భారత ఎన్నికల సంఘం
దక్షిణాసియా ఎన్నికల నిర్వహణ సంస్థల ఫోరమ్ 11వ వార్షిక సమావేశం-2021ని (ఫెమ్ బోసా) ప్రారంభించిన సిఇసి
ఫెంబోసా అధ్యక్ష స్థానాన్ని 2021 సంవత్సరానికి భూటాన్ ఎన్నికల సంఘానికి అప్పగించిన ఇసిఐ
ఫెంబోసా సభ్య దేశాలకు సామర్థ్య నిర్మాణ కోర్సులను కొనసాగించనున్న ఇసిఐ & ఐఐఐడిఇఎం
Posted On:
11 AUG 2021 6:45PM by PIB Hyderabad
భారత ఎన్నికల కమిషనర్, ఫెంబోసా ప్రస్తుత చైర్మన్ శ్రీ సుశీల్ చంద్ర ఎన్నిక కమిషనర్లు శ్రీ రాజీవ్ కుమార్, శ్రీ ఎసి పాండేలతో కలిసి దక్షిణాసియా దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థల ఫోరమ్ 11వ వార్షిక సమావేశం-2021ని ప్రారంభించారు. భూటాన్ ఎన్నికల కమిషన్ వర్చువల్ విధానంలో ఈ సమావేశం నిర్వహించింది. భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక దేశాల ప్రతినిధివర్గాలు ఒక రోజు పాటు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
ఫెంబోసా ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలకు చెందిన అతి పెద్ద భాగానికి ప్రతినిధి అని, ఎన్నికల నిర్వహణ సంస్థల క్రియాశీల ప్రాంతీయ సహకార సంస్థ అని శ్రీ సుశీల్ చంద్ర అన్నారు. సంస్థ లోగోలోని ముత్యాలు పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, ప్రజాస్వామ్యం, సహకారం వంటి అత్యున్నత విలువకు చిహ్నమని ఆయన అన్నారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభణలో ఉన్న అత్యంత సంక్లిష్ట సమయంలో కూడా బీహార్ లో 2020 నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, 2021 మార్చి/ ఏప్రిల్ నెలల్లో అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలోని అనుభవాలను శ్రీ సుశీల్ చంద్ర వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, ఎన్నికల నిర్వహణలో వాటి ప్రభావం మనందరికీ కీలక ప్రాధాన్యం గల అంశాలని శ్రీ చంద్ర అన్నారు. ఎన్నికల్లో మరింత అధిక భాగస్వామ్యం సాధించేందుకు, అందరికీ అందుబాటులో ఉంచేందుకు, పారదర్శకతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించామని ఆయన చెప్పారు.
"ఎన్నికల నిర్వహణలో టెక్నాలజీ" వినియోగం ఈ సమావేశం ప్రధాన అంశం. టెక్నాలజీలో వచ్చిన వివిధ మార్పులను ఉపయోగించుకుని ఇసిఐ పలు ప్రక్రియలను డిజిటైజ్ చేసిందని శ్రీ సుశీల్ చంద్ర తెలిపారు. ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభ సమయంలో వ్యక్తుల మధ్య కాంటాక్టును తగ్గించడంలో టెక్నాలజీ సంబంధిత విధానాలు ఎంతో ప్రాముఖ్యత గలవిగా మారాయని ఆయన చెప్పారు. ఫెంబోసా సభ్య ఇఎంబిలతో మరింతగా సంప్రదింపులు జరిపి, సంస్థను పటిష్ఠం చేయడానికి, ఫోరమ్ లక్ష్యాలకు దీటుగా కార్యకలాపాల ప్రోత్సాహానికి, సభ్యదేశాల మధ్య సహకారం విస్తరించడం ద్వారా నైపుణ్యాలు, సామర్థ్యాల నిర్మాణం విషయంలో తోటి ఇఎంబిలను సాధికారం చేయడానికి ఇసిఐ ఎదురు చూస్తున్నదని శ్రీ చంద్ర చెప్పారు. ఫెంబోసా చార్టర్ ఆదర్శాలు, లక్ష్యాలను మరింత ముందుకు నడిపించడానికి ఇసిఐ కట్టుబాటును ఆయన పునరుద్ధరించారు.
2020 జనవరి నుంచి 2021 జూలై నెలల మధ్య కాలంలో ఇసిఐ చైర్మన్ గా వ్యవహరించిన కాలంలో ఫెంబోసా కార్యకలాపాల నిర్వహణలో నాయకత్వ నివేదికను ఇసిఐ సెక్రటరీ జనరల్ శ్రీ ఉమేశ్ సిన్హా సమర్పించారు. 2020 జనవరి 24వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ఫెంబోసా 10వ సమావేశంలో ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించినట్టు ఆయన చెప్పారు.
భూటాన్ సిఇసి దశో సోనం టోప్ గే ఫోరమ్ చైర్ పర్సన్ బాధ్యతలను ఆమోదిస్తూ భూటాన్ ఎన్నికల కమిషన్ పై ఉంచిన విశ్వాసం, నమ్మకానికి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సార్క్ దేశాలకు చెందిన ఎన్నికల నిర్వహణ వ్యవస్థల మధ్య నిరంతర సంప్రదింపులు నిర్వహించడం; సార్క్ దేశాలకు చెందిన వివిధ ఎన్నికల నిర్వహణ సంస్థలు ఫెంబోసా లక్ష్యాలను ముందుకు నడిపించడం; ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పక్షపాత రహితంగా నిర్వహించడంలో ఒకరి అనుభవాల నుంచి మరొకరు పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా పరస్పర అభిప్రాయాలు మార్పిడి చేసుకోవడం అనే ఫెంబోసా లక్ష్యాలను ముందుకు నడపడానికి భూటాన్ అధిక అంకిత భావంతో కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుత మహమ్మారి కాలంలో చైర్మన్ అధికార కాలాన్ని రెండు సంవత్సరాలకు పొడిగించేందుకు ప్రతిపాదించిన థింపు తీర్మానాన్ని ఫెంబోసా సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఫెంబోసా సభ్యదేశాల సామర్థ్యాల అభివృద్ధికి ఇసిఐ, ఐఐఐడిఇఎం చేసిన కృషిని ఆ తీర్మానం ప్రశంసించింది. పరస్పర సహకారం, మద్దతు స్ఫూర్తితో సభ్యదేశాలకు అవసరమైన కార్యక్రమాలను నిరంతరం నిర్వహించనున్నట్టు ఐఐఐడిఇఎం, ఇసిఐ ప్రకటించాయి.
ఫెంబోసా లక్ష్యాలు ముందుకు నడిపించడానికి ఇసిఐ కట్టుబాటును శ్రీ సుశీల్ చంద్ర ముగింపు సందేశంలో పునరుద్ఘాటించారు. ఫోరమ్ సభ్యదేశాలకు ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి, కొత్త అనుభవాల నుంచి లాభం పొందేందుకు పరస్పర ఆసక్తి గల అంశాలు పంచుకునేందుకు ఫెంబోసా చక్కని వేదికగా నిలుస్తుందని శ్రీ చంద్ర అన్నారు. ఈ సమావేశంలో జరిగిన చర్చలు ప్రయోజనకరంగా, ఉత్పాదకంగా, అందరూ పాలు పంచుకునేలా ఉన్నాయని శ్రీ చంద్ర ప్రశంసించారు.
(Release ID: 1745058)
Visitor Counter : 208