వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

మహమ్మారి జీ20 ప్రాధాన్యతలను పునర్నిర్మించిందని, జీ20 లో సమ్మిళిత, సమానమైన ఎజెండాను ప్రవేశపెట్టడానికి ప్రత్యేకమైన అవకాశం ఇచ్చిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పారు


"ఆత్మ నిర్భర్ భారత్ ప్రపంచానికి భారతదేశ తలుపులు మూసివేయడం గురించి కాదు; ఇది వాస్తవానికి ద్వారాలను మరింత విశాలంగా మారుస్తుంది’’: పీయూష్ గోయల్

ఐసీఆర్ఐఈఆర్ 13 వ వార్షిక అంతర్జాతీయ జీ-20 కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో పీయూష్ గోయల్ ప్రసంగించారు

Posted On: 06 OCT 2021 7:58PM by PIB Hyderabad

కరోనా మహమ్మారి..  జీ20 ప్రాధాన్యతలను పునర్నిర్మించిందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు & ఆహారం & పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్,  టెక్స్‌టైల్స్ శాఖల మంత్రి  పియూష్ గోయల్ చెప్పారు. ఐసీఆర్ఐఈఆర్  13 వ వార్షిక అంతర్జాతీయ జీ-20 కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన  గోయల్, మనం కొత్త ప్రపంచంలో ఒక ముఖ్యమైన జాతిగా మన స్వంత ప్రక్రియలను పునరాలోచించుకోవడం, పునరాలోచన చేయడం, పునర్నిర్మించడం కొనసాగించాలని అన్నారు.

జీ20 మరింత సమగ్రమైన  సమానమైన ఎజెండాను కొనసాగించాలని  గోయల్ పిలుపునిచ్చారు.

 

"రాబోయే కొన్నేళ్లలో మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ సంస్థకు నాయకత్వం వహిస్తాయి. మొదట ఇండోనేషియా, తరువాత భారత్ నాయకత్వం వహిస్తాయి. జీ20 లో మరింత సమగ్రమైన,  సమానమైన ఎజెండాను ప్రవేశపెట్టడానికి మనందరికీ ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం. ఈ "దశాబ్దపు చర్య" లో కలిసి పనిచేయడం ద్వారా, జీ20 అన్ని సుస్థితర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్డీజీ) సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం.. మరింత ప్రాతినిధ్యం  కలుపుకొని ఉన్న ప్రపంచ సంస్థలైన డబ్ల్యుటిఒ, యుఎన్ఎఫ్‌సిసిసి మొదలైన సంస్థలతో కలిసి పనిచేయాలి. వాతావరణ చర్యపై బలమైన ప్రకటనను తీసుకురావడానికి మనం ఏకాభిప్రాయం కలిగిన భాగస్వాములతో కలిసి ప్రకటన చేయాలి”అని ఆయన అన్నారు.

 

