సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

నార్త్ బ్లాక్, డీఓపీటీలో ఐఏఎస్/ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2020 అఖిల భారత టాపర్లను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సన్మానించారు.


యువ అధికారులను నవ భారత నిర్మాతలుగా అభివర్ణించిన మంత్రి, రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరారు.

Posted On: 21 OCT 2021 4:10PM by PIB Hyderabad

కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖల సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), భూవిజ్ఞానాలశాఖ, పీఎంఓ, వ్యక్తిగత, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షశాఖల సహాయ మంత్రి మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  ఐఏఎస్/ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020లో విజయం సాధించిన  20 మంది టాపర్లతో మాట్లాడారు. ఆయన వారిని నార్త్ బ్లాక్ లోని పర్సనల్ & ట్రైనింగ్ (డీఓపీటీ) ప్రధాన కార్యాలయంలోకి పిలిపించారు.  సివిల్స్ పరీక్ష ఫలితాలను ఇటీవల ప్రకటించారు. టాప్ -20 ర్యాంకుల హోల్డర్లను,  వారి కుటుంబ సభ్యులను స్వాగతిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. టాప్ 20 అభ్యర్థుల్లో 10 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని, వీళ్లు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చినందున దేశమంతటా సేవలు అందించబోతుండటం చాలా సంతోషాన్ని ఇస్తోందని, ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు. ఈ ర్యాంకర్లు బీహార్, చండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ వాసులు. గత కొన్ని సంవత్సరాలుగా లింగస్థాయిలో,  ప్రాంతీయ స్థాయిలో జనాభాలో వస్తున్న మార్పులు మనలాంటి విభిన్న దేశాలకు బాగా ఉపయోగపడతాయని మంత్రి చెప్పారు. మొత్తం 761 మంది అభ్యర్థులు (545 మంది పురుషులు  216 మంది మహిళలు) పేర్లను కమిషన్ సిఫార్సు చేసినట్లు మంత్రికి సమాచారం అందించారు. వీరందరినీ ఈ సంవత్సరం వివిధ సేవల కోసం నియమిస్తారు.  డాక్టర్ జితేంద్ర సింగ్ 2014 నుంచి డీఓపీటీ ద్వారా ఆల్ ఇండియా టాపర్‌లను వ్యక్తిగతంగా నార్త్ బ్లాక్‌కు ఆహ్వానించి సత్కరించే కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

యువ అధికారులను నవభారత నిర్మాతలుగా అభివర్ణించిన డాక్టర్ జితేంద్ర సింగ్, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 వ సంవత్సరంలో సేవల్లోకి ప్రవేశించడం విశేషమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశం 100 ఏళ్లు పూర్తి చేసుకునే వరకు వీళ్లు ఉద్యోగాల్లో ఉంటారని, ప్రధాని నరేంద్రమోదీ నవభారత్ విజన్ను గుర్తిస్తారని సింగ్ వివరించారు.  ప్రపంచమంతటినీ  భారతదేశం నడిపించాలన్నది ఆయన ఆలోచన అని చెప్పారు. ప్రధాని మోడీ హయాంలో, భారతదేశం ఇప్పటికే అధిరోహణలో ఉందని, ఈ కొత్త తరహా పౌర సేవకులకు మనదేశాన్ని ప్రపంచస్థాయిలో అగ్రశ్రేణికి తీసుకెళ్లే ప్రత్యేక బాధ్యత ఉందని ఆయన అన్నారు. గత ఏడు సంవత్సరాలలో యువ ప్రొబేషనర్లు,  ఐఏఎస్ అధికారుల కోసం తీసుకువచ్చిన కొన్ని సరికొత్త సంస్కరణలను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేటాయించిన కేడర్‌లో చేరడానికి సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్లే ముందు కేంద్ర ప్రభుత్వం వద్ద 3 నెలలు పనిచేసే విధానాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టారు.  ఈ 20 మంది టాపర్లలో పదకొండు మంది ఇంజనీర్లు  ముగ్గురు మెడికోలు కూడా ఉన్నారని మంత్రి గుర్తించారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రత్యేక పథకాలు,  కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో వారి పాత్ర కీలకమని అన్నారు.  ఆరోగ్యం, వ్యవసాయం, పారిశుధ్యం, విద్య, నైపుణ్యాలు  మొబిలిటీ వంటి రంగాలలో ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలకు సాంకేతిక నిపుణుల అవసరం ఎంతో ఉందని మంత్రి వివరించారు.

 ఆధునిక పాఠ్యాంశాలు, సమ్మిళిత విధానం ద్వారా  ఎల్‌బిఎస్ఎఎ ముసోరీ,  ఇతర సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లలో శిక్షణా విధానాలను మార్చుతున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. పరిపాలన  అంతిమ లక్ష్యం మిషన్ కర్మయోగి ద్వారా భారతదేశంలోని సామాన్యుల కోసం "ఈజ్ ఆఫ్ లివింగ్" తీసుకురావడమే అని ఆయన అన్నారు.

 

సీఎస్ఈ 2020 లో టాపర్లను స్వాగతిస్తూ, సిబ్బంది  శిక్షణ విభాగం కార్యదర్శి పీకే త్రిపాఠి మాట్లాడారు. ఎంతో ముఖ్యమైన సమయంలో ( అమృత్‌కాల్) ఈ అధికారులు ప్రభుత్వసేవలో ప్రవేశిస్తున్నారని, దేశ భవిష్యత్తు నిర్మించడానికి వారు రాబోయే 25 సంవత్సరాలలో అద్భుతమైన పాత్ర పోషించాలని అన్నారు.  అవకాశాలు,  సవాళ్లతో నిండిన వారి  కెరీర్‌ ద్వారా ఈ అధికారులు దేశానికి తమ ఉత్తమమైన వాటిని అందించగలరని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఆ శాఖ సీనియర్ అధికారులందరూ హాజరయ్యారు.  

 

***(Release ID: 1765658) Visitor Counter : 140