రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఓ.ఎఫ్.బి. నుండి రూపొందించబడిన ఏడు కొత్త రక్షణ సంస్థలు - విజయదశమి సందర్భంగా జాతికి అంకితం


పటిష్టమైన భారతదేశం కోసం డాక్టర్ కలాం కన్న స్వప్నానికి ఈ ఏడు కంపెనీ ల ఏర్పాటు బలాన్ని చేకూరుస్తుందని తమ వీడియో ప్రసంగంలో పేర్కొన్న - ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

భవిష్యత్తులో దేశం లోని సైనిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ఏడు కొత్త కంపెనీలు బలమైన స్థావరాన్ని ఏర్పాటు చేస్తాయి : ప్రధానమంత్రి

రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించడంతో పాటు, ఈ కొత్త కంపెనీలు భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయని ఆకాంక్షించిన - శ్రీ రాజ్‌నాథ్ సింగ్

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఉత్పాదక, లాభదాయకమైన ఆస్తులుగా మార్చడంతో పాటు రక్షణ సంసిద్ధత లో స్వీయ-ఆధారితను నిర్ధారించడానికి కొత్త నిర్మాణం: ఆర్.ఎం.

Posted On: 15 OCT 2021 2:10PM by PIB Hyderabad

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓ.ఎఫ్.బి) నుండి రూపొందించబడిన ఏడు కొత్త రక్షణ సంస్థలను, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, విజయదశమి సందర్భంగా, 2021 అక్టోబర్, 15వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, జాతికి అంకితం చేయడం జరిగింది.   ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.  డి.ఆర్.డి.ఓ. భవన్ లోని కొఠారి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు.

కార్యనిర్వాహక స్వయంప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడం తో పాటు, కొత్త వృద్ధి సంభావ్యత, ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, ఆవిష్కరించడానికి, అదే విధంగా, దేశ రక్షణ సంసిద్ధత లో స్వయం సమృద్ధి ని మెరుగుపరిచే చర్యగా, ఓ.ఎఫ్.బి. ని ప్రభుత్వ శాఖ నుండి వేరు చేసి 100 శాతం ప్రభుత్వ యాజమాన్యం లో కార్పొరేట్ సంస్థలు గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.   ఏడు కొత్త రక్షణ సంస్థలు:  మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎం.ఐ.ఎల్);  ఆర్మౌర్డ్ వాహనాల నిగమ్ లిమిటెడ్ (ఏ.వి.ఏ.ఎన్.ఐ);  అధునాతన ఆయుధాలు మరియు సామగ్రి ఇండియా లిమిటెడ్ (ఏ.డబ్ల్యూ.ఈ. ఇండియా);  ట్రూప్ కంఫర్ట్స్ లిమిటెడ్ (టి.సి.ఎల్) (ట్రూప్ కంఫర్ట్ ఐటమ్స్);  యంత్ర ఇండియా లిమిటెడ్ (వై.ఐ.ఎల్);  ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (ఐ.ఓ.ఎల్);  గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (జి.ఐ.ఎల్).   ఈ కంపెనీలు 2021 అక్టోబర్, 1వ తేదీ నుండి తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించాయి.

ఈరోజు విజయదశమి శుభ సందర్భంగా, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పూజించే సంప్రదాయం గురించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, తమ వీడియో ప్రసంగంలో ప్రస్తావించారు.  భారతదేశంలో, మనం శక్తి ని సృష్టి మాధ్యమంగా భావిస్తామని పేర్కొంటూ,   అదే స్ఫూర్తితో, దేశం శక్తి ని పుంజుకునే దిశగా పయనిస్తోందని, ఆయన వ్యాఖ్యానించారు.

డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాంకు శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.   శక్తివంతమైన భారతదేశం కోసం, డాక్టర్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన పేర్కొన్నారు.  ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ల పునర్నిర్మాణంతో పాటు, ఏడు కంపెనీల ఏర్పాటు, శక్తివంతమైన భారతదేశం కోసం, డాక్టర్ కలాం కన్న స్వప్నానికి, వాస్తవరూపాన్ని ఇస్తుందని, ప్రధానమంత్రి అన్నారు.   భారతదేశ స్వాతంత్య్ర అమృతోత్సవం జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో, దేశానికి నూతన భవిష్యత్తును నిర్మించడానికి దేశం అనుసరిస్తున్న వివిధ తీర్మానాలలో కొత్త రక్షణ సంస్థల ఏర్పాటు ఒక భాగమని ఆయన వివరించారు. 

