ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రాజస్థాన్‌ లోని నాలుగు జిల్లా వైద్య కళాశాలలకు శంకుస్థాపనల తో పాటు సి.ఐ.పి.ఈ.టి-జైపూర్‌ ను ప్రారంభించిన - ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


"2014 నుండి 23 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, వీటిలో 7 కళాశాలలు ఇప్పటికే పూర్తిగా పనిచేస్తున్నాయి; రాష్ట్రంలో 4,000 యు.జి. తో పాటు, 2,100 పి.జి. మెడికల్ సీట్లు ఉన్నాయి. 3.5 లక్షల పి.ఎం-జె.ఏ.వై లబ్ధిదారులు మరియు 2,500 హెచ్.డబ్ల్యూ.సి.లు ఉన్నారు."

"ముఖ్యమంత్రిగా నా అనుభవంతో, ప్రతి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా అఖిల భారత స్థాయిలో వైద్య వ్యవస్థను సంస్కరించాలని నేను నిర్ణయించాను"

సి.ఐ.పి.ఈ.టి. అనేది ప్రజలకు ఒక పాలిమర్ వంటిది: ఇది ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ లో దేశాని కి సహాయపడుతుంది; యువతకు అవకాశాలు కల్పించడం తో పాటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో భారతదేశాన్ని సన్నద్ధం చేస్తుంది

Posted On: 30 SEP 2021 3:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజస్థాన్‌ లోని నాలుగు జిల్లా వైద్య కళాశాలలతో పాటు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (సి.ఐ.పి.ఈ.టి) జైపూర్‌ కి శంకుస్థాపనలు చేశారు.  లోక్ సభ స్పీకర్, శ్రీ ఓం బిర్లా;   రాజస్థాన్ ముఖ్యమంత్రి, శ్రీ అశోక్ గెహ్లాట్;   కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి, శ్రీ మన్సుఖ్ మాండవీయ;    కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.    ఈ నాలుగు వైద్య కళాశాలలు సిరోహి, హనుమాన్‌గఢ్, బాన్స్వారా మరియు దౌసా జిల్లాల ప్రజలకు అందుబాటులో సేవలు అందిస్తాయి.

గుజరాత్ ముఖ్యమంత్రిగా తన అనుభవం బహుళ ఆరోగ్య వ్యవస్థలను కలిగి ఉండటం వలన దేశంలోని ఆరోగ్య రంగంలోని లోపాలపై అంతర్దృష్టిని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  "మేము దేశ ఆరోగ్య రంగాన్ని మార్చడానికి జాతీయ విధానం మరియు జాతీయ ఆరోగ్య విధానంపై పనిచేశాము.  స్వచ్ఛ భారత్ అభియాన్ నుండి ఆయుష్మాన్ భారత్ మరియు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వరకు, ఇటువంటి అనేక ప్రయత్నాలు ఈ విధానంలో భాగంగా చేపట్టాము." అని ఆయన వివరించారు.  ఆయుష్మాన్ భారత్ యోజన కింద రాజస్థాన్‌ లోని 2,500 ఆరోగ్య కేంద్రాల ద్వారా దాదాపు 3 లక్షల 50 వేల మంది ఉచిత చికిత్స పొందారని ఆయన చెప్పారు.

ఆశావహ జిల్లాల్లోని వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అప్‌ గ్రేడ్‌ తో ఎయిమ్స్ నెట్‌-వర్క్‌ ను 6 నుండి 22 వరకు విస్తరించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో ప్రాంతీయ అసమతుల్యతను సరిచేయడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.  గత 6-7 సంవత్సరాలలో, 170 కి పైగా కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా,  100 కి పైగా వైద్య కళాశాలల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.   2014 లో, దేశంలో వైద్య కోర్సుల్లో అండర్-గ్రాడ్యుయేట్లు, పోస్ట్-గ్రాడ్యుయేట్ల మొత్తం సీట్లు 82,000 గా ఉండగా, ఈ రోజున ఆ సంఖ్య 1,40,000 కు పెరిగింది.   అదే విధంగా, గతంలో, రాజస్థాన్‌ లో వైద్య కోర్సుల్లో సుమారు 2,000 అండర్-గ్రాడ్యుయేట్ సీట్లు, 1000 కంటే తక్కువగా పోస్ట్-గ్రాడ్యుయేట్ సీట్లు ఉండగా, ఇప్పుడు, అండర్-గ్రాడ్యుయేట్ సీట్లు 4,000 కు,  పోస్ట్-గ్రాడ్యుయేట్ సీట్లు 2,100 కు పెరిగాయి.   జాతీయ వైద్య కమిషన్ జోక్యంతో, వైద్య విద్యలో అక్రమాల సమస్య పరిష్కారమైందని ఆయన అన్నారు.

‘ఉచిత టీకా, అందరికీ టీకా’ ప్రచారం విజయవంతం కావడాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.  భారతదేశంలో 88 కోట్లకు పైగా కరోనా టీకాలు వేయగా, రాజస్థాన్‌ లో 5 కోట్ల  కంటే ఎక్కువగా టీకా మోతాదులు ఇవ్వడం జరిగింది. 

