సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రధాని నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధిస్తాం; ఉత్తమ కేంద్ర పాలిత ప్రాంతంగా లఢఖ్‌ను తయారు చేస్తాం: జితేంద్ర సింగ్ లడఖ్ పై చర్చాగోష్టిప్రారంభ సమావేశంలో ప్రకటన


ఉమ్మడి అర్హతా పరీక్ష కేంద్రాలుగా ఇక లేహ్, కార్గిల్

Posted On: 09 SEP 2021 6:46PM by PIB Hyderabad

సివిల్ సర్వీస్ పరీక్ష రాయబోయే విద్యార్థులకోసం కొత్త కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్.కు కూడా ఓ ప్రత్యేక పరీక్షా కేంద్రం అందుబాటులోకి రాబోతోంది. లేహ్ నగరంలో ఏర్పాటుచేయబోయే ఈ పరీక్షా కేంద్రం వచ్చే నెలనుంచి పనిచేస్తుంది. వచ్చే నెలలో అక్కడ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. అలాగే, ఇటీవల ఏర్పాటైన జాతీయ నియామక సంస్థ నిర్వహించబోయే ఉమ్మడి అర్హతా పరీక్ష (సి.ఇ.టి.)కు కూడా లడఖ్.లో రెండు పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని లేహ్, కార్గిల్ జిల్లాలలో ఈ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. 

కేంద్ర సైన్స్ టెక్నాలజీ, భూగోళ విజ్ఞానం శాఖల (స్వతంత్రహోదా) సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష పరిశోధనా శాఖలను కూడా ఆయన సహాయ మంత్రి హోదాలో పర్యవేక్షిస్తున్నారు. లడఖ్ అధికారుల సామర్థ్య నిర్మాణంపై లేహ్ లో ఏర్పాటైన రెండు రోజుల చర్చాగోష్టిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ కోసం ప్రధానమంత్రి నిర్దేశించిన లక్ష్యాలన్నీ సకాలంలో సాకారమవుతాయని, దేశంలోనే ఉత్తమ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటిగా లడఖ్.ను తీర్చిదిద్దుతామని చెప్పారు. 2019 ఆగస్టు 5ల తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కారణంగా, కొత్త కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్.కు అన్ని కొత్త సదుపాయాలు సాకారమవుతున్నాయని, లడఖ్ అభివృద్ధి అజెండాపైనే ప్రధాని ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఉమ్మడి అర్హతా పరీక్ష (సి.ఇ.టి.) 2022 ప్రారంభంలో దేశవ్యాప్తంగా జరుగుతుందని, లడఖ్ పరిధిలోని లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో  కూడా ఈ పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఇప్పటివరకూ ఈ ఉద్యోగ నియామకాలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సి.), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (ఆర్.ఆర్.బి.లు), బ్యాంకింగ్ సిబ్బంది ఎంపిక సంస్థ (ఐ.బి.పి.ఎస్.) నిర్వహిస్తూ వచ్చాయన్నారు.  ఈ పరీక్ష నిర్వహణ కేవలం ప్రభుత్వ సంస్కరణ మాత్రమే కాక, మారుమూల ప్రాంతాల్లో ఉండే ఉద్యోగార్థులైన యువజనులకు భారీస్థాయి సామాజిక సంస్కరణ అవుతుందన్నారు. ఈచారిత్రాత్మక సంస్కరణతో అభ్యర్థులందరికీ వారి నేపథ్యం, సామాజిక, ఆర్థిక స్థాయితో నిమిత్తం లేకుండా సమాన అవకాశాలు లభిస్తాయన్నారు. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు భారీ ప్రయోజనం చేకూరుతుందని, పలు రకాల పరీక్షా కేంద్రాలకు ప్రయాణం చేసి, అనేక పరీక్షలకు హాజరయ్యే వారికి  కొత్త పరీక్షా కేంద్రాల ఏర్పాటు ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తుందని అన్నారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు.పి.ఎస్.సి.) కూడా ఈ సంవత్సరంనుంచి లేహ్ ప్రాంతంలో ఒక పరీక్షా కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తోందని, తొలిసారిగా ఇక్కడ సివిల్ సర్వీస్ (ప్రిలిమినరీ) పరీక్ష ఈ ఏడాదే జరగబోతోందని చెప్పారు. వచ్చే నెల అంటే, అక్టోబరు 10వ తేదీన ఈ పరీక్ష నిర్వహిస్తారన్నారు. దీనితో లడఖ్ ప్రాంతానికి చెందిన యువజనుల చిరకాలపు కల నెరవేరుతుందన్నారు. ఇప్పటివరకూ పలు రకాల అడ్డంకులు, అనిశ్చితమైన వాతావరణ కారణాల వల్ల వారంతా దేశం ఇతర ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేదని, అలాంటి వారికి ఇది గొప్ప సదుపాయమని మంత్రి చెప్పారు.

