ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మోస‌పూరితంగా రూ. 134 కోట్ల ఐటిసిని క్లెయిమ్ చేసినందుకు 1 వ్య‌క్తిని అరెస్టు చేసిన ఢిల్లీ సిజిఎస్‌టి అధికారులు

Posted On: 13 OCT 2021 12:49PM by PIB Hyderabad

మోస‌పూరితంగా ఐజిఎస్‌టిని రిఫండ్ కోరే ఉద్దేశంతో గుడ్స్ అండ్ స‌ర్వీసెస్ టాక్స్ (జిఎస్‌టి) కింద రూ. 134 కోట్ల మేర‌కు న‌కిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పొంది, ఉప‌యోగించుకుంటున్న కృత్రిమ ఎగుమ‌తిదారుల నెట్‌వ‌ర్క్‌ను తూర్పు ఢిల్లీలోని కేంద్ర గుడ్స్ అండ్ స‌ర్వీసెస్ టాక్స్ (సిజిఎస్‌టి), క‌మిష‌న‌రేట్ కు చెందిన అధికారులు వివ‌రణాత్మక విశ్లేష‌ణ చేసి, వెలికితీశారు. న‌ష్ట విశ్లేష‌ణ (రిస్క్ అనాలిసిస్‌) ఆధారంగా అనుమానాస్ప‌ద‌మైన ఎగుమ‌తిదారు ఎం/ఎ స్ వైబ్ ట్రేడెక్స్‌ను ప‌రిశీల‌న‌కు గుర్తించారు. ఎం/ఎ స్ వైబ్ ట్రేడెక్స్ పాన్ మ‌సాలా, న‌మిలే పొగాకు, ఎఫ్ఎంసిజి వ‌స్తువులు త‌దిత‌రాల ఎగుమ‌తుల‌లో నిమ‌గ్న‌మై ఉంది. 
కృత్రిమ ఎగుమ‌తిదారుల నెట్‌వ‌ర్క్‌ను చిరాగ్ గోయెల్ అనే వ్య‌క్తి నిర్వ‌హిస్తున్నాడు. అత‌డు యుకెలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ సండ‌ర్‌లాండ్ నుంచి ఎంబిఎ డిగ్రీ చేశాడు. ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న అత‌డి భాగ‌స్వామి యాజ‌మాన్యంలోని రెండు స‌ర‌ఫ‌రా సంస్థ‌లు/ క‌ంపెనీలు ఉత్ప‌త్తి చేసిన ఇ-వే బిల్లుల‌ను విస్త్ర‌తంగా విశ్లేషించిన త‌ర్వాత‌, నిర్దిష్ట‌ వాహ‌నాల ద్వారా ఉద్దేశిత వ‌స్తువుల స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్టుగా  ఉత్ప‌త్తి చేసిన ఈ వే బిల్లులు న‌కిలీవ‌ని తేలింది. ఆ వాహ‌నాల‌ను సుదూరంగా ఉన్న గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని న‌గ‌రాల‌లో తిప్పుతున్నారు త‌ప్పు, పేర్కొన్న కాలంలో అవి ఢిల్లీలో ప్ర‌వేశించ‌లేదు. వీటిపై వారు పొంది, వినియోగించుకున్న న‌కిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ విలువ రూ. 134 కోట్లు. 
ప్ర‌భుత్వాన్ని మోసం చేసేందుకు ఈ లోతైన కుట్ర‌కు సూత్ర‌ధారి చిరాగ్ గోయెల్‌. సిజిఎస్‌టి చ‌ట్టం, 2017లోని  సెక్ష‌న్ 132(1)(సి) కింద నిర్దేశించిన విచార‌ణ అర్హ‌మైన‌, నాన్ బెయిలబుల్  నేరాల‌కు పాల్ప‌డ్డాడు. అత‌డిని  న్యూఢిల్లీలోని మెట్రోపాలిట‌న్ మేజిస్ట్రేట్ పాటియాలా హౌజ్ కోర్టు స‌ముదాయం 26.10.2021వ‌ర‌కు 14 రోజుల పాటు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీకి రిమాండ్ చేసింది. ఈ కేసులో త‌దుప‌రి ద‌ర్యాప్తులు కొన‌సాగుతున్నాయి. 

 

***


(Release ID: 1763701) Visitor Counter : 192