శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బలహీనపరిచే తెగుళ్లు మరియు తరచుగా సంభవించే తుఫానుల నుండి పురాతన జీడిమామిడి తోటలను కాపాడుతున్న - కేరళ రైతు వినూత్న సాంకేతికత

Posted On: 25 OCT 2021 5:19PM by PIB Hyderabad

జీడిమామిడి తోటల్లో, వినాశకరమైన కాండం తొలిచే పురుగు ఉధృతి, తరచుగా సంభవించే తుఫానుల నుండి తన పురాతన జీడిమామిడి తోటను రక్షించుకోడానికి, జీడి మామిడి చెట్ల లో ప్రధాన వేరు వ్యవస్థను అభివృద్ధి చేసే ఒక వినూత్న విధానాన్ని, కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఒక మహిళా రైతు రూపొందించారు.

జీడిమామిడి పండించే అన్ని దేశాల కంటే అత్యధికంగా, భారతదేశంలో సుమారు 10.11 లక్షల హెక్టార్లలో, జీడి మామిడి (అనకార్డియం ఆక్సిడెంటల్ ఎల్.) సాగవుతోంది. జీడిపప్పు మొత్తం వార్షిక ఉత్పత్తి సుమారు 7.53 లక్షల టన్నులు కాగా, అనేక మంది రైతులు తమ జీవనోపాధి కోసం దీనిపై ఆధారపడి ఉన్నారు.  అయితే, జీడిపప్పు ఉత్పత్తికి అనేక జీవ సంబంధమైన కారణాలతో పాటు నిర్జీవ సంబంధమైన ఇతర కారకాలు కూడా కలిగిస్తున్నాయి.   జీడిమామిడి ని తీవ్రంగా బలహీనపరిచే తెగుళ్ళలో కాండం మరియు వేరు తొలుచు పురుగు ఒకటి, ఎందుకంటే ఇది ఎదిగిన చెట్ల ను కూడా తక్కువ వ్యవధిలో నాశనం చేస్తుంది. 

తెగుళ్ళ కలిగే నష్టంతో పాటు, తీరప్రాంతాల్లో తరచుగా సంభవించే భారీ తుఫానుల వల్ల కూడా జీడి మామిడి తోటలు బాగా దెబ్బతింటున్నాయి. కాగా, అటువంటి ప్రతి విధ్వంసం నుంచి జీడిమామిడి తోటలను పునరుద్ధరించుకోవడానికి పదేళ్లకు పైగా పడుతోంది. 

(ఎ) తుఫాను కారణంగా దెబ్బతిన్న జీడి మామిడి తోట

(బి) కాండం మరియు వేరు తొలుచు పురుగు 

* చిత్రాల సౌజన్యం : ఐ.సి.ఏ.ఆర్. - పుత్తూరు

ఈ సవాళ్లను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో, కేరళకు చెందిన శ్రీమతి అనియమ్మ బేబీ అనే మహిళా రైతు, జీడిమామిడి చెట్లకు ఎక్కువగా వేర్లు ఉత్పత్తి చేసే, ఒక వినూత్న పద్ధతి ని అభివృద్ధి చేశారు.  ఈ పద్ధతి పెరిగిన జీడిమామిడి చెట్లలో, ఎక్కువగా వేర్లను ఉత్పత్తి చేస్తుంది, తద్వారా ఒక్కొక్క చెట్టుకు దిగుబడి పెరుగుతుంది.  ఇది కాండం మరియు వేరు తొలుచు పురుగు నివారణకు పర్యావరణ అనుకూల చర్యగా కూడా సహాయపడుతుంది,  ఉత్పాదకతను పునరుద్ధరిస్తుంది, ఈదురు గాలులు / తుఫానుల వల్ల సంభవించే నష్టాన్ని అధిగమించడానికి దోహదపడుతుంది,  తిరిగి మొక్కలు నాటవలసిన అవసరం లేకుండా, తోటల జీవితాన్ని పొడిగించడానికి వీలు కలుగుతుంది. 

2004 లో, జీడిమామిడి కాయలు కోస్తున్నప్పుడు, అనియమ్మ ఒక జీడిమామిడి కొమ్మను గమనించారు.  అది మట్టితో ఎక్కువగా కలిసి ఉండటంతో,  అక్కడ నుండి బలమైన అంటు వేర్లు (తల్లి వేరు / కూకటి వేరు కాదు) వచ్చాయి. ఒక సాధారణ జీడిమామిడి మొక్క తో పోలిస్తే ఈ వేరు నుండి ఉద్భవించే కొత్త మొక్క వేగంగా పెరుగుతున్నట్లు ఆమె గమనించారు. మరుసటి సంవత్సరం కాండం తొలిచే పురుగు (మొక్కల కాండాన్ని తొలిచే కీటకాల లార్వా లేదా ఆర్థ్రోపోడా) ఆశించి తల్లి మొక్కలను నాశనం చేసింది.  అయితే, కొత్తగా అభివృద్ధి చెందిన మొక్క, ఆ పురుగుల బారిన పడకుండా సురక్షితం గా, ఆరోగ్యంగా ఉంది.  తల్లి మొక్క నుండి కొత్త మొక్కలకు వేర్లు వచ్చి, అవి అభివృద్ధి చెందడాన్ని ఆమె గమనించారు. అప్పుడు ఆమె, కింది వరుసలో, సమాంతరంగా పెరుగుతున్న కొమ్మల కణుపుల పై మట్టి మిశ్రమం తో నింపిన సంచులను చుట్టడం ద్వారా కొత్త మొక్కలను అభివృద్ధి చేయాలని, ఆలోచించారు.  అలాగే భూమికి దగ్గరగా ఉన్న కొమ్మలపై బరువు పెట్టి, వేర్లు పెరిగేందుకు వాటిని మట్టితో కప్పి, బోలుగా ఉన్న కాండం నుండి భూమి లోకి కొత్త వేర్లు చొచ్చుకుపోయే విధంగా ఆమె మార్గనిర్దేశనం చేశారు. ఆమె రూపొందించిన ఈ రెండు ప్రయోగాలు విజయవంతం కావడంతో, నిరంతరం అధిక జీడిపప్పు సరఫరాతో ఆమె తమ కుటుంబాన్ని పోషించడానికి, ఆమె గత 7 సంవత్సరాలుగా తన పురాతన జీడిమామిడి తోటల్లో ఈ రెండు పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

