ఆయుష్
కరోనా కట్టడిపై అవగాహనావ్యాప్తికి ఆయుష్ ద్వారా కేంద్రం చర్యలు
నాడు పోస్టు చేయడమైనది:
30 JUL 2021 4:55PM by PIB Hyderabad
దేశంలో కోనా వైరస్ వ్యాప్తి కట్టడికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కోవిడ్-19 నియంత్రణకు సంబంధించి ఆయుష్ (Ayush) మంత్రిత్వ శాఖ నిర్వహించాల్సిన పాత్రపై జాతీయ సంస్థలు, పరిశోధనా మండలులు అనేక అధ్యయనాలు నిర్వహించాయి. ఇప్పటివరకూ నిర్వహించిన 126 అధ్యయనాల్లో రోగనిరోధానికి తీసుకోవలసిన చర్యలపై చేపట్టిన 42 పరిశోధనలు కూడా ఉన్నాయి. వీటితోపాటుగా, 40 మధ్యవర్తిత్వ పరిశోధనలు, 11పరిశీలనాత్మక పరిశోధనలు, 22 పూర్వ చికిత్సా/ప్రయోగాత్మక అధ్యయనాలు కూడా ఉన్నాయి. ఒక వ్యవస్థాత్మక సమీక్ష, సర్వేతో కూడిన 8 అధ్యయనాలు, ఏకవిషయ అధ్యయనం కూడా ఈ పరిశోధనల్లో నిర్వహించారు. సంప్రదాయ వైద్య విధానాల వారీగా పరిశోధనలు చేపట్టారు. ఆయుర్వేదానికి సంబంధించి 66 పరిశోధనలు, హోమియోపతి విధానంలో 26 పరిశోధనలు, సిద్ధ వైద్య విధానంలో 13 పరిశోధనలు, యునానీ వైద్యంలో 8 పరిశోధనలు, యోగా, ప్రకృతి వైద్యంలో 13 అధ్యయనాలు జరిగాయి. మొత్తం 90 అధ్యయనాలు పూర్తయ్యాయి. అధ్యయనాలపై 10 పరిశోధనా పత్రాలను ప్రచురించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పరిశోధనా మండలలు, జాతీ సంస్థల ఆధ్వర్యంలో ఈ అధ్యయనాలు జరిగాయి.
ఈ పరిశోధన అనంతరం ఆయుష్-64, కబసుర్ కుడినీర్ ఔషధాలను కోవిడ్-19 చికిత్సలో అదనపు ప్రత్యామ్నాయంగా వాడవచ్చని గుర్తించారు. వ్యాధి లక్షణాలు లేని రోగులకు, స్వల్ప లక్షణాలతో కూడిన కరోనా బాధితులకు అందించే చికిత్సలో ఆయుష్-64 అనే ఔషధం సమర్థంగా పనిచేస్తున్నట్టు పరిశోధనా ఫలితాలు తేల్చిచెప్పాయి. స్వల్ప లక్షణాలు, ఒక మోస్తరు లక్షణాల కేసుల చికిత్సలో ఈ ఔషధం ఉపయోగపడుతుందని కూడా పరీక్షలు రుజువు చేశాయి. ఈ ఔషధం వాడినపుడు రోగుల స్వస్థతలో గణనీయమైన మెరుగుదల కనిపించినట్టు పరిశీలనాత్మకంగా తేలింది. దీనికి తోడుగా, సిద్ధవైద్య విధానంలో రూపొందిన కబసుర్ కుడినీర్ అనే ఔషధం కూడా స్వల్ప లక్షణాలు, ఒక మోస్తరు లక్షణాల కోవిడ్ రోగుల చికిత్సలో మంచి ఫలితాలను సాధించినట్టు తేలింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర సిద్ధ వైద్య పరిశోధనా మండలి (సి.సి.ఆర్.ఎస్.) ఇదే అంశాన్ని ప్రయోగాత్మకంగా ధ్రువీకరించింది.
అయితే, అలోపతి, హోమియో పతి మందులకు, వ్యాక్సీన్లకు పూర్తి ప్రత్యామ్నాయ ఔషధాలుగా ఇవి ఎలా పనిచేస్తాయన్న విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
ఇక అంటువ్యాధుల సంక్రమణను నిరోధించేందుకు, ప్రత్యేకించి కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు సంబంధించి ప్రజలకు తగిన ముందస్తు జాగ్రత్తలను, సూచనలను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విస్తృత స్థాయిలో పంపిణీ చేసింది. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణ లక్ష్యంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ఈ కింది చర్యలు తీసుకుంది.–
-
- ఆరోగ్య పరిరక్షణకోసం ముందు జాగ్రత్త చర్యలు, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సంబంధించిన స్వీయ రక్షణ మార్గదర్శక సూత్రాలను సిఫార్సు చేసింది.
