రక్షణ మంత్రిత్వ శాఖ
“మేక్ ఇన్ ఇండియా” పథకం కింద ధనుస్, ఆకాశ్ వ్యవస్థల తయారీ!
Posted On:
02 AUG 2021 3:02PM by PIB Hyderabad
‘మేక్ ఇన్ ఇండియా’ పథకం కింద భారత ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా అనేక రక్షణ ఉత్పాదనల తయారీని చేపట్టింది. ‘ధనుస్’ పేరుతో155ఎం.ఎం. శతఘ్ని వ్యవస్థను, వంతెన వేయగలిగే యుద్ధ ట్యాంకును, ‘తేజస్’ అనే తేలికరకం యుద్ధ విమానాలను, భూ ఉపరితలంనుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ‘ఆకాశ్’ అనే క్షిపణి వ్యవస్థను, ‘ఐ.ఎన్.ఎస్. కల్వరీ’ జలంతర్గామిని మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితోనే తయారు చేశారు. అలాగే, తీరప్రాంతపు పెట్రోల్ నౌక, తీరం వద్దనే ఉండే నిఘా నౌక, ‘ఐ.ఎన్.ఎస్. చెన్నై’ నౌకను, జలంతర్గామి విధ్వంసక యుద్ధశైలి నౌక (ఎ.ఎస్.డబ్ల్యు.సి.), అర్జున్ అనే మరమ్మతు వాహనం, ల్యాండింగ్ క్రాఫ్ట్ వినియోగ వ్యవస్థ, 155ఎం.ఎం. మందుగుండు సామగ్రికి బై మాడ్యులర్ చార్జింగ్ వ్యవస్థ, టి-72 యుద్ధ ట్యాంకుకోసం థర్మల్ ఇమేజింగ్ సైట్ మార్క్-II వ్యవస్థ వంటివి కూడా మేక్ ఇన్ ఇండియా పథకం కిందనే తయారయ్యాయి. వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ వ్యవస్థ, తీరం సమీప దూరంలో పెట్రోల్ వాహన వ్యవస్థ, ప్రత్యర్థులను అటకాయించే బోటు, ఐ.ఎన్.ఎస్. ఖండేరీ, మధ్య తరహా బుల్లెట్ ప్రూఫ్ వాహనం (ఎం.బి.పి.వి.ని), పైలట్ లెస్ టార్గెట్ విమానంకోసం లక్ష్య ప్యారాచ్యూట్ తదిర ఉత్పాదనలు కూడా ఇదే పథకం స్ఫూర్తితోనే రూపుదిద్దుకున్నాయి.
మేక్ ఇన్ ఇండియా పథకం కింద రక్షణ ఉత్పాదనల తయారీ రంగంలో స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వ విధానపరంగా అనేక చర్యలు తీసుకుంది. పలు సంస్కరణలను కూడా చేపట్టింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పాదనల రూపకల్పనను ప్రోత్సహించడం, దేశంలోనే రక్షణ పరికర సామగ్రిని తయారీ చేయడం,.. తద్వారా దీర్ఘకాలంలో దిగుమతులపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తగ్గించుకోవడం అన్న లక్ష్యాలతో ప్రభుత్వం విధానపరంగా అనేక పథకాలు చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సంస్కరణల వివరాలు ఈ దిగువన చూడవచ్చు: -
- 2016వ సంవత్సరపు రక్షణ ఉత్పాదనల సేకరణ ప్రక్రియ (డి.పి.పి.-2016)ను పూర్తిగా సవరించారు. 2020వ సంవత్సరపు రక్షణ సమీకరణ ప్రక్రియ (డి.ఎ.పి.-2020)కు రూపకల్పన చేశారు. ‘ఆత్మనిర్భర భారత్ అభియాన్’ ప్రకటనలో భాగంగా పేర్కొన్న రక్షణ సంస్కరణల సూత్రాలకు అనుగుణంగా కొత్త సమీకరణ ప్రక్రియను తీర్చిదిద్దారు.
