రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సేలా సొరంగ మార్గం తవ్వకం పూర్తి!

ప్రధానమార్గంలో పేల్చివేత ప్రక్రియకు
రక్షణమంత్రి రాజనాథ్ అధ్యక్షత
వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా కార్యక్రమ నిర్వహణ...

అరుణాచల్ లోని తవాంగ్.తో అనుసంధానమే
సేలా కనుమ సొరంగ మార్గం ప్రత్యేకత

‘ఇండియా @75 బి.ఆర్.ఒ. మోటార్ సైకిల్ యాత్ర’
న్యూఢిల్లీలో ప్రారంభించిన రక్షణ మంత్రి..

Posted On: 14 OCT 2021 12:52PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

 

· జాతీయ భద్రతను, అరుణాచల్ ప్రదేశ్ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని బలోపేతం చేయబోతున్న సేలా కనుమ సొరంగ మార్గం.

· సాయుధ బలగాల సన్నద్ధతను ఇనుమడింపచేయడంలో, సరిహద్దు ప్రాంతాల్లో ఉపాధి కల్పన, పర్యాటకాభివృద్ధిలో  సరిహద్దు రహదారుల సంస్థదే కీలకపాత్ర.

 · జాతీయ సమగ్రత, జాతినిర్మాణ ఆవశ్యకతా సందేశాన్ని విస్తరింపజేయనున్న మోటార్ సైకిల్ యాత్ర.

 

   దేశంలోని ఇతర ప్రాంతాలను అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పుకామెంగ్, పశ్చిమ కామెంగ్, తవాంగ్ జిల్లాలతో అనుసంధానం చేసే సేలా కనుమ సొరంగ మార్గ నిర్మాణంలో ప్రధాన తవ్వకం పనులు పూర్తయినందుకు సూచనగా నిర్వహించిన పేల్చివేత (బ్లాస్టింగ్) కార్యక్రమానికి రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. న్యూఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా  ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరిహద్దు రహదారుల సంస్థ (బి.ఆర్.ఒ.) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ‘ఇండియా@75 బి.ఆర్.ఒ. మోటార్ సైకిల్ యాత్ర’ను కూడా రాజనాథ్ సింగ్ పతాకం ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

  భారతీయ రక్షణ సిబ్బంది అధిపతి జనరల్ బిపిన్ రావత్, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, సరిహద్దు రహదారుల సంస్థ (బి.ఆర్.ఒ.) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ రాజీవ్ చౌధరి,  ప్రభుత్వ సీనియర్ అధికారులు, సైన్యాధికారులు, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.

   ఈ సందర్భంగా రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ కామెంగ్ జిల్లాలోని సేలా సొరంగ మార్గం జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ ప్రాంతపు సామాజిక ఆర్థికాభివృద్ధికి ఈ మార్గం ఎంతో దోహదపడుతుందని అన్నారు.

    తూర్పు, పశ్చిమ కామెంగ్, తవాంగ్ జిల్లాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసే 317 కిలోమీటర్ల బలిపారా-చర్దౌర్-తవాంగ్ రహదారిలో 13,800 అడుగుల ఎత్తున పర్వత సానువుల్లో సైలా కనుమ సొరంగం ఉంది. ఈ సొరంగ మార్గ నిర్మాణంతో ప్రయాణ కాలం కూడా గణనీయంగా తగ్గడంతోపాటుగా, ఏ కాలంలో అయినా ఈ మార్గంలో ప్రయాణానికి అవకాశం ఏర్పడుతుంది.

