుగా, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి-బదలీ, సామర్థ్యాల నిర్మాణం వంటివి కూడా వర్ధమాన దేశాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

   “వాతావరణ పెను మార్పుల నియంత్రణ చర్యలను, లక్ష్యాలను విస్తృతం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. కర్భన మార్కెట్లలో ప్రైవేటు రంగం ప్రమేయానికి అవకాశం కల్పించే మార్కెట్ యంత్రాంగం ఉంటే, తద్వారా వాతావరణంపై లక్ష్యాలను మరింత పెంచుకోవడానికి వీలుంటుంది. జాతీయ నిర్ణయాత్మక అంశాల పరిధిలో ఇప్పటికే సాధిస్తున్న లక్ష్యాలకు అదనంగా ఈ పని చేయాల్సి ఉంటుంది” అని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

   విధానం పారదర్శకంగా, సమ్మిళితంగా ఉంటూ, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నియమావళి స్వభావానికి అనుగుణంగా ఏకాభిప్రాయంతో ఉన్నపుడే బహుళ దేశాలతో కూడిన విధాన ప్రక్రియ విజయవంతం అవుతుందని యాదవ్ అన్నారు.  చర్చనీయాంశాలన్నీ సమ్మిళితంగా, సమతూకమైన పద్ధతిలో సాగాలని, అలాగే, ఫలితం భాగస్వామ్య ప్రతినిధులందరి అభిప్రాయలనూ ప్రతిబింబించాలని బేసిక్ గ్రూపు భావిస్తున్నట్టు యాదవ్ చెప్పారు.

https://ci3.googleusercontent.com/proxy/QdSZUjd0HvEJlovszMyqbKFL_InFBPjiFkyHFWqVZyvJEOg7WQnslb5uChyxUJBKjkS88q90qBiF8Rz6_dK2GD0-jsJisjiydKz9KRDt9TLmgN8gjfMN3vDIkA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001UVW5.jpg

వాతావరణ మార్పులు విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు, సవాళ్లకు తగిన పరిష్కారం కనుగొనేందుకు తాము పూర్తిస్థాయిలో కట్టుబడి పనిచేస్తామని బేసిక్ గ్రూపు దేశాల తరఫున చివర్లో స్పష్టం చేశారు. ఇందుకోసం నిర్మాణాత్మకంగా, ప్రతిశీల దృక్పథంతో భాగస్వామ్య ప్రతినిధులందరితో కలసి పనిచేస్తామని, కాప్ 26 సదస్సు ద్వారా విజయవంతమైన ఫలితాలు లభించేలా చూస్తామని భూపేందర్ యాదవ్ చెప్పారు.

పూర్తి ప్రకటన

 

***



(Release ID: 1768584) Visitor Counter : 163