- “కోవిడ్-19 నియంత్రణ కోసం అయుర్వేదం, యోగా విధానాల ప్రాతిపదికన రూపొందించిన జాతీయ వైద్య చికిత్సా నిర్వహణా నియమాల”ను ఆయుష్ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. జాతీయ కార్యాచరణ దళం ఈ నియమాలను తయారు చేసింది. వివిధ నిపుణుల కమిటీలనుంచి సాధించిన ఏకాభిప్రాయం ద్వారా ఈ నియమాలకు రూపకల్పన చేశారు.
- ఆయుష్ పరిధిలోకి వచ్చే వైద్య విధానాలను అనుసరించే రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్లకు (వైద్యులకు) మార్గదర్శక సూత్రాలను కూడా విడుదల చేశారు. వివిధ పరిశోధనా మండలలుల డైరెక్టర్ జనరల్స్, జాతీయ సంస్థల డైరెక్టర్లు తమ, తమ నిపుణుల బృందంతో కలసి ఈ మార్గదర్శక సూత్రాలను తయారు చేశారు ఇవే మార్గదర్శక సూత్రాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆయుష్ పరిశోధనా, అభివృద్ధి టాస్క్ ఫోర్స్ ధ్రువీకరించింది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల (వైద్యుల) వినియోగం కోసం ఈ మార్గదర్శక సూత్రాలను బహిరంగ వేదికలపై అందుబాటులో ఉంచారు. కోవిడ్-19 చికిత్స నిర్వహణలో వైద్యులు ఏకరూప విధానంలో పనిచేయడానికి ఈ మార్గదర్శక సూత్రాలు దోహదపడతాయి.
- కోవిడ్-19కు సంబంధించి స్వీయ రక్షణకోసం ఆయుర్వేద, యునానీ, సిద్ధ వైద్యవిధానాల్లోని ముందస్తు జాగ్రత్తలను ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. డాక్టర్ల సలహాలతో ఇంటివద్దనే (హోమ్ ఐసొలేషన్.లో) చికిత్స తీసుకునే రోగులకోసం మార్గదర్శక సూత్రాలను కూడా వెలువరించింది.
- ఆయుష్ వైద్యవిధానంలో చికిత్స అందించే ప్రాక్టీషనర్లకు (వైద్యులకు) సలహాలు, సూచనలను, నైతికంగా పాటించాల్సిన అంశాలను కూడా విడుదల చేశారు.
- వైరస్ మహమ్మారి రెండవ ఉధృతి (సెకండ్ వేవ్) సమయంలో, వ్యాధి లక్షణాలు లేని రోగులకు, స్వల్ప లక్షణాలు, ఒక మోస్తరు లక్షణాలు కరోనా రోగులకు ఆయుష్-64, కబసురా కుడినీర్ ఔషధాలు ఎంతో ఉపయోగకరమైనవిగా నిర్ధారణ అయింది. దేశంలోని శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు ఇదే అంశాన్ని ధ్రువీకరించాయి.
- ఆయుష్ వైద్యవిధానాల ద్వారా గరిష్టష్టాయిలో ప్రయోజనాలను అందించేందుకు, ఆయుష్-64, కబసురా కుడినీర్ మందులను పంపిణీ చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రచారాన్ని, అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ పరిశోధనా మండలలులు, జాతీయ సంస్థలు ఈ ప్రచారం చేపట్టాయి.
- చిన్నపిల్లలకు కోవిడ్ సోకకుండా తీసుకోవలసిన ముందస్తు నిరోధక చర్యలగురించి ఇంటి సంరక్షణలో ఉండే పిల్లలకు మార్గదర్శక సూత్రాలను, ఆయుష్ ప్రాక్టీషనర్లకు సూచనలను ఆయుష్ శాఖ విడుదల చేసింది.
ప్రత్యామ్నాయ వైద్య విధానం, సంప్రదాయ వైద్య వ్యవస్థల ద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలు:
- కోవిడ్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలను ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. తరచూ చేతులను శుభ్రపరుచుకోవడం, మాస్కులు ధరించడం, పరిశుభ్రతను పాటించడంతో పాటు అదనంగా అనుసరించవలసిన సలహాలను మంత్రిత్వ శాఖ వెలువరించింది. కొన్ని సాధారణ గృహవైద్య చిట్కాలను కూడా ప్రజలకు సూచించింది.
