ఆర్థిక మంత్రిత్వ శాఖ

పౌర విమానయానం.. టెలి కమ్యూనికేషన్ రంగాల్లో ‘కేపెక్స్‌’పై ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమీక్ష

Posted On: 25 OCT 2021 8:30PM by PIB Hyderabad

   దేశంలో మూలధన వ్యయం (కేపెక్స్‌), మౌలిక సదుపాయల ప్రగతికి ఉత్తేజమిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక-కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ఇవాళ పౌర విమానయాన, టెలికమ్యూనికేషన్‌ శాఖలపై న్యూఢిల్లీలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి  అధ్యక్షత వహించారు. ఆర్థిక, పౌర విమానయాన, టెలికం శాఖ కార్యదర్శులతోపాటు ఈ మూడు శాఖల సంయుక్త కార్యదర్శులు, ఆర్థిక వ్యవహారా సలహాదారులు తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సంబంధిత మంత్రిత్వశాఖలు సంయుక్తంగా కృషిచేయాలని ఆమె నిర్దేశించారు.

   సమావేశం అనేక అంశాలను సమీక్షించింది. ఈ మేరకు తొలి, మలి (క్యు1, క్యు2) త్రైమాసికాల్లో మూలధన వ్యయం స్థితిగతులు, మూలధన సత్వర వ్యయం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబోయే త్రైమాసికాల్లో మంత్రిత్వ శాఖలతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ)ల ద్వారా మూలధన వ్యయ లక్ష్యాలు, జాతీయ మౌలిక సదుపాయాల వరుస (ఎన్‌ఐపీ)లోని పథకాల అమలుకు చేసిన వ్యయం, ఆస్తుల ద్రవ్యీకరణ ద్వారా నిధుల సమీకరణపై అంచనాలు, ‘పీపీపీ’ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు, జాతీయ బృహత్‌ ప్రణాళిక (గతిశక్తి) కింద కేంద్రీకరణ వంటివాటిపై చర్చలు సాగాయి. ఆర్థిక వ్యవస్థలో హెచ్చు వృద్ధిని సాధించడం కోసం రాబోయే నెలల్లో మూలధన వ్యయాన్ని మరింత పెంచడానికి మంత్రిత్వశాఖలు సమష్టిగా కృషి చేయాలని శ్రీమతి సీతారామన్‌ పునరుద్ఘాటించారు.

   నిధుల విడుదలతోపాటు పథకాల అమలును పర్యవేక్షించాల్సిందిగా ఆర్థికశాఖ మంత్రి అధికారులను కోరారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ఆ మేరకు మూలధన వ్యయం కోసం అవసమైనన్ని నిధులను సమకూరుస్తుందని శ్రీమతి సీతారామన్‌ హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కోసం కేవలం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ నిర్దేశిత వ్యయం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం కూడా వ్యయం చేయాల్సి ఉందని శ్రీమతి సీతారామన్‌ స్పష్టం చేశారు. తదనుగుణంగా దేశంలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించి ప్రైవేటు రంగం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించే అన్ని పనుల మొత్తం ప్రగతిని పర్యవేక్షించాలని సూచించారు.

   పౌర విమానయాన శాఖ పరిధిలో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు, ప్రస్తుత లక్ష్యంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో ‘కేపెక్స్‌’ స్థాయిని గణనీయంగా మెరుగుపరిచేందుకు ఆ శాఖతో సన్నిహిత సమన్వయం చేసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి తమ ఆర్థిక వ్యవహారాల విభాగం అధికారులను ఆదేశించారు. అలాగే టెలికమ్యూనికేషన్ల శాఖ తమ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ‘కేపెక్స్‌’ను పెంచేలా చూడాలని, ఆస్తుల ద్రవ్యీకరణను వేగవంతం చేయాలని శ్రీమతి సీతారామన్‌ కోరారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా ఖరారు చేయడం కోసం ‘దీపం’ (డీఐపీఏఎం)తో కార్యకలాపాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ఈశాన్య భారత ప్రాంతంలో డిజిటల్‌ సదుపాయాల విస్తరణ పనుల అమలును వేగిరపరచేందుకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.

   ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల పథకాలపై వ్యయం పెంచడంతోపాటు రాబోయే ఆర్థిక సంవత్సర వ్యయ ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను శ్రీమతి సీతారామన్‌ ఆదేశించారు. వివిధ మౌలిక సదుపాయాల మంత్రిత్వశాఖలు/విభాగాలలో మూలధన వ్యయంపై ఆర్థికశాఖ మంత్రి చేపట్టిన సమీక్ష సమావేశాల్లో ఇది మొదటిది కాగా, 2021 జూన్‌లో నిర్వహించిన తొలివిడత భేటీకి కొనసాగింపు కావడం గమనార్హం.

 

***



(Release ID: 1766559) Visitor Counter : 138


Read this release in: English , Urdu , Hindi