పెట్రో-కెమికల్ పరిశ్రమ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు, ప్రస్తుతం నైపుణ్యం కలిగిన మానవవనరుల అవసరం ఎంతైనా ఉందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.   కొత్త సి.ఐ.పి.ఈ.టి. : ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ టెక్నాలజీ సంస్థ లక్షలాది మంది యువతను కొత్త అవకాశాలతో అనుసంధానిస్తుందని ఆయన అన్నారు. మరుగుదొడ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్ల రాక ద్వారా ప్రవేశపెట్టిన జీవన సౌలభ్యం గురించి కూడా ఆయన ప్రత్యకంగా ప్రస్తావించారు. 

ఈ చారిత్రాత్మక కార్యక్రమం పట్ల శ్రీ మన్సుఖ్ మాండవీయ కృతజ్ఞతలు తెలియజేస్తూ, "ఆరోగ్యాన్ని అభివృద్ధితో ముడిపెట్టిన మొదటి పరిపాలనా దక్షుడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.   ఆయన, ఈ  అక్టోబర్ 7వ తేదీన 20 సంవత్సరాల ప్రజా సేవను పూర్తి చేస్తున్నందున, సబ్-కా-సాథ్-సబ్-కా-వికాస్ పిలుపుని ప్రతిబింబించే విధంగా ఆరోగ్య రంగంలో ఆయన సాధించిన విజయాలను తిరిగి చూడకుండా ఎవరూ ఉండలేరు.  గుజరాత్‌ లో ముఖ్యమంత్రి అమృతం యోజన ద్వారా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2 లక్షల రూపాయల వరకు చికిత్స అందిస్తుండగా, చిరంజీవి యోజన ద్వారా తల్లులు తమ డెలివరీ కోసం ప్రైవేట్ సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.  యుష్మాన్ భారత్ 2 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు వారి రాష్ట్రాల వెలుపల వలస కార్మికులకు లబ్ది చేకూరే విధంగా 5 లక్షల రూపాయలవరకు చికిత్సను పొందేలా చేసింది ." అని ఆయన తెలియజేశారు. 

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఎం.ఎస్.ఎం.ఈ. రంగం కోసం సి.ఐ.పి.ఈ.టి., జైపూర్ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.   సంస్థ-పరిశ్రమ అనుసంధానాన్ని, పటిష్ఠపరుస్తూ,  నైపుణ్యం కలిగిన కార్మికులను అందుబాటులోకి తేవడంతో పాటు,  వివిధ సంస్థలకు సహాయపడే పరిశోధనను ఈ సంస్థలు చేపడతాయి. వాటి పరీక్షా సౌకర్యాలను నాణ్యత నియంత్రణ కోసం ఉపయోగించడానికి అనుమతిస్తాయి.  దేశంలో 42 ఇలాంటి సంస్థలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.  "విద్యా సంస్థల నుండి పరిశ్రమలకు" అనే సూత్రం పై పని చేస్తూ, లక్షకు పైగా విద్యార్థులు ఏటా ఈ సంస్థల్లో వివిధ రంగాలలో శిక్షణ పొందుతున్నారు.  ఈ విద్యార్థుల్లో గరిష్టంగా దాదాపు 99 శాతం మందికి  ఉపాధి ఖచ్చితంగా లభిస్తుంది. 

ప్రధానంగా గిరిజన మరియు అభివృద్ధి చెందని నాలుగు జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నందుకు శ్రీ ఓం బిర్లా ప్రధాన మంత్రి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, "సరసమైన వైద్య విద్య తో పాటు మంచి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా స్థానిక ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు." అని పేర్కొన్నారు.   జైపూర్‌ లో సి.ఐ.పి.ఈ.టి-ఐ.పి.టి. ఏర్పాటు చేసినందుకు కూడా ఆయన ప్రధానమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.  "ఆత్మ నిర్భర్-భారత్ దిశగా ఇది ఒక కీలకమైన చర్య" అని ఆయన అభివర్ణించారు. ఇది ప్రధానమంత్రి 'నూతన భారతదేశ స్వప్నాన్ని నెరవేర్చే దిశగా తోడ్పడుతుందని, ఆయన అన్నారు.

సి.ఐ.పి.ఈ.టి-ఐ.పి.టి. తో పాటు రాజస్థాన్‌ లోని  సిరోహి, హనుమాన్‌-గఢ్, బన్స్వారా, దౌసా లలో నాలుగు వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నందుకు, శ్రీ అశోక్ గెహ్లాట్, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.  గత పది సంవత్సరాల లో దేశంలో  వైద్య విద్య బాగా విస్తరించిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, ముఖ్యంగా వెనుకబడిన మరియు గిరిజన జిల్లాలో ఒక వైద్య కళాశాల చొప్పున ఏర్పాటు చేయడంలో సహకారం అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో - కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖల మంత్రి, శ్రీ భూపేందర్ యాదవ్;  కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్;   కేంద్ర నూతన, పునరుత్పాదక విద్యుత్తు, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి, శ్రీ భగవంత్ ఖుబా;   కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి, శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్;   కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి, శ్రీ కైలాష్ చౌదరి;  రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, శ్రీ రఘు శర్మ;  మాజీ ముఖ్యమంత్రి, శ్రీమతి వసుంధర రాజే సింధియా;   రాజస్థాన్, ప్రతిపక్ష నాయకుడు, శ్రీ గులాబ్ చంద్ కటారియా తో పాటు, రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 

దృశ్య మాధ్యమం లో రికార్డు చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ లింకు ద్వారా వీక్షించవచ్చు: 

https://youtu.be/XZQKOzcqL3c 

 

*****



(Release ID: 1759901) Visitor Counter : 144