- కోవిడ్ నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణాచర్యలను, రోగనిరోధక శక్తిని పెంచుకొనే పద్ధతులను ఆయుష్ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది.
- కోవిడ్ కట్టడిలో భాగంగా 33,000మంది మాస్టర్ ట్రెయినర్లకు కేంద్ర ఆయుష్ మత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉమ్మడిగా శిక్షణ అందించాయి. మొత్తంగా, 6,6045 ఆయుష్ సిబ్బందికి ఐగాట్.ఇన్ (igot.in) వేదికగా శిక్షణ ఇప్పించారు. వైరస్ కట్టడికి ఆయుష్ మానవ వనరులను కోవిడ్ యుద్ధవీరుల రూపంలో వినియోగించుకునేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేశాయి.
- “రోగనిరోధక శక్తికోసం ఆయుష్” పేరిట కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మూడు నెలల అవగాహనా కార్యక్రమాన్ని వెబినార్ సదస్సు ద్వారా చేపట్టింది. ఆయుష్ వైద్య విధానాల ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే అంశంపై అవగాహనా కార్యక్రమ సమాచార లేఖను కూడా మంత్రిత్వ శాఖ ప్రచురిస్తోంది. వెబినార్ సదస్సులో 50వేలమందికి పైగా పాలుపంచుకున్నారు.
- “కోవిడ్ చికిత్స నిర్వహణకోసం ఆయుర్వేదం, యోగా ప్రాతిపదికగా జాతీయస్థాయి వైద్య నియమ నిబంధనలను” భారత ప్రభుత్వం విడుదల చేసింది. నిపుణులతో కూడిన పలు కమిటీల ఏకాభిప్రాయంతో ఈ నియమ నిబంధనలను జాతీయ టాస్క్ ఫోర్స్ తయారు చేసింది.
- ఐసొలేషన్ కేంద్రాలు, కోవిడ్ కేర్ కేంద్రాలు, కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్ ఆసుపత్రుల్లోను, ఇంటివద్ద, డిస్పెన్సరీల్లోను చికిత్స పొందే రోగులకు,.. ప్రత్యేకించి వ్యాధి లక్షణాలు కనిపించని బాధితులు, స్వల్ప లక్షణాలున్న రోగులకోసం కబురా కుడినీర్, ఆయుష్-64 ఔషధాల వినియోగం గురించి ప్రచారం చేయాలని సూచిస్తూ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ (ఎన్.ఒ.ఎస్.-16030/13/3030-ఎన్.ఎ.ఎం.) రాసింది.
- ఆయుష్ వైద్య విధానాలు, ఔషధాల ప్రయోజనాలను ప్రజలకు గరిష్ట స్థాయిలో అందించేందుకు వీలుగా, ఆయుష్-64, కబసురా కుడినీర్ మందుల పంపిణీకోసం దేశవ్యాప్త అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయుష్ మంత్రిత్వ పరిధిలోని పరిశోధనా మండలులు, జాతీయ. సంస్థల ద్వారా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
- కోవిడ్-19 చికిత్సకు సంబంధించి చిన్నారులకు మార్గదర్శక సూత్రాలను, ఆయుష్ వైద్యులకు సలహాలు, సూచనలను ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
- కోవిడ్ వైరస్.ను కట్టడి చేసేందుకు చేపట్టిన కృషిని ప్రజాబాహుళ్య స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రజా మద్ధతుతో కూడిన హెల్ప్.లైన్. (టోల్ ఫ్రీ నంబరు (14443)ను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అమలులోకి తెచ్చింది. కోవిడ్ విసిరే సవాళ్లకు ఆయుష్ ఔషధ ఆధారిత పరిష్కారాలను, సూచించేందుకు ఈ టోల్ ఫ్రీ నంబరును వినియోగంలోకి తెచ్చారు.
- ఆయుష్ క్లినికల్ కేస్ రిపాజిటరీ (ఎ.సి.సి.ఆర్.) పోర్టల్.ను, ఆయుష్ సంజీవని మొబైల్ యాప్ 3వ వెర్షన్.ను ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కోవిడ్ కట్టడిలో ఆయుష్ వైద్యులకు, సాధారణ ప్రజలకు ఒక వేదికగా ఈ పోర్టల్ (https://accr.ayush.gov.in/) ఉపయోగపడుతుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ రోజు లోక్.సభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 1740904)
సందర్శకుల సూచీ సంఖ్య : : 174