నౌకారవాణా మంత్రిత్వ శాఖ

తొలి సముద్ర ప్రయోగం కోసం బయలుదేరిన స్వదేశీ విమాన వాహక నౌక ‘విక్రాంత్’


ప్రధానమంత్రి ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కు నిదర్శనంగా వర్ణించిన శ్రీ సోనోవాల్

Posted On: 04 AUG 2021 2:07PM by PIB Hyderabad

 స్వదేశంలో నిర్మించిన  అత్యంత క్లిష్టమైన యుద్ధనౌక విక్రాంత్’ సముద్ర ప్రయోగం కోసం బయలుదేరడం పట్ల కేంద్ర రేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ హర్షం వ్యక్తం చేశారు. భారత నావికా దళం కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ 'విక్రాంత్'ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో  నిర్మించింది. అత్యంత క్లిష్టమైన నౌకను దేశంలో రూపొందించి నిర్మించడం  ఇదే తొలిసారి అని శ్రీ సోనోవాల్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు ఇది నిజమైన ప్రతిబింబమని ఆయన అన్నారు.  దేశం గర్వపడేలా చేసిన కొచ్చిన్ షిప్‌యార్డ్ భారత నౌకాదళాలను  మంత్రి అభినందించారు.

విక్రాంత్ చోదక వ్యవస్థ, నావిగేషన్కమ్యూనికేషన్ తో పాటు నౌక లోని ఇతర పరికరాలు, భాగాల పనితీరును ప్రయోగ దశలో కఠిన పరిస్థితుల మద్య పరీక్షిస్తారు. హార్బర్ లో అన్ని పరీక్షలను పూర్తి చేసుకున్న 'విక్రాంత్' సముద్ర పరీక్షలకు బయలు దేరింది. కోవిడ్-19 సమయంలో నౌక నిర్మాణాన్ని పూర్తి చేసి పరీక్షలకు సిద్ధం చేయడం దేశం సాధించిన విజయాల్లో ఒక మైలురాయిగా నిలిచి పోతుంది. భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో అతి పెద్ద షిప్ యార్డ్ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ కేంద్ర రేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న ఏకైక షిప్ యార్డ్. మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలతో 2013 ఆగస్టు లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. విమాన వాహక యుద్ధ నౌకలను నిర్మించే శక్తి సామర్ధ్యాలు తమకు ఉన్నాయని భారత్ నిరూపించింది. యుద్ధ నౌకలను నిర్మిస్తున్న దేశాల సరసన భారతదేశం నిలబడింది. 

విమాన వాహక నౌక ప్రాథమిక డిజైన్ ను భారత నౌకాదళానికి చెందిన ఇండియన్ నేవీ డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ రూపొందించింది. ఇంజనీరింగ్నిర్మాణం మరియు సిస్టమ్ ఇంటిగ్రేషన్ ను కొచ్చిన్  షిప్‌యార్డ్ లిమిటెడ్ చేపట్టి పూర్తి చేసింది. నౌకలోని అన్ని భాగాలను 3డి లో వీక్షించేలా చూడడానికి షిప్ యార్డ్ ఆధునిక  సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించింది. విమాన వాహక నౌక  పరిమాణంలో ఒక నౌకను  పూర్తిగా 3 డి మోడల్‌లో రూపొందించి  3 డి మోడల్ ఉపయోగించి  సిద్ధం చేసిన ప్రొడక్షన్ డ్రాయింగ్‌లతో నిర్మించడం దేశంలోనే తొలిసారి.

40000 టన్నుల బరువుతో ఒక నౌకను దేశంలో నిర్మించడం ఇదే తొలిసారి. దీని నిర్మాణం కోసం 21,000 టన్నుల ప్రత్యేక గ్రేడ్ ఇనుమును స్వదేశంలో ఉత్పత్తి చేసి వినియోగించడం జరిగింది. నౌకను నిర్మించడం కోసం 2000 కిలోమీటర్ల పొడవైన కేబుళ్లను, 120 కిలోమీటర్ల పొడవైన పైపులను ఉపయోగించడం జరిగింది. నౌకలో 2300 కంపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉంటాయి.

విమాన వాహక నౌక ఒక చిన్న తేలియాడే నగరంగా ఉంటుంది.  రెండు ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంతో ఒక విమాన డెక్ ప్రాంతం ఉంటుంది. సూపర్‌స్ట్రక్చర్‌తో సహా స్వదేశీ విమాన వాహక నౌక 262 మీ పొడవు, 62 మీటర్ల వెడల్పు భాగంలో మరియు 59 మీటర్ల ఎత్తులో  ఉంటుంది.  ‘విక్రాంత్’ దాదాపు 28 నాట్ల గరిష్ట వేగం మరియు 18 నాట్ల క్రూయిజింగ్ వేగాన్ని సుమారు 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉంది.  సూపర్ స్ట్రక్చర్‌లో ఐదు సహా మొత్తం 14 డెక్‌లు ఉన్నాయి.  ఓడలో 2,300 కంపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి.  మహిళా అధికారులకు వసతి కల్పించడానికి ప్రత్యేకమైన క్యాబిన్‌లతో సహా దాదాపు 1700 మంది సిబ్బంది కోసం నౌకను నిర్మించారు.

 

 ***


(Release ID: 1742366) Visitor Counter : 229