ఈ కంపెనీలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం చాలా కాలం పాటు నిలిచిపోయిందని ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో దేశం లోని సైనిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ఏడు కొత్త కంపెనీలు ఒక బలమైన స్థావరంగా ఏర్పడగలవన్న విశ్వాసాన్ని, ఆయన వ్యక్తం చేశారు.  రాబోయే కాలంలో దేశంలోని సైనిక బలం కోసం ఈ 7 కొత్త కంపెనీలు బలమైన స్థావరంగా ఏర్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.  భారతీయ ఆయుధ కర్మాగారాల గత వైభవాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, స్వాతంత్య్రానంతర కాలంలో ఈ కంపెనీల అభివృద్ధి విస్మరించబడ్డంతో, దేశం దాని అవసరాల కోసం విదేశీ సరఫరాదారుల పై ఆధారపడాల్సి వచ్చిందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.  "ఈ 7 రక్షణ సంస్థలు, ఈ పరిస్థితిని మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

'ఆత్మ-నిర్భర్-భారత్' దార్శనికతకు అనుగుణంగా, దిగుమతి ప్రత్యామ్నాయంగా, ఈ కొత్త కంపెనీలు, ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  ఈ కంపెనీలపై దేశానికి పెరుగుతున్న విశ్వాసాన్ని 65,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్డర్ బుక్ ప్రతిబింబిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 

గతంలో ఎన్నడూ లేనంతగా రక్షణ రంగంలో నమ్మకం, పారదర్శకత, సాంకేతికతతో కూడిన విధానాన్ని సృష్టించిన వివిధ కార్యక్రమాలతో పాటు, ఇటీవల చేపట్టిన సంస్కరణలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ప్రైవేట్, ప్రభుత్వ రంగాలు రెండూ, ఈ రోజు, జాతీయ భద్రతా మిషన్‌ లో చేతులు కలిపి పని చేస్తున్నాయని ఆయన చెప్పారు.   కొత్త విధానానికి, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రక్షణ కారిడార్లను ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు.  యువత, ఎం.ఎస్.ఎం.ఈ. లకు నూతన అవకాశాలు ఉద్భవిస్తున్నాయనీ, ఫలితంగా, దేశం, ఇటీవలి సంవత్సరాలలో, విధానపరమైన మార్పులను చూస్తోందని ఆయన తెలియజేశారు.  "గత ఐదేళ్లలో మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 325 శాతం పెరిగాయి" అని, ప్రధానమంత్రి చెప్పారు. 

మన కంపెనీలు తమ ఉత్పత్తులలో నైపుణ్యాన్ని స్థాపించడంతో పాటు, అంతర్జాతీయ బ్రాండ్‌గా మారడమే మన లక్ష్యమని, శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  పోటీ వ్యయం మన బలమైతే, నాణ్యత, విశ్వసనీయత మన గుర్తింపు గా ఉండాలని ఆయన కోరారు.  21వ శతాబ్దంలో, ఏదైనా దేశం లేదా కంపెనీ వృద్ధి మరియు బ్రాండ్ విలువ దాని పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల ద్వారా నిర్ణయించబడుతుందని ఆయన వివరించారు.  పరిశోధన, ఆవిష్కరణలు, వారి పని సంస్కృతిలో భాగం కావాలని, తద్వారా వారు కేవలం అనుసరించే వారిగా కాక, భవిష్యత్తు సాంకేతికతలను అందిపుచ్చుకోవడం లో ముందుండాలని కొత్త కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పునర్నిర్మాణం కొత్త కంపెనీలకు ఆవిష్కరణ మరియు నైపుణ్యాన్ని పెంపొందించడానికి మరింత స్వయంప్రతిపత్తిని అందిస్తుందని, కొత్త కంపెనీలు అలాంటి ప్రతిభను ప్రోత్సహించాలని ఆయన అన్నారు.  ఒకరికొకరు పరిశోధన, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, అంకుర సంస్థలు, ఈ కంపెనీల ద్వారా ఈ కొత్త ప్రయాణంలో భాగం కావాలని ఆయన కోరారు.

