శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ వైరస్ నిరోధానికి దేశంలోనే తొలి ఆర్.ఎన్.ఎ. ఆధారిత టీకా!

సురక్షితమైనదిగా ప్రయోగాత్మక పరీక్షల్లో నిర్ధారణ
డి.సి.జి.ఐ ఆమోద ముద్ర..., 2వ, 3వ దశ ట్రయల్స్.కు ఓకె.

మిషన్ కోవిడ్ సురక్షా పథకం కింద డి.బి.టి.-బి.ఐ.ఆర్.ఎ.సి.
భాగస్వామ్యంతో తొలి ఆర్.ఎన్.ఎ. ఆధారిత వ్యాక్సీన్

Posted On: 24 AUG 2021 3:07PM by PIB Hyderabad

మన శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే ప్రతిరక్షక కణాల (యాంటీబాడీస్) ఉత్పత్తి వెంటనే జరిగేలా రోగ నిరోధక శక్తిని తట్టిలేపే ఎం.ఆర్.ఎన్.ఎ. ఆధారిత వ్యాక్సీన్ తొలిదశ ప్రయోగాత్మక పరీక్షల సమాచారం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సి.డి.ఎస్.సి.ఒ.)కు చేరింది. దేశంలోనే తొలి ఆర్.ఎన్.ఎ. ఆధారిత వ్యాక్సీన్.గా  పేర్కొనదగిన ఈ టీకా మందు మొదటి దశ క్లినికల్ పరీక్షల డాటాను పుణెకి చెందిన జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ సంస్థ సమర్పించింది.

  హెచ్.జి.సి.ఒ.19 పేరిట సమర్పించిన ఈ కోవిడ్ వ్యాక్సీన్ డాటాను వ్యాక్సీన్ నిపుణుల కమిటీ (ఎస్.ఇ.సి.) సమీక్షించింది. ఇది సురక్షితమైనదిగా నిపుణుల కమిటీ తన సమీక్షలో నిర్ధారించింది. క్లినికల్ పరీక్షల్లో పాల్గొన్న వారిలో రోగనిరోధక శక్తిని కూడా ఇది బాగా ప్రతిస్పందింపజేయగలిగినట్టు నిపుణుల కమిటీ పేర్కొంది.

  మరో వైపు ప్రతిపాదిత రెండవదశ, 3వ దశ అధ్యయన వివరాలను కూడా జెన్నోవా సంస్థ సమర్పించింది. ప్రయోగాత్మక పరీక్షల దశలో ఉన్న హెచ్.జి.సి.ఒ.19  వ్యాక్సీన్ ఆరోగ్యరీత్యా సురక్షితమైనదేనా,..  భరించదగినదేనా,... అన్న అంశాలను అంచనా వేయడానికి వీలుగా ఈ వివరాలను జెన్నోవా కంపెనీ సమర్పించింది. ఈ వివరాలకు భారతీయ ఔషధ నియంత్రణాధికారి (డి.సి.జి.ఐ.), సి.డి.ఎస్.సి.ఒ. నుంచి కూడా ఆమోద ముద్ర లభించింది.

   ఈ వ్యాక్సీన్ రెండవ దశ క్లినికల్ ప్రయోగాత్మక పరీక్షలు దేశంలో 10నుంచి 15చోట్ల, 3వ దశ ప్రయోగాత్మక పరీక్షలు 22నుంచి 27 చోట్ల జరుగుతాయి. ఈ రెండు దశలకు సంబంధించిన అధ్యయనానికి కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.)-భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.)కి చెందిన ప్రయోగాత్మక పరీక్షల వ్యవస్థను వినియోగించుకోవాలని జెన్నోవా కంపెనీ సంకల్పించింది.

  ఆర్.ఎన్.ఎ. ప్రొటీన్ ఆధారంగా పనిచేసే కోవిడ్ ను  రూపకల్పన చేసేందుకు జెన్నోవా చేపట్టిన పరిశోధనా కార్యక్రమానికి కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.) పాక్షికంగా నిధులందిస్తోంది. ఇండ్ సెపి కార్యక్రమం కింద 2020 జూన్ నెలనుంచి ఈ మద్దతు అందిస్తోంది. బయోటెక్నాలజీ పారిశ్రామిక పరిశోధనా సహాయ మండలి (బి.ఐ.ఆర్.ఎ.సి.) అమలు చేసే మిషన్ కోవిడ్ సురక్షా పథకం కింద కూడా డి.బి.టి. ఈ కార్యక్రమానికి మద్దతు అందిస్తోంది.

