ఆయుష్
‘వై-బ్రేక్’ యోగా విధాన అనువర్తనాన్ని నలుగురు కేంద్ర మంత్రులతో కలసి ప్రారంభించిన సర్బానంద సోనోవాల్
అనువర్తన సూచిత ఆసనాలను ప్రదర్శించిన మంత్రులు... సభికులు;
‘ఇది దావానలంలా వ్యాప్తి చెందుతుంది’: కిరణ్ రిజిజు
Posted On:
01 SEP 2021 8:46PM by PIB Hyderabad
ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తూ, బుధవారం విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మరో నలుగురు మంత్రిమండలి సహచరులతో కలసి ‘వై-బ్రేక్’ అనువర్తనాన్ని ప్రారంభించారు. కాగా, ఈ అనువర్తనం రూపకల్పనలో ఆయుష్ మంత్రిత్వశాఖ కృషిని ప్రశంసిస్తూ ఇది “దావానలంలా వ్యాప్తి చెందుతుంది” అని మంత్రులలో ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖ్యంగా వృత్తి నిపుణులను దృష్టిలో పెట్టుకుని కొన్ని ‘ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం’తో కూడిన ఐదు నిమిషాల విధానంతో ఈ అనువర్తనం రూపొందించబడింది. ఈ స్వల్పవ్యవధి కసరత్తుతో పని ప్రదేశాల్లో ఒత్తిడి తొలగి, ప్రశాంతత చేకూరడంవల్ల వారు తిరిగి తమ విధుల్లో నిమగ్నమై, తమ ఉత్పాదకను పెంచుకోగలుగుతారు.
ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ యోగావల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ- “కార్పొరేట్ రంగంలో వృత్తి నిపుణులు తరచూ వృత్తిగతంగా ఒత్తిడికి లోనవడమేగాక శారీరకంగానూ సమస్యలు ఎదుర్కొంటారన్నది మనకు తెలిసిందే. ఇటువంటి సమస్యలు ఇతర వృత్తుల్లో ఉంటాయన్నది కూడా వాస్తవమే... ఈ నేపథ్యంలో పని ప్రదేశాల్లో ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు ఉపశమనం కల్పించే విధంగా ‘వై-బ్రేక్’ రూపొందించబడింది. ఈ ‘వై-బ్రేక్’ అనువర్తనాన్ని చిత్తశుద్ధితో వినియోగిస్తే ప్రజల ఆరోగ్య నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించగలదనడంలో సందేహం లేదు” అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చట్టం-న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు; శాస్త్ర-సాంకేతిక-భూవిజ్ఞాన శాఖ సహాయ (ఇన్‌చార్జి)మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్; విదేశీ వ్యవహారాలు-సాంస్కృతిక శాఖ సహాయమంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి; ఆయుష్-మహిళా/శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ కలుభాయ్ కూడా పాల్గొన్నారు.
యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపుపై శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ- “యోగా నేడు అంతర్జాతీయంగా విశేష ప్రాచుర్యం పొందింది. భూగోళంలో దాదాపు ప్రతిచోటకూ ఇది విస్తరించింది. ప్రపంచ ప్రజానీకం ఏదో ఒక రూపంలో యోగాను ఆచరిస్తున్నారు. ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా ఎంతో ప్రయోజనకరం. ప్రాచీన భారతంలో యోగాభ్యాసం భావన అటు వైద్యం/ఆరోగ్యం లేదా విద్య/కళలు తదితర రంగాలకు సంబంధించి భారతీయ సమాజంలోని వివిధ అంశాలను ఎంతగానో ప్రభావితం చేసింది” అని పేర్కొన్నారు.
డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ ప్రసంగిస్తూ- “యోగా బ్రేకప్ అనువర్తనం ఎంత ప్రభావశీలమైనదో మీరంతా స్వయంగా చూశారు. దీన్ని రూపొందించడంలో ఎంత లోతైన పరిశోధన, అనుభవజ్ఞుల ఆలోచనలు ఇమిడి ఉన్నాయో కూడా మీరు గమనించారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రయోగాలు, పరీక్షలు నిర్వహించబడ్డాయి. అలాగే మన శరీరంలోని వివిధ కోశాలపై దీని ప్రభావం గురించి కూడా లోతుగా చర్చించబడింది” అని తెలిపారు. ఆయన తన ప్రసంగం కొనసాగిస్తూ- “విభిన్న యోగా పద్ధతుల గురించి ఈ ‘వై-బ్రేక్’ అనువర్తనం అవగాహన కల్పించడంతోపాటు ఏ సమయంలోనైనా సులువుగా యోగాభ్యాసం చేసేందుకు తోడ్పడుతుంది” అన్నారు.
శ్రీమతి మీనాక్షి లేఖి మాట్లాడుతూ- “మానవాళి సుస్థిర జీవనస్థాయిని సాధించడంలో ఈ ‘వై-బ్రేక్’ అనువర్తనం గణనీయంగా దోహదపడుతుంది” అన్నారు. మన జీవితాల్లో ఒత్తిడిని తగ్గించడంలో తన పాత్ర ఎంత ముఖ్యమైనదో ‘వై-బ్రేక్’ కచ్చితంగా రుజువు చేసుకుంటుందని ఆమె చెప్పారు.