ఈ కొత్త కంపెనీలకు ప్రభుత్వం మెరుగైన ఉత్పత్తి వాతావరణాన్ని కల్పించడంతో పాటు, పూర్తి క్రియాత్మక స్వయంప్రతిపత్తిని కూడా కల్పించిందని, ప్రధానమంత్రి,  పేర్కొన్నారు.  ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షించేలా ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఓ.ఎఫ్.బి. ని ఏడు రక్షణ సంస్థలుగా మార్చే నిర్ణయాన్ని చారిత్రాత్మకమైనదిగా,  రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో పేర్కొంటూ,  ఈ చర్య 'ఆత్మ-నిర్భర-భారత్' సాధించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.  ఈ నిర్ణయం ఈ కంపెనీలకు స్వయంప్రతిపత్తిని అందించడంతో పాటు, వాటి కింద 41 కర్మాగారాల పనితీరులో జవాబుదారీతనం, సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఉన్న ఓ.ఎఫ్.బి. వ్యవస్థలో ఉన్న వివిధ లోపాలను అధిగమించడానికి కొత్త నిర్మాణం సహాయపడటం తో పాటు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ, పోటీగా మారడానికి, మార్కెట్‌లో ఎగుమతులతో సహా కొత్త అవకాశాలను అన్వేషించడానికి, ఈ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తుందని, ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

"ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఉత్పాదక, లాభదాయకమైన ఆస్తులుగా మార్చడం; ఉత్పత్తి శ్రేణిలో నైపుణ్యాన్ని మెరుగుపరచడం; పోటీతత్వాన్ని పెంచడం; నాణ్యతను మెరుగు పరచడం; వ్యయ-సామర్థ్యాన్ని పెంపొందించడం తో పాటు, రక్షణ సంసిద్ధతలో స్వావలంబన నిర్ధారించడమే, ఈ పునర్వ్యవస్థీకరణ లక్ష్యం." అని ఆయన చెప్పారు.

రాబోయే కాలంలో, రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించడంతో పాటు, ఈ కొత్త కంపెనీలు భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడాలని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు.  పునర్నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అనీ, దానంతట అది అంతం కాదనీ, ఆయన, ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

కొత్త కంపెనీలు వృద్ధికి అవసమైన పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, శ్రీ రాజ్ నాథ్ సింగ్, పేర్కొంటూ,  అవసరమైతే, ప్రారంభంలో, ఆర్థిక, ఆర్థికేతర వ్యవహారాలలో ,ప్రభుత్వం, జోక్యం చేసుకుని మద్దతు అందిస్తుందని, సింగ్ హామీ ఇచ్చారు. 

ఓ.ఎఫ్.బి. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వ నిబద్ధతను శ్రీ రాజ్పు నాథ్ సింగ్ పునరుద్ఘాటిస్తూ,  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వారి సేవా పరిస్థితులలో ఎలాంటి మార్పు లేకుండా, ఉత్పత్తి యూనిట్లకు చెందిన ఓ.ఎఫ్.బి. (గ్రూప్ ఏ,బి,సి) ఉద్యోగులందరూ రెండేళ్ల కాలానికి డీమ్డ్-డిప్యుటేషన్‌ పై కార్పొరేట్ సంస్థలకు బదిలీ చేయబడతారని, తెలియజేశారు. 