- రక్షణ పరికర సామగ్రిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రధాన రక్షణ పరికర సామగ్రికి సంబంధించి దేశీయంగా రూపొందిన, తయారైన ఉత్పాదనల (ఇండియన్ ఐ.డి.డి.ఎం.)ను సేకరించడానికే అగ్రప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు.
- సానుకూల స్వదేశీకరణ జాబితాల కింద 209 ఉత్పాదనలను సూచిస్తూ కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. ఆయా ఉత్పాదనలపై సూచించిన గడువును మించి వాటి దిగుమతులను చేపట్టకుండా ఆంక్షలు విధిస్తూ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనితో భారతీయ సాయుధ బలగాల అవసరాలకు తగిన ఉత్పాదనలను,.. భారతీయ రక్షణ పరిశ్రమ తన సొంత నమూనాల్లో, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడానికి మంచి అవకాశం దొరికింది.
- ఉత్పాదనకు సంబంధించిన పెట్టుబడుల సేకరణ ప్రక్రియను సడలించారు. దీనితో మేక్-వన్ కేటగిరీ కింద ఉత్పాదనలను తయారు చేసే రక్షణ పరిశ్రమలకు రూపకల్పనా వ్యయంలో 70శాతం వరకూ ప్రభుత్వం అందించేందుకు అవకాశం కల్పించారు. దీనికితోడు, ఈ విషయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఇ.లకు) కొన్ని ప్రత్యేక రిజర్వేషన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
- ఇక 2016వ సంవత్సరపు రక్షణ ఉత్పాదనల సేకరణ ప్రక్రియలో మేక్-టూ కేటగిరీకి చెందిన పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ ఉత్పాదనల రూపకల్పనను, తయారీని ప్రోత్సహించేందుకు పరిశ్రమలకు ప్రయోజనకరమైన అనేక ఏర్పాట్లను ఈ ప్రక్రియలో పొందుపరిచారు. అర్హతా నిబంధనల సడలింపు, కనీస డాక్యుమెంటేషన్.కు అనుమతి, పరిశ్రమలు, వ్యక్తులు సూచించే ప్రతిపాదనల పరిశీలనలోకి తీసుకోవడం వంటి అనేక సడలింపులను అమలులోకి తెచ్చారు. ఇప్పటివరకూ సాయుధ బలగాలు, నావికాదళం, వైమానికా దళానికి సంబంధించిన 58 ప్రాజెక్టులకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది.
- మూలధన సేకరణకు సంబంధించి ఆర్థిక పరమైన అధికారాల పంపిణీ పరిధిని పెంచడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాయుధ బలగాల్లో ఉపప్రధానాధిపతి దిగువ స్థాయి అధికారులకు ఈ అధికారాలను దఖలు పరచడానికి ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో అమోదం తెలిపింది. ఉత్పాదనల నమూనా రూపకల్పన వ్యయంలో ప్రభుత్వం 70శాతం భరించేందుకు వీలు కలిగించే మేక్-వన్ కేటగిరీ పరిశ్రమలకు ఆర్థిక అధికారాల పంపిణీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
- రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్.డి.ఐ.) వాటాను భారత ప్రభుత్వం 74శాతంవరకూ పెంచింది. ఆటోమేటిక్ మార్గం ద్వారా 74శాతం వరకూ ఎఫ్.డి.ఐ.ల వాటాను పెంచింది. ప్రభుత్వ మార్గం ద్వారా వందశాతం వరకూ ఎఫ్.డి.ఐ. పెంపుదలకు ఆమోద ముద్ర వేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానం, తదితర అవకాశాలు ఉన్నచోట ఈ సడలింపునకు ప్రభుత్వం ఆమోదించింది.
