రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కార్‌ నికోబార్‌ నుంచి చేపల వేట పడవను రక్షించిన ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌

Posted On: 31 JUL 2021 11:33AM by PIB Hyderabad

అండమాన్‌, నికోబార్‌ దీవుల సముదాయంలోని కార్‌ నికోబార్‌ వద్ద సముద్ర జలాల్లో ఆగిపోయిన చేపల వేట పడవ సలేత్ మాథా-II నుంచి, ఈ నెల 30న రాత్రి 11 గంటలకు సహాయ సందేశాన్ని ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ అందుకుంది. ఆపరేషన్‌ సముద్రసేతు-IIలో భాగంగా, ఇండోనేషియాలోని జకార్తాకు కొవిడ్‌ ఉపశమన సామగ్రి అందించి, తిరిగి వస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌కు సందేశం అందింది. వెంటనే సాయం అందించేందుకు గరిష్ట వేగంతో చేపల వేట పడవ వద్దకు చేరుకుంది. పోర్టుబ్లెయిర్‌కు చెందిన ఆ చేపల వేట పడవ పొడవు 20 మీటర్లు. ఏడుగురు సిబ్బంది ఉన్నారు. 29వ తేదీన ఉదయం నుంచి గేర్‌ బాక్స్‌లో లోపం కారణంగా ఆ పడవ అక్కడే ఆగిపోయింది. అప్పటి నుంచి సహాయాన్ని అర్థిస్తూ సందేశాలు పంపుతున్నారు. ఆ ప్రాంతంలో 25 నాట్లకుపైగా వేగంతో గాలులు వీస్తున్నాయి. మూడున్నర మీటర్ల ఎత్తుతో కెరటాలు విరుచుకుపడుతున్నాయి. చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల కారణంగా అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతుండడంతో ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌తో ఆ పడవ అనుసంధాన ఏర్పాట్లు చాలా కష్టమయ్యాయి. తదుపరి సహాయం కోసం ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ ఆ చేపల పడవను నౌకాశ్రయానికి తీసుకెళుతోంది.

 

***

 


(Release ID: 1741005) Visitor Counter : 222