రక్షణ మంత్రి మాట్లాడుతూ, 'ఆత్మ నిర్భర్-భారత్' సాధించడానికి రక్షణ వస్తువుల ఉత్పత్తి కీలకమన్నారు. నికర ఎగుమతిదారుగా, ప్రైవేట్ రంగం, జాయింట్ వెంచర్లు, రక్షణ తయారీ యూనిట్ల ఏర్పాటులో చురుకుగా పాల్గొనడం ద్వారా, భారతదేశాన్ని రక్షణ తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పాన్ని, ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.  2014 నుండి, ప్రపంచ మార్కెట్ లోకి ప్రవేశించడానికి అవసరమైన పురాతన వ్యాపార పద్ధతులు మరియు ఆధునిక పద్ధతుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు.  ‘మేక్-ఇన్-ఇండియా :మేక్-ఫర్-ది-వరల్డ్’ అనే ప్రధానమంత్రి దార్శినికత ని సాధించే దిశగా దేశం పెద్ద ఎత్తున అడుగులు వేస్తోందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

"గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా దేశ రక్షణ రంగం ఉన్నత శిఖరాలకు చేరుకుంది.  దేశీయంగా ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించి, ఎగుమతులు, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల కోసం అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాము.” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  2024 నాటికి అంతరిక్షం, రక్షణ ఉత్పత్తులు, సేవల ద్వారా, 35,000 కోట్ల రూపాయల మేర ఎగుమతులతో సహా 1.75 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలని రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని, ఆయన తెలియజేశారు. 

ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాల సమ్మేళనంగా దేశంలో ప్రస్తుత రక్షణ తయారీ దృష్టాంతాన్ని, రక్షణ మంత్రి నిర్వచించారు.  "మన సాయుధ దళాల సంసిద్ధతను పెంపొందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండు చేతులు కలిపి పని చేస్తున్నాయి" అని ఆయన అన్నారు. 

రక్షణ దళాల నుంచి వచ్చే ఆర్డర్‌లపై మాత్రమే ఆధారపడకుండా, భారతదేశంతో పాటు విదేశాల్లో కొత్త అవకాశాలను అన్వేషించాలని, శ్రీ రాజ్‌నాథ్ సింగ్ కొత్త యాజమాన్యాలను కోరారు.  ఆయన దేశ ప్రజలకు 'విజయదశమి' శుభాకాంక్షలు తెలిపారు.  అదేవిధంగా, మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, నాయకత్వం కారణంగా మాత్రమే, ఓ.ఎఫ్.బి. పరివర్తన, వాస్తవ రూపు దాల్చగలదని,  రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ పేర్కొన్నారు.  దేశంలోని 10 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో 75,000 కంటే ఎక్కువ ఉద్యోగులు, 41 ఉత్పత్తి యూనిట్లు మరియు అనేక ఉత్పత్తి యేతర యూనిట్లు, 79,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆస్తులతో పాటు, అన్నింటికంటే, 220 సంవత్సరాల కంటే ఎక్కువ వారసత్వంతో  సంబంధం ఉన్న, ఇంత పెద్ద సంస్కరణను నిర్వహించడం సాధ్యమయ్యేలా చేసిన, రక్షణ మంత్రి నేతృత్వంలోని ఈ.జి.ఓ.ఎం. కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు, 

ఈ కార్యక్రమంలో - జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్;  వైమానిక దళాధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి;  రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్;  కార్యదర్శి (రక్షణ ఉత్పత్తులు) శ్రీ రాజ్ కుమార్;  కార్యదర్శి (మాజీ సైనికుల సంక్షేమం) శ్రీ బి. ఆనంద్;  ఆర్ధిక సలహాదారు (రక్షణ సేవలు) శ్రీ సంజీవ్ మిట్టల్;  రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులతో పాటు,  రక్షణ పరిశ్రమ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 

ప్రధాన కార్యక్రమంతో పాటు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏడు కొత్త కంపెనీలు, వాటి యూనిట్లలో కార్యక్రమాలు కూడా సమన్వయంతో ఏకకాలంలో సంఘటితంగా జరిగాయి.   ఈ చారిత్రాత్మక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా సంస్థల వద్ద స్థానికంగా అనేక కార్యక్రమాలు స్వతంత్రంగా కూడా నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమాలు దృశ్య మాధ్యమం ద్వారా ప్రధాన కార్యక్రమంతో అనుసంధానించడం జరిగింది.

 

*****(Release ID: 1764327) Visitor Counter : 222