- రక్షణ ప్రతిభాపూర్వక ఉత్పాదనలకోసం సృజనాత్మక వ్యవస్థలను (ఐ.డి..ఇ.ఎక్స్.లను) 2018 ఏప్రిల్ నెలలో ప్రారంభించారు. రక్షణ, గగనతల రంగాల్లో సృజనాత్మకతను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే సానుకూల వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో ఐ.డి.ఇ.ఎక్స్.కు రూపకల్పన చేశారు. ఇందుకోసం ఎం.ఎస్.ఎం.ఇ.లకు, స్టార్టప్ కంపెనీలకు, వ్యక్తుల సృజనాత్మక ప్రాజెక్టులకు, రక్షణ పరిశోధనా సంస్థలకు ఈ ప్రక్రియలో ప్రమేయం కల్పిస్తారు. భారతీయ రక్షణ, గగనతల రంగాల అవసరాలకు తగినట్టుగా రక్షణ, పరిశోధనా ప్రక్రియలను చేపట్టేందుకు ఆయా సంస్థలకు ప్రభుత్వం గ్రాంట్లు, నిధులు అందిస్తుంది.
- రక్షణ ఉత్పాదనల స్వదేశీకరణ లక్ష్యంతో శ్రీజన్ (SRIJAN) పేరిట ఒక వెబ్ పోర్టల్.ను 2020 ఆగస్టులో ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల, ఆయుధాల ఫ్యాక్టరీల బోర్డు కోసం ఈ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఎం.ఎస్.ఎం.ఇ.లకు, స్టార్టప్ కంపెనీలకు ప్రత్యామ్నాయ దిగుమతులకోసం బోర్డు తగిన మద్దతు ఇచ్చేందుకు వీలుగా ఈ చర్య తీసుకున్నారు.
- 2020వ సంవత్సరపు రక్షణ సేకరణ ప్రక్రియ ఆఫ్ సెట్ విధానంలో పలు సంస్కరణలను పొందుపరిచారు. ఈ విషయంలో రక్షణ పరికర సామగ్రి ఉత్పాదన కోసం పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానం బదిలీని ఆకర్షించే అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు.
- 2017 మే నెలలో ‘వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా (ఎస్.పి.)’పై ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ వెలువరించింది. భారతీయ సంస్థలతో పారదర్శకంగా, పోటీ తత్వంతో కూడిన సుదీర్ఘకాలపరిమితిగల భాగస్వామ్యాల ఏర్పాటుకు నోటిఫికేషన్ అవకాశం కల్పించింది. దీనితో స్వదేశీ తయారీ, సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయి ఒరిజనల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఒ.ఇ.ఎం.)లతో ఒప్పందం కుదర్చుకోవడానికి వీలవుతోంది.
- రక్షణ ఉత్పాదనల తయారీ వేదికల్లో వినియోగించే విడిభాగాల స్వదేశీ తయారీకి సంబంధించి ఒక విధానాన్ని ప్రభుత్వం 2019 మార్చిలో ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. దిగుమతి చేసుకునే విడిభాగాలను ఇకపై స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ చేసే సానుకూల వాతావరణం కల్పించడానికే ఈ నోటిఫికేషన్ వెలువరించారు.
- రక్షణ ఉత్పాదనలకు సంబంధించి దేశంలో రెండు పారిశ్రామిక కారిడార్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రూ. 20వేల కోట్ల పెట్టుబడితో ఈ కారిడార్ల నిర్మాణానికి సంకల్పించారు. ఈ రెండు కారిడార్లకోసం ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలనుంచి దాదాపు రూ. 3,342కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. దీనికి తోడుగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ గగనతల, రక్షణ రంగ విధానాలను ప్రచురించాయి. ఈ రెండు కారిడార్లలోనూ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ తోపాటుగా ప్రైవేటు కంపెనీలు, విదేశీ కంపెనీలనుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు సంబంధిత రాష్ట్రాలు తమ విధానాలను ప్రకటించాయి.
