శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అంటార్కటిక్ వాతావరణంలో కర్బన ఉద్గారాల తగ్గింపుకు భారతదేశం చిత్తశుద్దితో పనిచేస్తోంది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
మాడ్రిడ్ ప్రోటోకాల్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విర్చువల్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.
పర్యావణ పరిరక్షణకు సంబంధించిన అంటార్కిటిక్ ఒప్పందం (మాడ్రిడ్ ప్రోటోకాల్) పై సంతకాలు జరిగి 30 సంవత్సరాలైన సందర్భంగా సమావేశం.
Posted On:
04 OCT 2021 6:31PM by PIB Hyderabad
మాడ్రిడ్ ప్రోటోకాల్ పై సంతకాలు జరిగి 30 సంవత్సరాలైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ ప్రోటోకాల్‌పై సంతకాలు చేసిన పలు దేశాల నేతలు ఈ విర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. స్పెయిన్ ఆధ్వర్యంలో సమావేశాన్నినిర్వహించారు. స్పెయిన్ ప్రధాని శ్రీ పెడ్రో సాంచెజ్, న్యూజీలాండ్ ప్రధాని జెసిండా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, పలు దేశాల మంత్రులు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో అంటార్కటిక్ వాతావరణంలో కర్బన ఉద్గారాల తగ్గింపుకు భారతదేశం నిబద్దతతో పని చేస్తోందని కేంద్రమంత్రి శ్రీ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. భారత్ చేపట్టిన హరిత ఇంధన కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంకోసం అంటార్కటిక్ ప్రాంతంలోని భారతి స్టేషన్ లో చేపట్టిన చర్యలను వివరించారు.
పర్యావరణ పరిరక్షణకోసం ఏర్పాటైన కమిటీ ప్రకటించిన వాతావరణ మార్పుల స్పందన కార్యక్రమాన్ని అమలు చేయడానికిగాను భారతదేశం సిద్ధంగా వుందని ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ధృవ ప్రాంతాల్లో కార్బన్ డయాక్సయిడ్ కారణంగా వాతావరణం ప్రభావితమవుతుందని, తద్వారా ఆమ్లత్వం సంభవిస్తోందని, అది సముద్ర పర్యావరణాన్ని, పర్యావరణ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని రాబోయే మూడు దశాబ్దాలో అనేక సవాళ్లకు కారణమవుతుందని కేంద్ర మంత్రి తన ప్రసంగంలో వివరించారు. పర్యాటక వృద్ధి ఎలా వుంటుందో భారత్ అంచనా వేస్తోందని, చట్ట వ్యతిరేకంగా, క్రమపద్ధతి లేకుండా చేస్తున్న మత్స్యసేకరణ కార్యకలాపాల కారణంగా సమస్యలు వస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
అంటార్కిట్ వాతావరణాన్ని, దాని మీద ఆధారితమైన సంబంధిత పర్యావరణ వ్యవస్థలను సంరక్షించే సమగ్రమైన కార్యక్రమానికి భారతదేశం చిత్తశుద్ధితో కట్టుబడి వుందని అంటార్కిటికా ప్రాంతాన్ని శాంతి, శాస్త్ర విజ్ఞానానికి అంకితమైన సహజ వనరుల భాండాగారంగా గుర్తించడం సరైన విషయమని కేంద్రమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. అంటార్కిటిక్ ఒప్పందానికి సంబంధించిన పర్యావరణ సంరక్షణ ప్రోటోకాల్ కు భారతదేశం కట్టుబడి వుందని మరోసారి తమ దేశం స్పష్టం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా భారతదేశం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు.
1. ఇండియన్ అంటార్కిటిక్ కార్యక్రమంలో అన్ని రకాల ఏటిసిఎం నిర్ణయాలు, తీర్మానాలు, చర్యలను సమర్థవంతంగా చేపట్టినట్టు ఆయన తెలిపారు.
2. అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రాలైన మైత్రి, భారతిలలో అమలు చేస్తున్న ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థల గురించి వివరించారు. తద్వారా శిలా ఇంధనం వినియోగం తగ్గిపోయి క్రమంగా ఆయా కేంద్రాలు హరిత ఇంధనంతో సమర్థవంతంగా పని చేస్తున్నాయని అన్నారు.
3. బాగా అవసరమైనప్పుడు మాత్రమే వాహనాలు వాడడంకారణంగా కర్బన ఉద్గారాల తగ్గింపు.
4. అంటార్కిటికాకు మానవవనరులను, వస్తువులను, వనరులను సరఫరా చేసే వాహనాల ఉమ్మడి వినియోగం.
5. అంటార్కిటికేతర జీవులను ఏ విధంగాను ఆ ప్రాంతానికి తరలించడకుండా నియంత్రణ.
మాడ్రిడ్ ప్రోటోకాల్ అమల్లోకి వచ్చి మూడు దశాబ్దాలయిందని, దీనిపై 1983లోనే భారతదేశం సంతకం చేయడం జరిగిందని ఇది తమ దేశానికి ఎంతో గర్వకారణమైన విషయమని కేంద్రమంత్రి వివరించారు. అంటార్కిటిక్ పర్యావరణాన్ని, దాని మీద ఆధారపడ్డ పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి పునర్ నిబద్ధులమై వున్నామని ఆయన తెలిపారు.
ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు స్పెయిన్ దేశానికి కేంద్రమంత్రి జితేంద్ర అభినందనలు తెలిపారు.
అంటార్కిటిక్ ఒప్పందంపైన 1983 ఆగస్టు 19న భారతదేశం సంతకం చేసింది. అదే ఏడాది సెప్టెంబర్ 12న భారత్ దేశానికి సంప్రదింపుల స్థాయి లభించింది. అంటార్కిటిక్ ఒప్పందంలోని 29 సంప్రదింపుల పార్టీలలో ఇండియా కూడా ఒకటి. అంటార్కిటిక్ పరిశోధనల్లో భారతదేశం కీలకంగా వ్యవహరిస్తోంది.
అంటార్కిటికాలో భారతదేశానికి రెండు పరిశోధనా కేంద్రాలున్నాయి. 1989లో మైత్రి ప్రారంభమైంది. 2012లో భారతి మొదలైంది. ఇంతవరకూ అంటార్కిటికాలో 40 వార్షిక శాస్త్ర విజ్ఞాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అర్కిటిక్ ధృవ ప్రాంతంలో హిమాద్రి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీంతో ధృవప్రాంతాల్లో పలు పరిశోధనా కేంద్రాలను కలిగిన దేశాల సరసన భారతదేశం నిలిచింది.
అంటార్కిటిక్ ఒప్పందానికి సంబంధించిన పర్యావరణ పరిరక్షణ ప్రోటోకాల్‌పై మాడ్రిడ్‌లో 1991 అక్టోబర్ 4న సంతకాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందం 1998నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా అంటార్కిటికా అనేది శాంతి శాస్త్ర విజ్ఞానాలకు అంకితమైన సహజ భాండాగారంగా గుర్తించడం జరిగింది.
***
(Release ID: 1761076)
Visitor Counter : 270