బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎక్సకవేషన్ ఇంజనీర్‌గా సిసిఎల్ వారి రాజ్‌రప్ప ప్రాజెక్టులో శివాని మీనా చేరినందుకు అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి
బొగ్గు పరిశ్రమలో మహిళలు మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అడ్డంకులు తొలగడం కొనసాగుతోంది
ఒపెన్ కాస్ట్ బొగ్గుగనిలో తొలి ఎక్సకవేషన్ ఇంజనీరుగా చేరిన శివానీ మీనా
Posted On:
10 SEP 2021 5:07PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కింద గల సిసిఎల్- సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో తొలి ఎక్సకవేషన్ ఇంజనీరుగా కుమారి శివాని మీనా చేరడం పట్ల కేంద్ర బొగ్గు,గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఆమెను అభినందించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ ద్వారా ఆయన ఒక సందేశం ఇస్తూ, శివానీ మీనా సిసిఎల్ లో చేరికతో, మరింత మంది మహిళలు ఈ రంగంలో చేరేందుకు స్ఫూర్తి దాయకం కాగలదని ఆయన అన్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరాని కూడా శివాని సాధించిన విజయాన్ని అభినందించారు.
కుమారి శివాని మీనా, సిసిఎల్ వారి రాజ్‌రప్ప మెకనైజ్డ్ ఓపెన్ కాస్ట్ బొగ్గుగని ప్రాజెక్టులో ఎక్సకవేషన్ ఇంజనీర్‌గా చేరారు. ఒపెన్ కాస్ట్ బొగ్గుగనిలో ఎక్సకవేషన్ కేడర్‌లో ఇంజనీర్‌గా ఒక మహిళ చేరడం ఇదే మొదటి సారి. ఆ ఘనతను శివాని సాధించారు. భారీ యంత్రపరికరాల నిర్వహణ, రిపేర్లకు సంబంధించిన బాధ్యతలను ఆమెకు అప్పగించడం జరిగింది. సిసిఎల్ కంపెనీకి రాజ్‌రప్ప ఒక ప్రధానమైన ఓపెన్ కాస్ట్ బొగ్గుగని ప్రాజెక్టు. రాజ్‌రప్ప ప్రాంతానికి స్వచ్ఛతా మిషన్ కింద అద్భుత పనితీరు ప్రదర్శించినందుకు అవార్డు గెలుచుకుంది.
శివానీ మీనా రాజస్థాన్ లోని భరత్‌పూర్ కు చెందినవారు. ఆమె ఐఐటి జోధ్‌పూర్‌నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తన విజయానికి కుటుంబ సభ్యుల నిరంతర ప్రోత్సాహం, ప్రేరణ కారణమని ఆమె చెప్పారు. కోల్ ఇండియా లిమిటెడ్‌లో పనిచేయడం అంటే తను ఇంతకాలం చేసిన కృషికి ఫలితం దక్కినట్టు అని , తన వైపునుంచి సంస్థకు అత్యుత్తమ సేవలు అందించగలనని ఆమె తెలిపారు.
*****
(Release ID: 1753985)
Visitor Counter : 191