వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కనీస మద్దతు ధరతో రైతులకు ప్రయోజనం
Posted On:
03 AUG 2021 6:44PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర-రాష్ట్ర సంస్థల ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)తో పంటలను కొనుగోలు చేస్తోంది. దీంతోపాటు ప్రభుత్వం ప్రకటించే ‘ఎంఎస్‌పి’కి అనుగుణంగా మార్కెట్లు కూడా స్పందిస్తున్నాయి. ఆ మేరకు ప్రభుత్వ కొనుగోలు కార్యకలాపాల ప్రభావంతో వివిధ పంటలకు ప్రకటించిన ‘ఎంఎస్‌పి’కి అనుగుణంగా లేదా అంతకన్నా ఎక్కువ ధరతో ప్రైవేటు కొనుగోళ్లు కూడా సాగుతున్నాయి. అందువల్ల ‘ఎంఎస్‌పి’ వల్ల లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్యను కచ్చితంగా ప్రకటించడం కష్టసాధ్యం. అయినప్పటికీ ‘ఎంఎస్‌పి’ కింద ప్రభుత్వ కొనుగోళ్లద్వారా లబ్ధిపొందిన రైతుల సంఖ్య కిందివిధంగా ఉంది:-
2018-19
|
2019-20
|
2020-21
|
1,71,50,873
|
2,04,63,950
|
2,10,07,563
|
‘వ్యవసాయ వ్యయాలు-ధరల కమిషన్’ (సీఏసీపీ) సిఫారసులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు పంట కాలాల్లో ‘సముచిత సగటు నాణ్యత’గల 22 ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను ప్రకటిస్తోంది. అంతేకాకుండా వివిధ పథకాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించే వెసులుబాటు కూడా కల్పించింది.
ప్రభుత్వ సంస్థల ద్వారా ‘ఎంఎస్‌పి’ కింద కొనుగోళ్లు సజావుగా సాగడానికి, రైతులకు గరిష్ఠంగా లబ్ధి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పంట దిగుబడులు, మార్కెట్లకు రాగల మిగులు పంటలు, రైతులకు రవాణా-నిల్వవంటి మౌలిక వసతుల లభ్యతసహా ప్రస్తుత మండీలతోపాటు డిపోలు/గిడ్డంగులవంటి ఇతరత్రా సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ అంచనాల ఆధారంగా అదనంగా ‘నాఫెడ్, ఎఫ్‌సీఐ’ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. తద్వారా రైతులకు కనీస మద్దతు ధరపై కొనుగోళ్లకు భరోసా ఇస్తున్నాయి. అలాగే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కాకుండా తమకు అనుకూలమైన చోట లేదా ‘ఎంఎస్‌పి’తో పోలిస్తే మరింత మెరుగైన ధరతో ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కూడా రైతులకు ఉంటుంది.
కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభలో ఇవాళ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం కింద ఈ సమాచారమిచ్చారు.
***
(Release ID: 1742125)
Visitor Counter : 197