శాస్త్ర-సాంకేతిక-భూవిజ్ఞాన శాఖ సహాయ (ఇన్‌చార్జి)మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ- “యోగాకు ప్రాచుర్యం కల్పించడంలో మనం డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ఎంతైనా హర్షణీయం. పని ప్రదేశాల్లో ప్రతి ఒక్కరి సద్వినియోగం దిశగా ఐదు నిమిషాలపాటు యోగాభ్యాసం చేసేందుకు వీలు కల్పిస్తూ చట్టం చేయాలని ఈ సందర్భంగా నేను కేంద్ర న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను” అన్నారు.
కేంద్ర చట్టం-న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు మాట్లాడుతూ- “ఆయుష్ మంత్రిత్వశాఖ యోగాను ఎంతో సరళమైన మార్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తుండటం ప్రశంసనీయం. ఈ మేరకు ‘వై-బ్రేక్’ అనువర్తనం కచ్చితంగా దావానలంలా వ్యాప్తి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను” అన్నారు.
భారత స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవాల నేపథ్యంలో చేపట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాల్లో భాగంగా అనువర్తన ప్రారంభోత్సవం నిర్వహించబడింది. ఈ మేరకు ‘వై-బ్రేక్’కు శ్రీకారం సహా వివిధ కార్యకలాపాల నిర్వహణ కోసం ఆయుష్ మంత్రిత్వశాఖకు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 5 వరకూ వారం రోజుల సమయం ఇవ్వబడింది. తదనుగుణంగా ఆయుష్ విధానాలపై పాఠశాలల్లో అవగాహన శిబిరాలు, ‘అశ్వగంధ’ను రోగనిరోధక ఔషధంగా పరిచయం చేయడం, రైతులతోపాటు ప్రజలకు ఔషధ మొక్కల పంపిణీ తదితర కార్యకలాపాలను చేపట్టారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులుసహా ఆహూతులందరూ లయబద్ధంగా, ఆకట్టుకునే రీతిలో యోగాసనాలు వేయడం విశేషం. ఈ మేరకు మొబైల్ అనువర్తనంలో సూచించిన ఐదు నిమిషాల యోగా పద్ధతులను వారుందరూ ప్రదర్శించారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులుసహా స్వయంప్రతిపత్తి సంస్థల ప్రతినిధులు, ‘అసోచామ్, సీఐఐ, ఫిక్కి’ వంటి పారిశ్రామిక సంఘాల సభ్యులు తదితర ప్రముఖులు అనేకమంది దృశ్యమాధ్యమం ద్వారా ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే యోగా-నేచురోపతి సంస్థలు, విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు-యోగా కేంద్రాలు, యోగాభ్యాసకులు, మేధావులు, విధాన రూపకర్తలు, అధికారులు, ఔత్సాహిక యోగాభ్యాసకులు, నిపుణులు, వివిధ అనుబంధ శాస్త్రాల నిపుణులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు.
పవిత్ర జ్యోతిని వెలిగించి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ‘వై-బ్రేక్’ అనువర్తనానికి సంబంధించి ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రత్యేకాధికారి (ఆయుష్ గ్రిడ్) డాక్టర్ లీనా ఛాత్రే సాంకేతిక ప్రదర్శన ఇచ్చారు. అలాగే మొరార్జీ దేశాయ్ నేషనల్ యోగా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ వి.బసవారెడ్డి యోగాసనాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ‘వై-బ్రేక్’ అనువర్తనంలో కింద సూచించిన కొన్ని సాధారణ యోగాసన పద్ధతులున్నాయి:
వృక్షాసనం - ఊర్ధ్వహస్త ఉత్థాన ఆసనం - వృక్షాసనం
స్కంధ చక్ర - ఉత్ధాన మండూకాసనం - కటి చక్రాసనం
అర్థ చక్రాసనం - ప్రసరిత పాదోత్థాన ఆసనం - దీర్ఘశ్వాస
నాడీ శోధన ప్రాణాయామం
భ్రమరీ ప్రాణాయామం - ధ్యానం
ఈ ఆసనాలతో కూడిన విధానాన్ని 2020 జనవరిలో వివిధ భాగస్వాముల సహకారంతో ప్రయోగాత్మకంగా ఆరు మహానగరాల్లో ప్రారంభించారు. తదనుగుణంగా దేశంలోని ఆరు ప్రముఖ యోగా సంస్థలతో సంయుక్తంగా మొరార్జీ దేశాయ్ నేషనల్ యోగా ఇన్‌స్టిట్యూట్ 15 రోజులపాటు పరీక్షాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి 717 మంది పాల్గొన్న ఈ ప్రయోగాత్మక కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది. దీనికి సంబంధించి ఎంతో ప్రోత్సాహకరమైన విశ్లేషణ లభించింది.
ఈ ‘వై-బ్రేక్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా, ప్రత్యేక కార్యదర్శి శ్రీ ప్రమోద్ కుమార్ పాఠక్, సంయుక్త కార్యదర్శి శ్రీ డి.సెంథిల్ పాండియన్; ఈ శాఖ పరిధిలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ యోగా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ వి.బసవారెడ్డి, ఆయుష్ డైరెక్టర్ శ్రీ విక్రమ్ సింగ్ తదితర, ఇతర మంత్రిత్వశాఖల సీనియర్ అధికారులుసహా ఆయుష్ పరిధిలోని జాతీయ సంస్థలు, పరిశోధక మండళ్ల అధికారులు, అనేకమంది ప్రముఖులు, నిపుణులు కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 1751342)
Visitor Counter : 247