ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ సహ అధ్యక్షతన క్షయ వ్యాధి నివారణపై జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా దేశాల ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ భారతి పవార్
“చేరుకోని వారిని త్వరగా చేరుకోవడం ఒక సవాలు”: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
Posted On:
26 OCT 2021 4:00PM by PIB Hyderabad
భారత్ సహా అధ్యక్షతన ఈ రోజు జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ప్రసంగించారు.
ఉన్నత స్థాయి సమావేశానికి భారతదేశం సహ ఆతిథ్యం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీమతి పవార్ సమావేశ నిర్వహణకు సారధ్యం వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ సింగ్ ను అభినందించారు.
2025 నాటికి దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తున్నామని డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో తమ ప్రభుత్వం నిర్ణీత లక్ష్యం కంటే అయిదు సంవత్సరాలు ముందుగానే లక్ష్యాన్ని సాధిస్తుందని అన్నారు.
దేశంలో క్షయ వ్యాధి నివారణకు అమలు చేస్తున్న చర్యలను మంత్రి వివరించారు. భారత ప్రభుత్వం క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని వర్గాల సహకారంతో పటిష్ట చర్యలను అమలు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అన్నారు. క్షయ వ్యాధి పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించడంతో పాటు వ్యాధి నిర్మూలన, గుర్తింపు కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వివరించారు. వ్యాధి సోకి చికిత్స పొందుతున్న వారికి చికిత్స పూర్తి అయ్యేంతవరకు నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా పోషక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. గాలి ద్వారా వ్యాధి సోక కుండా చూడడానికి ఆసుపత్రులు, రోగులు వేచి ఉండే ప్రాంతాల్లో నివారణా చర్యలను అమలు చేస్తున్నామని అన్నారు. చిన్న పిల్లలకు వ్యాధి సోకకుండా నివారించడానికి కీమోప్రొఫిలాక్సిస్ కార్యకమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పెద్దలలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించామని మంత్రి చెప్పారు.
చేరుకోనివారిని గుర్తించి వారిని త్వరగా చేరుకోవడం అనేది క్షయ వ్యాధి నివారణలో కీలకంగా ఉంటుందని డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ వ్యాఖ్యానించారు. ఈ సవాల్ ను ఎదుర్కోవడానికి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.పొరుగు దేశాలకు వ్యాధి నిర్మూలనకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఇతర సౌకర్యాలను అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని మంత్రి ప్రకటించారు.
క్షయ వ్యాధి నివారణకు అత్యున్నత స్థాయి రాజకీయ నిబద్ధతను కనబరుస్తున్న ఆగ్నేయాసియా ప్రాంతం దేశాలను డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అభినందించారు. వ్యాధి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలకు నిధులు అందిస్తున్న దేశాలను మంత్రి ప్రశంసించారు. దీనివల్ల వ్యాధిని గుర్తించడానికి వేగంగా పరీక్షలను నిర్వహించి అవసరమైనవారికి తక్షణం చికిత్స అందించడానికి అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు.
క్షయ వ్యాధి నివారణకు అమలు చేస్తున్న కార్యక్రమాలకు సహాయ సహకారాలను అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ భాగస్వాములకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, ఆస్ట్రేలియా పార్లమెంట్ సభ్యుడు వారెన్ ఎంట్ష్, ఆసియా పసిఫిక్ టీబీ కాకస్ కో-చైర్ డాక్టర్ సుమన్ రిజాల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుమన్ రిజల్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1766770)
Visitor Counter : 184