ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను 51 మందికి ప్రదానం చేసిన గౌరవ రాష్ట్రపతి
నిస్వార్థపూరిత నిబద్దతతో, ప్రేమతో సేవలందిస్తున్నారంటూ నర్సుల సేవలను కొనియాడిన రాష్ట్రపతి
Posted On:
15 SEP 2021 7:57PM by PIB Hyderabad
అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 51 మంది నర్సులకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను గౌరవ రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని విర్చువల్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ మాన్ సుఖ్ మాండవీయా, కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు.
సేవాతత్పరతలోను, సహాయ గుణంలోను భారతీయ సంప్రదాయాలను ప్రతిఫలించేలా పని చేస్తున్న భారతీయ ఆరోగ్య భద్రతారంగ కార్యకర్తలను, నర్సుల సేవలను రాష్ట్రపతి ప్రశంసించారు. కోవిడ్ 19 మహమ్మారి వైరస్ ను కట్టడి చేయడంలో ధైర్యసాహసాలతో మన నర్సులు పని చేశారని , అంతే కాదు దేశవ్యాప్తంగా కోవిడ్ 19 టీకాను వేయడంలోకూడా వారు కష్టపడి పనిచేస్తున్నారని రాష్ట్రపతి కొనియాడారు. నర్సులు చూపిన ప్రత్యేక శ్రద్ధ కారణంగానే ఒక రోజులోనే ఒక కోటికిపైగా టీకాలను వేయగలిగామని రాష్ట్రపతి అన్నారు. చీకటిని పారద్రోలి వెలుగువైపు నడిపించడంలో మీరు చేసిన కృషి దోహదం చేసిందని ఆయన తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ సమరంలో భాగంగా ప్రాణ త్యాగాలు చేసినవారికి జాతి యావత్తు రుణపడి వుంటుందని ఆయన అన్నారు.
ఆరోగ్య రంగ కార్యకర్తలకోసం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద చేపట్టిన బీమా పథకంలాంటివాటి గురించి ఈ సందర్భంగా రాష్ట్రపి తన ప్రసంగంలో ఉదహరించారు. ప్రజలకు, ప్రజారోగ్య భద్రతా వ్యవస్థకు మధ్యన నర్సులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ మాన్ సుఖ్ మాండవీయా 2020లో ప్రపంచం ఎదుర్కొన్న కరోనా మహమ్మారి సవాలు గురించి వివరించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి పలు సందర్భాల్లో చేసిన తన ప్రసంగాలలో నర్సుల విశిష్టతను ప్రశంసించిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీ మాన్ సుఖ్ మాండవీయా గుర్తు చేశారు.ఈ మధ్యనే ఇటలీలో నిర్వహించిన జి 20 దేశాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా నిరంతరం నర్సులు అందించిన నిస్వార్థ సేవల గురించి తాను మాట్లాడినట్టు ఆరోగ్యశాఖ మంత్రి అన్నారు. స్ఫూర్తిదాయక మానవతతో, అణుకువతో, నిస్వార్థపూరిత మనస్తత్వంతో ప్రజలకు నర్సులు చేసే సేవలు ఎంతైనా ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యభద్రతా సేవలందించడంలో నర్సులది కీలకపాత్ర అని ఈ రంగంలో వారు మూలస్తంభాలలో ఒకరు అని ఆయన అన్నారు. కోవిడ్ పై పోరాటంలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన నర్సులకు ఆయన నివాళి ఘటించారు.
ఈ సందర్భంగా వందన సమర్పణ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ దేశంలోని నర్సులకు, కోవిడ్ పోరాట యోధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికిగాను నిరంతరం శ్రమించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, ఇంకా ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
నర్సలు అందించే విశిష్ట సేవలను గుర్తించి వారికి ప్రతి ఏటా జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 1973నుంచి ప్రతి ఏటా అవార్డుల ప్రదానం చేస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని https://webcast.gov.in/events/MTQzMQ--/session/MzM2Ng--లింకులో ప్రసారం చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రసంగాన్ని https://youtu.be/f0u1KTtf8Kc లింకులో వినవచ్చు. అవార్డుల వివరాలను - https://www.youtube.com/watch?v=4zBdZr170eQ లింకులో వీక్షించవచ్చు. కింద తెలియజేసిన ఆరోగ్యభద్రతా కార్యకర్తలకు వారు చేసిన విశిష్ట సేవలకు గాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు-2020ని ప్రకటించారు.
***
(Release ID: 1755299)
Visitor Counter : 259