ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

మన విధానాలు, అలవాట్ల విషయంలో భారతీయీకరణ (ఇండియనైజేషన్) జరగాలి: ఉపరాష్ట్రపతి

• భారతీయతకు పట్టుకొమ్మలైన గ్రామాలకు పునర్వైభవం రావాలని ఆకాంక్ష

• వైద్యులు, వైద్య సిబ్బంది కొరతను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని తద్వారా గ్రామాలో వైద్య వసతుల కల్పన జరగాలి

• వైద్యరంగంలో సాంకేతీకరణను మరింతగా అందిపుచ్చుకోవాలని సూచన

• ఢిల్లీ విశ్వవిద్యాలయం మెడికల్ కాలేజీ స్వర్ణజయంతి సందర్భంగా స్నాతకోత్సవంలో పాల్గొని వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేసిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

• వైద్య సిబ్బందికి స్వల్పకాల కోర్సులను నేర్పించడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడటంలో భాగస్వాములు చేయాలని సూచన 

Posted On: 25 SEP 2021 2:00PM by PIB Hyderabad

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తికావొస్తున్నా ఇప్పటికీ కొన్ని వలసవాద విధానాలను కొనసాగించడం పట్ల భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన విధానాలను, మన అలవాట్లను భారతీయీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. చట్టసభలు, విద్య, పరిపాలన, న్యాయ ఇలా అన్నిరంగాల్లోనూ భారతీయ విధానాలను అలవర్చుకోవాలన్నారు. న్యాయవ్యవస్థను జాతీయీకరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారు చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయం వైద్య కళాశాల స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని అందువల్ల గ్రామీణ భారతానికి పునర్వైభవం కల్పించేందుకు అక్కడ విద్య, వైద్య వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి స్థానికసంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్ రంగం సంపూర్ణ సహకారాన్ని అందించాలని సూచించారు.

వైద్యాన్ని చౌకగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సరైన సమయంలో వైద్యం అందించడాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం మరింత ఖరీదౌతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ భారాన్ని మోయలేకపోతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు.

భారతదేశం అన్ని రంగాల్లో ముందడుగు వేస్తోందని.. మరీ ముఖ్యంగా వైద్యరంగంలో ప్రపంచ కేంద్రంగా భాసిల్లుతోందని అన్నారు. ఈ దిశగా మరింత దూరదృష్టితో ముందడుగేసేందుకు భారతదేశ యువత శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్నాతకోత్సవంలో పతకాలు అందుకున్న వారిలో ఎక్కువమంది యువతులు ఉండటాన్ని ప్రత్యేకంగా అభినందించిన ఉపరాష్ట్రపతి... మహిళలకు సరైన ప్రోత్సాహాన్నందిస్తే ఏదైనా సాధించగలరనే దానికి ఇదొక నిదర్శనమని ఆయన అన్నారు.

వైద్యంతోపాటు వివిధ రంగాల్లో విస్తృత పరిశోధనలు, ప్రయోగాలతో ప్రపంచానికి భారతదేశం మార్గదర్శనం చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కరోనా మహమ్మారికి టీకాను కనుగొని మన దేశ ప్రజలకు అందిచడంతోపాటు, మన ప్రాచీన జీవన విధానమైన ‘సర్వేజనా సుఖినోభవంతు’, ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో యావత్ ప్రపంచానికి కూడా టీకాలు అందించడం మన శాస్త్రవేత్తలు, పరిశోధకుల ఘనతేనని ఉపరాష్ట్రపతి అభినందించారు. టీకాను రూపొందించిన సంస్థలకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేయడంలో ఐసీఎంఆర్ తీసుకున్న చొరవను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.

భారతదేశంలోనూ మొదట టీకాకరణపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ ప్రభుత్వాలు, వైద్యులు కల్పించిన చైతన్యంతో ప్రజలు టీకాలు తీసుకుంటున్నారన్నారు. ఈ టీకాకరణ కార్యక్రమాన్ని గ్రామాల్లోనూ మరింతగా ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సిబ్బందితోపాటు ప్రచార, ప్రసార మాధ్యమాలు కీలక పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలో మొదటి వరస పోరాటయోధులుగా వైద్యులు, వైద్య సిబ్బంది పోషించిన పాత్రను సమాజం ఎన్నటికీ మరిచిపోదని ఆయన అన్నారు.  అయితే భారతదేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తిలో ఉన్న భారీ అంతరాన్ని తగ్గించేందుకు విశేషమైన కృషి జరగాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ, తత్సంబంధిత ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషిచేస్తోందని, రానున్న రోజుల్లో ప్రతి రెవెన్యూ కేంద్రానికి ఓ సకల సౌకర్యాలున్న ఆసుపత్రి ఏర్పాటు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ‘అందరికీ వైద్యం’ అనే లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగస్వామ్య పక్షాలన్నీ సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

వైద్యరంగంలో సాంకేతిక వినియోగాన్ని మరింతగా పెంచాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఈ-హెల్త్’ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతి భారతీయుడి ఆరోగ్య వివరాలను డిజిటలీకరించే లక్ష్యంతో త్వరలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్న ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. 

వైద్యరంగం అత్యంత పవిత్రమైన వృత్తుల్లో ఒకటన్న ఉపరాష్ట్రపతి, వైద్య విద్యార్థులు రేపు విధుల్లో చేరిన తర్వాత తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంలో, అక్కడి ప్రజలకు వైద్యం అందించడంలో చొరవతీసుకోవాలన్నారు.  

కరోనా సమయంలో ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రితో కలిసి ఢిల్లీ విశ్వవిద్యాలయ వైద్య కళాశాల ప్రత్యేక వైద్య సేవాకార్యక్రమాలను చేపట్టడాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. 

ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ పీసీ జోషి, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనిల్ కుమార్ జైన్, డీన్ ఆఫ్ కాలేజెస్ ప్రొఫెసర్ బలరాం ఫణితోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***(Release ID: 1758094) Visitor Counter : 67