బొగ్గు మంత్రిత్వ శాఖ
సిబ్బంది మొత్తానికి కోవిడ్ -19 టీకా వేయించిన మొట్టమొదటి పిఎస్ యు ఎన్ సి ఎల్
Posted On:
24 AUG 2021 5:24PM by PIB Hyderabad
కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ( ఎన్ సి ఎల్ ) తన సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులందరికీ కోవిడ్ -19 టీకాను వేయించింది. ఈ పని చేయడంలో దేశంలోనే మొదటి పిఎస్ యుగా రికార్డు నమోదు చేసింది. ఈ కంపెనీలో పూర్తి స్థాయిలో 13 వేల మంది సిబ్బంది పని చేస్తుండగా 16 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్నారు. ఇక ఈ కంపెనీ సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యులు 20 వేల మందిదాకా కంపెనీ చుట్టుపక్కల నివసిస్తున్నారు.
కనీ వినీ ఎరగని కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా తమ సిబ్బంది ఇరవై నాలుగు గంటలూ పని చేసి దేశానికి అవసరమయ్యే బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూశారని ఎన్ సి ఎల్ సిఎండి శ్రీ ప్రభాత్ కుమార్ సిన్హా అన్నారు. వారే మా అసలైన ఆస్తి, వారితోపాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామని, టీకా వేయించడంలో ఎక్కడా రాజీపడకుండా కృషి చేశామని ఆయన వివరించారు.
స్థానిక అధికారుల పూర్తి స్థాయి మద్దతుతో ఎన్ సి ఎల్ కంపెనీ తన సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేయించింది. అంతే కాదు ఇందుకోసం తన స్వంత వనరులను కూడా వినియోగించి అందరికీ టీకా లభించేలా చూసింది. ఈ లక్ష్యాన్ని సాధించడంకోసం పలు వర్గాల సిబ్బందిని గుర్తించి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి, ఇంటింటికీ తిరిగి, ప్రచారం చేశారు. అనుకున్న ప్రకారం అందరికీ టీకాలు వేయించారు.
కంపెనీ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు టీకా మొదటి డోసు పూర్తయిందని, రెండో డోసు వేసే పనిని కూడా మొదలుపెట్టామని ఎన్ సి ఎల్ జనరల్ మేనేజర్ (సిబ్బంది) శ్రీ ఛార్లెస్ జస్టర్ అన్నారు. ఇప్పటికే కంపెనీ 30 వేల డోసుల టీకాను సమకూర్చుకుందని దాంతో మొదటి డోసు పూర్తి చేసి మిగిలిపోయిన డోసులతో రెండో డోసు కార్యక్రమాన్ని మొదలుపెట్టామని ఆయన అన్నారు. రెండో డోసు కార్యక్రమాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఎన్ సి ఎల్ అనేది సింగ్రౌలికి చెందిన భారత ప్రభుత్వ మినీ రత్న కంపెనీ. ఉన్నత స్థాయి యాంత్రిక వ్యవస్థతో పది ఓపన్ కాస్ట్‌బొగ్గు గనుల్లో అది పని చేస్తోంది. జాతీయ బొగ్గు ఉత్పత్తిలో 15 శాతం వాటాను ఎన్ సిఎల్ కలిగి వుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ కంపెనీ 115 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.
***
(Release ID: 1748866)
Visitor Counter : 151