లెహ్ ప్రాంతానికి సమీపంలోని హాన్లేలో ఉన్న భారతీయ ఖగోళశాస్త్ర పరిశోధనాగారంలో నైట్ స్కై ప్లానెటేరియం ఏర్పాటు అంశాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పరిశీలిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. లడఖ్ ప్రాంతానికే ప్రత్యేకమైన లే బెర్రీ పండ్ల సాగును, వాణిజ్యాన్ని ప్రోత్సహించే ఒక ప్రణాళికను కేంద్ర విజ్ఞానశాస్త్ర, పారిశ్రామిక మండలి (సి.ఎస్.ఐ.ఆర్.) త్వరలోనే తీసుకువస్తుందని కేంద్రమంత్రి చెప్పారు. లడఖ్ ప్రాంతానికి, పరిసర ప్రాంతాలకు ప్రధానమంత్రి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. తొలిసారిగా మోదీ ప్రభుత్వ హయాంలోనే లడఖ్.కు విశ్వవిద్యాలయం, హోటల్ మేనేజిమెంట్ సంస్థ, వైద్య, ఇంజినీరింగ్ కళాశాల మంజూరయ్యాయని అన్నారు. లడఖ్ ప్రాంతాన్ని “కర్బన కాలుష్య రహితం” చేసేందుకు ప్రధాని ప్రకటించిన కార్యాచరణ ప్రణాళిక చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు.

2014 మే నెల 26న  ప్రధానమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం నరేంద్ర మోదీ అనేక సంస్కరణలు చేపట్టారని జితేద్ర సింగ్ చెప్పారు. మరింత సామర్థ్యం, పారదర్శకత, అవినీతి రహిత పరిపాలన, జవాబ్దారీ తనం, వివక్షకు తావియ్యకపోవడం వంటి సంస్కరణలను ఆయన గత ఏడేళ్లలో చేపట్టారన్నారు. పెనుమార్పులకు దారితీసేలా మోదీ చేపట్టిన అనేక సంస్కరణలను కేంద్రమంత్రి ప్రస్తావించారు. అధికారితపత్రాల ప్రతులను గెజిటెడ్ అధికారి చేత ధ్రువీకరించుకునే ఆనవాయితీ స్వస్తి చెప్పడం, అందుకు బదులుగా స్వీయ ధ్రువీకరణ పద్ధతిని ప్రవేశపెట్టడం,  కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) ఉద్యోగాలకు, గ్రూప్-సి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను, 2016 జనవరి 1వ తేదీనుంచి రద్దు చేయడం, 1988వ సంవత్సరపు అవినీతి నిరోధక చట్టానికి సవరణ చేయడం, ఐ.ఎ.ఎస్. అధికారులను సర్వీసు ప్రారంభంలో సహాయ కార్యదర్శులుగా 3 నెలలు కేంద్రప్రభుత్వంలో ఉంచడం వంటి పెను మార్పులను నరేంద్ర మోదీ చేపట్టారన్నారు. ఈ సంస్కరణలు, ఉత్తమ విధానాలన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన జమ్ము కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు 2019 ఆగస్టు 5నుంచి వర్తింపజేశారని అన్నారు. 