  కార్యక్రమంలో రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, ఎత్తయిన పర్వత సానువుల్లో అతి తీవ్రమైన ప్రతికూల వాతావరణంలో కూడా రహదారులను, వంతెనలను, సొరంగాలను, వైమానిక క్షేత్రాలను నిర్మించడం ద్వారా సరిహద్దు రహదారుల సంస్థ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. సరిహద్దు రహదారుల సంస్థ తన కృషితో మారుమూల ప్రాంతాలు కూడా క్రమంగా రేఖాచిత్రపటాల్లో చోటుచేసుకుంటున్నాయని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు బి.ఆర్.ఒ. చేస్తున్న కృషితో సాయుధ బలగాల సన్నద్ధత మరింతగా ఇనుమడించిందని అన్నారు. అంతేకాక, సుదూర ప్రాంతాల్లో పర్యాటక కార్యకలాపాలు పెంచేందుకు, ఆయా ప్రాంతాల్లో స్థానికుల ఉపాధి కల్పనకు ఇది తోడ్పడుతోందని అన్నారు. ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న భవిష్యత్తులో తవాంగ్ ప్రాంతానికేకాక, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతటికీ ఒక జీవనాడిగా ఈ సొరంగ మార్గం మారుతుందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

   రోహ్తాంగ్ వద్ద 10వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ సొరంగ మార్గాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో 19,300 అడుగుల ఎత్తులో నిర్మించిన ఉమ్లింగ్లా కనుమ మార్గాన్ని గురించి కూడా కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. బి.ఆర్.ఒ. ఇటీవల సాధంచిన ఇలాంటి విజయాలన్నీ ప్రపంచ దేశాలన్నింటికీ అధ్యయనాంశాలుగా మారాయని అన్నారు.

    బి.ఆర్.ఒ. ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభమైన ‘ఇండియా@75 బి.ఆర్.ఒ. మోటార్ సైకిల్ యాత్ర’ను రాజనాథ్ సింగ్ ప్రస్తావిస్తూ, దేశ సేవలో తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు ఈ యాత్ర సముచితమైన నివాళిగా అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లవుతున్న సందర్భాన్ని పురస్కరించకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఈ మోటార్ సైకిల్ యాత్రను రూపొందించారు. బి.ఆర్.ఒ., భారతీయ సైన్యం, జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ (జి.ఆర్.ఇ.ఎఫ్.-గ్రెఫ్)కు చెందిన 75మంది ఈ యాత్రలో పాల్గొంటున్నారు. 75 రోజులపాటు జరిగే ఈ యాత్ర దాదాపు 20వేల కిలోమీటర్లు సాగుతుంది. ఈ యాత్రా మార్గంలోని ఆయా ప్రాంతాల్లోని స్థానికులను, పాఠశాలల చిన్నారులను, సాహస అవార్డుల విజేతలను, మాజీ సైనికులను, వీరనారులను ఈ యాత్రలో పాల్గొనే సిబ్బంది కలుసుకుంటారు. యాత్రలో భాగంగా పలు చోట్ల వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. స్వచ్ఛ భారత్ అభియాన్, రహదారి భద్రత  వంటి అంశాలపై అవగాహన కూడా కల్పిస్తారు.

 ప్రజల్లో, ప్రత్యేకించి యువజనుల్లో జాతీయ సమగ్రత, జాతి నిర్మాణ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ మోటార్ సైకిల్ యాత్ర దోహదపడుతుందన్న ఆశాభావాన్ని రక్షణమంత్రి వ్యక్తం చేశారు. ఇలాంటి యాత్రలు కేవలం సాహసకృత్యాలను ప్రోత్సహించడం మాత్రమేకాక, రక్షణ, భద్రతా అంశాల ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయన్నారు. “ఇలాంటి యాత్రల ద్వారా సరిహద్దు భద్రత, తదితర అంశాలపై అదనపు సమాచారాన్ని మనం సమీకరించవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు మన సైన్యం ఎంతో ప్రోత్సాహం అందించింది. భద్రతకు సంబంధించిన సమాచార సేకరణలో ఇది మనకు ఎంతో దోహదపడుతోంది.” అని రాజనాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి కార్యకలాపాలకు ప్రోత్సాహం కోసం మనం సామాన్య ప్రజలకు చేరువగా వెళ్లాలని అన్నారు. దీనితో పర్యాటకాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ పటిష్టత వంటి లక్ష్యాలు సాధ్యమవుతాయని కేంద్రమంత్రి అన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కూడా శక్తివంచన లేకుండా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ యాత్రలో పాల్గొనే వారు తమ అనుభవాలను నమోదు చేయాలని, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా భావితరాలకోసం వాటిని భద్రపరచాలని పిలుపునిచ్చారు.

    అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని సేలా కనుమ సొరంగ మార్గ నిర్మాణ పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో శంకుస్థాపన చేశారు. బలిపారా-చంద్రౌర్-తవాంగ్ రహదారి ద్వారా తవాంగ్ ప్రాంతానికి అన్ని కాలాల్లో రోడ్డు మార్గం ద్వారా అనుసంధానం ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ సొరంగ మార్గ పథకాన్ని చేపట్టారు. ఈ రోజు జరిగిన పేల్చివేతతో సేలా కనుమలో ప్రధాన సొరంగ తవ్వకం పూర్తి అయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన 980 మీటర్ల పొడవైన రెండవ సొరంగంలో ఇప్పటికే 700మీటర్లకు మార్గానికి తవ్వకం ముగిసింది.

  ఒకటిన్నర కిలోమీటర్ల పొడవుతో ఈ సొరంగ నిర్మాణం పూర్తయితే, 13,600 అడుగులకుపైగా ఎత్తయిన పర్వత సానువుల్లో రెండు లేన్లలో నిర్మించిన ప్రపంచంలోని అతి పొడవైన సొరంగ మార్గాల సరసన ఇది చేరుతుంది. వినూత్నమైన ఈ సొరంగ మార్గ నిర్మాణంకోసం అధునాతనమైన కొత్త తరహా ఆస్ట్రియన్ సొరంగ నిర్మాణ పద్థతిని అనుసరిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో దారి అంతా మంచుతో కప్పుకుపోయే పరిస్థితి, దాన్ని తొలగించాల్సిన సవాళ్ళను పరిష్కరిస్తూ, అన్ని కాలాల్లో రోడ్డు అనుసంధానం ఉండేలా ఈ సొంరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. సేలా కనుమ ద్వారా మరింత వేగంగా గమ్యం చేరేందుకు వీలు కలిగించే ఈ సొరంగ మార్గం ఇకపై తవాంగ్ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప వరంలా మారబోతోంది.

   మరోవైపు,.. ‘ఇండియా @75 మోటార్ సైకిల్ యాత్ర’ 75రోజులపాటు దేశం నలుమూలలకూ సాగుతుంది. న్యూఢిల్లీలోని ఇండియాగేట్.నుంచి ఉత్తరాదిలో రోహ్తంగ్, ఖర్డుంగ్ లా, ఉమ్లింగ్లా వంటి పర్వత కనుమల గుండా సాగుతుంది. ఇక రెండవ దశలో శ్రీనగర్.నుంచి సిరిగుడి వరకూ సాగుతుంది. 3వ, 4వ దశల్లో సిలిగుడినుంచి గ్యాంగ్టక్ ద్వారా డూమ్ డూమా వరకు యాత్రను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈ యాత్ర ఈశాన్య ప్రాంతాలగుండా కోల్కతా చేరుకుంటుంది. ఐదవ, ఆరవ దశల్లో దేశంలోని తూర్పు, దక్షిణ, పశ్చిమ కోస్తా ప్రాంతాలగుండా యాత్రను నిర్వహిస్తారు. చివరిదశలో ఎడారి ప్రాంతాల ద్వారా సాగుతుంది. అంతిమంగా ఈ ఏడాది డిసెంబరు 27వ తేదీన ఈ యాత్ర న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఈ యాత్ర నిర్వహణకు, హీరో మోటో కార్ప్, భారత్ పెట్రోలియం లిమిటెడ్ సంస్థలు స్పాన్సార్లర్లుగా వ్యవహరిస్తున్నాయి. యాత్రకు అవసరమైన సాహసక్రీడల మోటార్ సైకిళ్లను, రక్షణ పరికరాలను, జాకెట్లను, విడి భాగాలను, సాంకేతిక సహాయాన్ని ఈ సంస్థలు అందిస్తున్నాయి.

  

 

*****



(Release ID: 1764188) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Hindi , Tamil