- రష్యన్, సోవియట్ మూలాలున్న రక్షణ ఉత్పాదనల విడి భాగాల ఉమ్మడి తయారీపై పరస్పర సహకారం కోసం ఉభయ ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందం (ఐ.జి.ఎ.) 2019 సెప్టెంబరులో కుదిరింది. భారతీయ సాయుధ బలగాల్లో ప్రస్తుతం వినియోగంలో ఉన్న రష్యన్ మూలాలున్న పరికరాలకు సంబంధించి అమ్మకాల అనంతర మద్దతును పెంచుకునే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యన్ ఉత్పత్తి మూలాలున్న విడిభాగాలను భారతీయ భూభాగంలో తయారు చేసేందుకు వీలుగా రష్యన్ తయారీదారు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతోపాటుగా, ఉమ్మడి సంస్థలను ఏర్పాటు చేసుకోనున్నారు.
- పారిశ్రామిక లైసెన్సులు అవసరమైన రక్షణ ఉత్పాదనల జాబితాను కూడా హేతుబద్ధీకరించారు. తద్వారా చాలా వరకు విడిభాగాల అంతర్భాగాల తయారీకోసం పారిశ్రామిక లైసెన్సు తీసుకోవలసిన అవసరం లేకుండా నిబంధనలను సడలించారు. పారిశ్రామికాభివృద్ధి నియంత్రణ చట్టం (ఐ.డి.ఆర్.) కింద ఇచ్చిన ముందస్తు అనుమతి కాలపరిమితిని మూడేళ్లనుంచి 15 సంవత్సరాలకు పొడిగించారు. ఆయా కంపెనీల పరిస్థితిని బట్టి అదనంగామరో మూడేళ్లవరకూ గడువును పొడిగించేందుకు కూడా వెసులుబాటు కల్పించారు.
- 2017లో కేంద్ర పారిశ్రామిక అంతర్గత వాణిజ్య విభాగం (డి.పి.ఐ.ఐ.టి.) జారీ చేసిన తాజా సేకరణ ఉత్తర్వుకు అనుగుణంగా 46 ఉత్పాదనలపై రక్షణ ఉత్పత్తుల శాఖ ఒక నోటిఫికేషన్.ను వెలువరించింది. ఈ ఉత్పాదనలకు స్థానికంగా తగిన పోటీ ఉందని, ఈ ఉత్పాదనల కొనుగోలు విలువతో సంబంధం లేకుండా సదరు ఉత్పాదనల సేకరణ స్థానిక సరఫరాదార్లనుంచే జరగాలని ఈ నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
- రక్షణ మంత్రిత్వ శాఖలో 2018 ఫిబ్రవరి నెలలో రక్షణ పెట్టుడిదార్ల విభాగం (డి.ఐ.సి.) ఏర్పాటైంది. పెట్టుబడుల అవకాశాలు, పెట్టుబడుల ప్రక్రియ తదితర అంశాలకు సంబంధించిన సందేహాలను, సమస్యలను నివృత్తి చేసేందుకు, సంబంధిత ఇతర సమాచారం అందజేసేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. డి.ఐ.సి. ఇప్పటివరకూ 1,162 సందేహాలను, ఫిర్యాదులను పరిష్కరించింది.
రక్షణ రంగం ప్రస్తుతం ప్రైవేటు భాగస్వామ్యానికి తగిన అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. దేశంలో ఎక్కడైనా సరే ప్రైవేటు పెట్టుబడిదార్లకు లైసెన్స్ ఇచ్చేందుకు సానుకూలంగా ఉంది. ప్రస్తుతం బీహార్ లోని నలందాలో ఆయుధాల తయారీ ఫ్యాక్టరీని ఒకదానిని ఏర్పాటు చేశారు.
రక్షణశాఖ సహాయ మంత్రి ఆజయ్ భట్ ఈ రోజు రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాలు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
***
(Release ID: 1741694)
Visitor Counter : 196