   డి.బి.టి. కార్యదర్శి, బి.ఐ.ఆర్.ఎ.సి. చైర్ పర్సన్ అయిన డాక్టర్ రేణు స్వరూప్ ఈ సందర్ధంగా మాట్లాడుతూ, మనదేశానికి చెందిన తొలి ఎం.ఆర్.ఎన్.ఎ. ఆధారిత వ్యాక్సీన్ సురక్షితమైనదిగా నిర్ధారణ కావడం, ఈ వ్యాక్సీన్ 2వ, 3వ దశ ప్రయోగాత్మక పరీక్షలకు డి.డి.సి.ఐ. ఆమోద తెలపడం మనం ఎంతో గర్వించదగిన విషయమన్నారు. భారతదేశంతో పాటు మొత్తం ప్రపంచానికే ఇది చాలా ముఖ్యమైన వ్యాక్సీన్ అవుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సీన్ రూపకల్పన కోసం మనం చేపట్టిన కార్యక్రమంలో ఇది చాలా ముఖ్యమైన పరిణామం. కొత్త తరహా వ్యాక్సీన్ల రూపకల్పనకోసం  ప్రపంచ వ్యాప్తంగా జరిగే కృషిలో ఈ పరిశోధన, మనదేశాన్ని ప్రపంచపటంలోనే అగ్రస్థానంలో నిలుపుతుంది.” అని ఆమె అన్నారు.

  జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ సింగ్ మాట్లాడుతూ, హెచ్.జి.సి.ఒ.19 అనే తమ ఆర్.ఎన్.ఎ. ఆధారిత వ్యాక్సీన్ సురక్షితమైనదని తొలిదశ ప్రయోగాత్మక పరీక్షల్లో నిర్ధారణ అయిన అనంతరం, రెండవ, 3వ దశ ప్రయోగాత్మక పరీక్షలను ప్రారంభించే అంశంపై జెన్నోవా తన దృష్టిని కేంద్రీకరించిందన్నారు. మరో వైపు,.దేశం అవసరాలకు తగినట్టుగా వ్యాక్సీన్ తయారీని పెంచేందుకు వీలుగా జెన్నోవా సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు.

 

Text Box:     For Further Information: Contact Communication Cell of DBT/BIRAC 	@DBTIndia @BIRAC_2012    www.dbtindia.gov.in www.birac.nic.in

 

 

డి.బి.టి. గురించి...

  కేంద్ర శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞాన శాఖ పరిధిలో పనిచేసే కేంద్ర బయోటెక్నాలజీ శాఖ దేశవ్యాప్తంగా జరిగే బయో టెక్నాలజీ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహిస్తూ వస్తోంది. వ్యవసాయం, ఆరోగ్యరక్షణ, జంతు శాస్త్ర రంగం, పర్యావరణం, పరిశ్రమల్లో ఈ పరిశోధనా ఫలితాలను అమలు చేసేందుకు కృషి చేస్తోంది.

 

బి.ఐ.ఆర్.ఎ.సి. గురించి...

  బయో టెక్నాలజీ పారిశ్రామిక పరిశోధనా సహాయ మండలి (బి.ఐ.ఆర్.సి.) లాభాపేక్షలేని ప్రభుత్వ రంగ సంస్థ. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.) ఈ సంస్థను ఏర్పాటు చేసింది. దేశంలో బయోటెక్నాలజీ పరిశ్రమను విస్తృతం చేసేందుకు, సంబంధిత ప్రయోగాలను ప్రోత్సహించేందుకు ఒక ఏజెన్సీగా బి.ఐ.ఆర్.ఎ.సి. వ్యవహరిస్తోంది. దేశం అవసరాలకు తగినట్టుగా  బయోటెక్నాలజీ సంబంధమైన వ్యూహాత్మక, అభివృద్ధి కార్యకలాపాలను అమలు చేసే కృషిలో ఈ సంస్థ పాలు పంచుకుంటోంది.

 

 

జెన్నోవా గురించి...

  ఎమ్.క్యూర్ కంపెనీల గ్రూపునకు చెందిన జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్  లిమిటెడ్ అనే  బయోటెక్నాలజీ కంపెనీ,.. పుణె నగరం ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. జీవసంబంధమైన పరిజ్ఞానంతో రోగ చికిత్సా అంశాలపై అధ్యయనంకోసం ప్రధానంగా పరిశోధనలు సాగిస్తోంది. ప్రాణాంతకమైన వివిధ వ్యాధులపై జీవ పరిజ్ఞాన సంబంధమైన చికిత్సా పద్ధతుల రూపకల్పన, ఉత్పత్తి, వాణిజ్యీకరణ వంటి అంశాలపై ఈ సంస్థ కృషి చేస్తోంది. మరిన్ని వివరాలకోసం, ఇంటర్నెట్లో https://gennova.bio అన్న లింకును సందర్శించవచ్చు.

 

<><><><>



(Release ID: 1748602) Visitor Counter : 214