ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

విద్య, వైద్యం, వ్యవసాయంలో ప్రజాకేంద్రిత కృత్రిమమేధ వినియోగం పెరగాలి: ఉపరాష్ట్రపతి


- ప్రజాసేవలకు సంబంధించిన అంశాల్లో విశ్వవిద్యాలయాలు, స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి

- నూతనకల్పనలే అభివృద్ధి మంత్రాలు కావాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్ష

- ఐఐటీల వంటి ఉన్నతవిద్యాసంస్థలు సృజనాత్మకత కేంద్రాలుగా నిలవాలని సూచన

- యువత రాజకీయాల్లోకి రావాలి.. తద్వారా ఈ రంగంలో గణనీయమైన మార్పులో భాగస్వాములు కావాలి

- ఐఐటీ జోధ్‌పూర్‌లోని జోధ్‌పూర్ సిటీ నాలెడ్జ్ అండ్ ఇన్నొవేషన్ సెంటర్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి

- ఫ్యాబ్ ల్యాబ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థింగ్స్ (ఏఐఓటీ) సిస్టమ్స్ భవనానికి శంకుస్థాపన

Posted On: 28 SEP 2021 5:22PM by PIB Hyderabad

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి విప్లవాత్మక సాంకేతిక సంస్కరణల సామర్థ్యం ద్వారా కలిగే లాభాలను ప్రజలకు అందించి వారి జీవితాల నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ దిశగా విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రజాకేంద్రిత కృత్రిమమేధ వినియోగాన్ని పెంచేందుకు విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, శాస్త్రవేత్తలు ముందుకు రావాలని ఆయన సూచించారు.

 

మంగళవారం జోధ్‌పూర్ ఐఐటీలోని జోధ్‌పూర్ సిటీ నాలెడ్జ్ అండ్ ఇన్నొవేషన్ సెంటర్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి అనంతరం ఫ్యాబ్రికేషన్ లాబొరేటరీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థింగ్స్ (ఏఐఓటీ) కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. కృత్రిమమేధ, ఏఐఓటీ కారణంగా గత దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనల అంతిమలక్ష్యం.. ప్రజల జీవితాలను సౌకర్యవంతం చేయడమే కావాలని ఆయన సూచించారు. 

 

పరిపాలనలో కృత్రిమమేధ ద్వారా కలిగే మార్పులను ఉదహరిస్తూ.. ప్రజలకు సేవలందించడంలో ఏఐ పాత్ర కీలకంగా మారిందన్నారు. జన్-ధన్ ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ ని ఉదహరిస్తూ.. ఈ ప్రక్రియ ద్వారా నిధుల పంపణీలోని లీకేజీలను అరికట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వాలు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు విశ్వవిద్యాలయాలు, ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థలు చొరవతీసుకోవాలన్నారు. నూతన కల్పనల ద్వారానే అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన సూచించారు. 

 

ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు ప్రాంతీయ భాషల్లో వృత్తివిద్యలను బోధించేందుకు నిర్ణయించుకోవడం శుభపరిణామమన్న ఉపరాష్ట్రపతి.. ఈ దిశగా కృత్రిమమేధ ద్వారా అనువాద వ్యవస్థను ఏర్పర్చుకుని ఆంగ్లం నుంచి ఇతర భారతీయ భాషల్లోకి తర్జుమా చేసుకునే వ్యవస్థను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

 

యువత సేవాభావాన్ని అలవర్చుకోవాలని, రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు. యువశక్తికి సిద్ధాంతం, కాలుష్యం కాని ఆలోచనలు తోడైతే భారత రాజకీయాల్లో గణనీయమైన మార్పులు సాధ్యమని ఈ దిశగా యువత ఆలోచించాలన్నారు.  దీనికితోడుగా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని యువత అలవర్చుకోవాలని ఆయన సూచించారు.

 

ఈ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ రాష్ట్ర మంత్రి శ్రీ బీడీ కల్లా, రాజ్యసభ సభ్యుడు శ్రీ రాజేంద్ర గెహ్లోత్, ఐఐటీ జోధ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతను చౌదరి, డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సంపత్ రాజ్ వదేరా, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

***



(Release ID: 1759086) Visitor Counter : 196