మహమ్మారి ద్వారా తమ ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ఇచ్చిన నాయకత్వం ప్రపంచంలోనే సాటిలేనిదని  గోయల్ అన్నారు. "ఈ ప్రపంచం ఈ పరస్పన అనుసంధానిత,  పరస్పర ఆధారిత ప్రపంచంలో, అందరూ సురక్షితంగా ఉండే వరకు ఎవరికీ రక్షణ లేదని ఈ రోజు ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంది.  ఆ దిశగా ప్రపంచ ఆర్థిక సమన్వయం చాలా అవసరం. ఇది జరగడానికి మనమందరం సమానంగా బాధ్యత వహించాలి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడం అత్యవసరం. ధనికులు, పేదలనే తేడా లేకుండా అన్ని దేశాలు, ప్రపంచంలోని అందరు పౌరులు టీకాలు వేయించుకోవాలి. కరోనాకి నివారణను కనుగొనడానికి తీవ్రమైన పరిశోధనలు అవసరం. వాస్తవానికి మొదటి దశతో సహా, మహమ్మారిని తెలివిగా ఎదుర్కోవడంలో భారతదేశం అన్ని దశల్లో తన పనితీరును చూపించింది. మేము ఈ సంక్షోభాన్ని మా ఆర్థిక విధానాన్ని పటిష్టపర్చడానికి వాడుకున్నాం. కొత్త అవకాశాలను సృష్టించుకున్నాం. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలు ఇచ్చాం. ఉదాహరణకు మేము కరోనా టెస్టులను రోజుకు 2,500 నుండి దాదాపు 30 లక్షలకు పెంచాము. పీపీఈ కిట్స్ మా దగ్గరే తయారవుతున్నాయి. ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పీపీఈ కిట్స్ తయారీదారు. మా ఐసీయూ బెడ్స్ పెరిగాయి. ఆక్సిజన్ నిల్వలు సరిపడా ఉన్నాయి.  నైపుణ్యం కలిగిన మానవశక్తికి శిక్షణ ఇచ్చింది. వివిధ మార్గాల్లో భారతదేశం అందరికీ మార్గం చూపించింది” అని అన్నారాయన. ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మ నిర్భర్ పిలుపు నిజంగా ప్రతి భారతీయుడి ఆలోచనా విధానాన్ని మార్చివేసిందని  గోయల్ అన్నారు.

"ఆత్మ నిర్భర్ భారత్ ప్రపంచంతో బంధాలు తెంచుకోవడానికి కాదు. ఇది వాస్తవానికి ద్వారాలను మరింత విశాలంగా మారుస్తుంది. ఎందుకంటే మనకు పోటీ పడే సత్తా ఉంది. మనకు ప్రపంచ వాణిజ్యంలో నాయకత్వ స్థానం కావాలి.  భారతదేశంలోనే ఉదారవాద మార్కెట్ కు ప్రాప్యత ఉండాలి.  అన్ని ఉత్పత్తుల కోసం ఇతర దేశాల పరస్పరం సహకారం కోరుకుంటున్నాం. తద్వారా మేము వాణిజ్యాన్ని విస్తరిస్తాం. ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసులలో ఒక ముఖ్యమైన వాటాదారుగా, విశ్వసనీయ భాగస్వామిగా  ప్రపంచాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాం. - మహమ్మారి అనంతర కాలంలో ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక పునరుద్ధరణ  ప్రపంచ ఆరోగ్య పునరుద్ధరణకు మా వంతు సాయం చేస్తాం”అని ఆయన అన్నారు. ప్రజలు, పుడమి & సామూహిక శ్రేయస్సు కోసం జీ20 నాయకత్వ పాత్ర పోషించాలని  గోయల్ పిలుపునిచ్చారు.

 

"మనకు కావలసింది మనపై, మన సామర్థ్యాలపై విశ్వాసం. జీ20 సభ్యులు తప్పనిసరిగా "కేంద్రీకృత" విధానాన్ని కలిగి ఉండాలి, అంటే ఆర్థిక పురోగతి తప్పనిసరిగా ఉపాధి కేంద్రీకృత, ప్రజలు, వర్గాలకు మేలు చేసేలా ఉండాలి. ఇలాంటి విధానాలను తీసుకురావాలి”అని గోయల్ అన్నారు.

జీ20.. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను కలిపే అంతర్జాతీయ వేదిక.  ప్రపంచ జీడీపీ లో 80%, ప్రపంచ వాణిజ్యంలో 75% వాటా దీని సభ్యదేశాల నుంచి వస్తోంది. అంతేకాదు  జనాభాలో 60% కంటే ఎక్కువ వాటా ఈ దేశాలే కలిగి ఉన్నాయి.  ఈ ఫోరమ్ 1999 నుండి ప్రతి సంవత్సరం సమావేశమవుతున్నది.  2008 నుండి జరుగుతున్న వార్షిక శిఖరాగ్ర సమావేశాల్లో సంబంధిత దేశాధినేతల,  ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటున్నది



(Release ID: 1761647) Visitor Counter : 104


Read this release in: English , Urdu , Hindi , Punjabi