   చర్చాగోష్టిలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్.కె. మాథుర్ మాట్లాడుతూ,..లడఖ్ కొత్త కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించినప్పటినుంచి, లడఖ్ అభివృద్ధిపై దృష్టిని పెట్టేలా కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖనూ ప్రధానమంత్రి కార్యోన్ముఖం చేస్తున్నారని, ఇందుకు ఆయన వ్యక్తిగతంగా శ్రద్ధ చూపుతూ వస్తున్నారని చెప్పారు. లడఖ్.లో కొత్త తరహా పరిపాలనా వ్యవస్థను సంపూర్ణంగా నిర్మించడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయన్నారు. అధికారులకు కొరత ఉందని, వారు కూడా కొత్త చట్టాలను, నిబంధనలను, పద్ధతులను అవగాహన చేసుకోవాల్సి ఉందని మాథుర్ అన్నారు. అధికారుల సామర్థ్యాల నిర్మాణంపైచర్చాగోష్టి నిర్వహించిన పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార శాఖ (డి.ఎ.ఆర్.-పి.జి.)ను ఆయన అభినందించారు. కొత్త కేంద్ర పాలిత ప్రాంతం అధికారులకు శిక్షణను అందించడంలో ఈ చర్చాగోష్టి విస్తృతంగా ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార, పర్యవేక్షక కేంద్రీకృత వ్యవస్థ (సి.పి. గ్రామ్స్) ద్వారా లడఖ్ లోని ప్రతి పౌరుడూ తన సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు.

డి.ఎ.ఆర్.-పి.జి. కార్యదర్శి సంజయ్ సింగ్ మాట్లాడుతూ,..సామర్థ్యాల నిర్మాణంపై లడఖ్.లో చర్చాగోష్టి జరగడం ఇదే తొలిసారని, ప్రభుత్వ అధికారులకు తగిన సాధికారత కల్పించేందుకు ఈ చర్చాగోష్టి ఎంతగానో దోహదపడుతుందని, దీనితో,.. కేంద్ర ప్రభుత్వ చట్టాలు, ఆర్థిక నిర్వహణా ప్రక్రియ, కేంద్ర సెక్రటేరియట్ నియమావళి వంటి వాటితో అధికారులకు పూర్తి అవగాహన ఏర్పడుతుందని అన్నారు. ఇ-ఆఫీస్, ప్రభుత్వ ఈ మార్కెటింగ్, డిజిటల్ పరిపాలనా ప్రక్రియ వంటి వాటితో కూడా వారికి అవగాహన కలుగుతుందన్నారు. సంస్కరణల్లో ప్రధాని పేర్కొన్న మూడు సూత్రాలను సంజయ్ సింగ్ ప్రస్తావించారు. కనీస ప్రభుత్వం, గరిష్ట స్థాయి పరిపాలన, నిబంధనల ఆధారిత వైఖరి కాకుండా, వ్యక్తిగత ప్రమేయంతో కూడిన వైఖరిని పాటించడం, రేపటి తరం సంస్కరణలు అనుసరించడం వంటి సూత్రాలను ఆయన ప్రస్తావించారు. పరిపాలనా వ్యవస్థలో కొత్తదనాన్ని తెచ్చేందుకు ఈ సూత్రాలు దోహదపడతాయన్నారు.

డి.ఎ.ఆర్.-పి.జి. అదనపు కార్యదర్శి వి. శ్రీనివాస్, లేహ్.లోని లడఖ్ పర్వతప్రాంత అభివృద్ధి మండలి (ఎల్.ఎ.హెచ్.డి.సి.) చీఫ్ కార్యనిర్వహణా కౌన్సిలర్ తాషీ గ్యాల్సన్, కార్గిల్ లోని ఎల్.ఎ.హెచ్.డి.సి. చీఫ్ కార్యనిర్వహణా కౌన్సిలర్ ఫిరోజ్ అహ్మద్ ఖాన్ కూడా ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు. లడఖ్ కమిషనర్/కార్యదర్శి అజీత్ కుమార్ సాహూ వందన సమర్పణ చేశారు.

*****(Release ID: 1754007) Visitor Counter : 315


Read this release in: English , Urdu , Hindi