ఇందుకు అవసరమైన మద్దతు తో పాటు ఇంక్యుబేషన్ కార్యకలాపాల కోసం, భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ కు చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఈ వినూత్న సాంకేతికతను చేపట్టింది. 

పుత్తూరు (మొట్టెతడ్క, దర్బే జిల్లా, పుత్తూరు, కర్ణాటక) లోని ఐ.సి.ఏ.ఆర్. - జీడిమామిడి పరిశోధన డైరెక్టరేట్ తో పాటు,  కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం (వెల్లనిక్కర, జిల్లా, త్రిసూర్, కేరళ) కూడా, 2020 లో, ఈ సాంకేతిక (పురాతన తోటల కోసం జీడిమామిడి బహుళ రూటింగ్) విధానాన్ని, ధృవీకరించాయి.  ఈదురు గాలులు / తుఫానుల వల్ల సంభవించే నష్టాన్ని అధిగమించడానికి దోహదపడే, ఒక ప్రత్యేకమైన విధానం గా ఇది గుర్తింపు పొందింది. కాండం, వేర్లు తొలిచే పురుగు తీవ్రమైన దాడి నుంచి జీడిమామిడి తోటలను అత్యంత పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న రీతిలో, ఈ విధానం పునరుద్ధరిస్తుంది.  అదనపు దిగుబడులు సాధించడానికి పురాతన జీడిమామిడి తోటలను కలిగి ఉన్న జీడిమామిడి రైతులకు ఈ సాంకేతికత కొత్త ఆశను అందిస్తుంది. 

ఆవిష్కర్త ఉపయోగించే రెండు విభిన్న పద్ధతుల్లో మొదటి విధానం - స్థూపాకార ఆకార పద్ధతి లో భూమికి సమాంతరంగా పెరుగుతున్న జీడి మామిడి చెట్టు క్రింది కొమ్మలపై మట్టి, ఆవు పేడ కలిపిన మిశ్రమం తో నింపిన సంచిని కట్టాలి. నేల, ఆవు పేడ మిశ్రమం తో నిండిన బోలుగా ఉన్న కాండం ద్వారా కొత్త వేర్లు బయటకు వస్తాయి.  ఓ ఏడాది కాలంలో, ఈ వేర్లు అభివృద్ధి చెంది , జీడి మామిడి చెట్టు ప్రధాన వేర్ల వ్యవస్థకు అనుసంధాన మౌతాయి.  ఇది  మొక్కకు పోషకాలు, నీటిని చేరవేసే మరో మార్గం గా పనిచేయడం ద్వారా దిగుబడిని పెంపొందిస్తుంది. 

విధానం 1: రాయి  / అరకనట్ బోలు కాండాన్ని స్థూపాకారంలో అమర్చడం.  

రెండవ విధానం - తక్కువ ఎత్తులో అడ్డంగా ఉండే సమాంతర కొమ్మల పద్ధతి లో ఆవిష్కర్త తక్కువ ఎత్తులో ఉండే కణుపుల చుట్టూ రాళ్ల ను పేర్చి, మట్టి, ఆవు పేడతో కప్పారు.  ఈ కణుపుల వద్ద వేర్లు పెరిగి, ఆ కొమ్మ ఒక వైపు కొత్త చెట్టుగా పెరుగుతుంది. కాగా, మరోవైపు ప్రధాన చెట్టులో కొంత భాగం గా మిగిలి ఉంటుంది.  రాతి ప్రాంతాల్లో కూడా కొమ్మల వద్ద వేర్లు పెరిగే లా చేయడంలో ఆమె కృతకృత్యు రాలయ్యింది. 

విధానం-2 : తక్కువ ఎత్తులో అడ్డంగా ఉండే సమాంతర కొమ్మల పద్ధతిని ఉపయోగించడం

మరిన్ని వివరాల కోసం, తుషార్ గార్గ్ (tusharg@nifindia.org) ని సంప్రదించండి.

 

*****


(Release ID: 1766562) Visitor Counter : 230


Read this release in: English , Hindi , Punjabi , Tamil